ﮯ
ترجمة معاني سورة فاطر
باللغة التلجوية من كتاب الترجمة التلجوية
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ (కారుణ్యాన్నైనా) ఆయన ఆపితే, ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
ఓ మానవులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి! ఏమీ? భూమ్యాకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! అయితే మీరు ఎందుకు మోసగింప (సత్యం నుండి మరలింప) బడుతున్నారు?
మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరించినా (ఇది క్రొత్త విషయం కాదు), వాస్తవానికి నీకు పూర్వం పంపబడిన సందేశహరులు కూడా తిరస్కరింపబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) చివరకు అల్లాహ్ వద్దకే మరలింప బడతాయి.
ఓ మానవులారా! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించరాదు. మరియు ఆ మహా వంచకుణ్ణి (షైతాన్ ను) కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగింపనివ్వకండి.
నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు.
ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం (స్వర్గం) కూడా ఉంటాయి.
ఏమీ? తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడి నందుకు, ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో! (అతడు సన్మార్గంలో ఉన్న వాడితో సమానుడు కాగలడా)? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వానిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు మరియు తాను కోరిన వానికి మార్గదర్శకత్వం చేస్తాడు. కావున నీవు వారి కొరకు చింతించి నిన్ను నీవు దుఃఖానికి గురి చేసుకోకు. నిశ్చయంగా, వారి కర్మలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు.
మరియు అల్లాహ్ యే గాలులను పంపుతాడు. తరువాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తరువాత మేము వాటిని మృత ప్రదేశం వైపునకు పంపి, దానితో ఆ నేలను మరణించిన తరువాత తిరిగి బ్రతికిస్తాము. ఇదే విధంగా, (మానవుల) పునరుత్థానం కూడా జరుగుతుంది.
గౌరవాన్ని కాంక్షించు వాడు తెలుసు కోవాలి, గౌరవమంతా అల్లాహ్ కే చెందుతుందని! మంచి ప్రవచనాన్నీ ఆయన వైపునకు ఎక్కి పోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో! వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర, అదే! నశించి పోతుంది.
మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత ఇంద్రియ బిందువుతో, ఆ తరువాత మిమ్మల్ని (ఆడ-మగ) జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించనూ జాలదు. గ్రంథంలో వ్రాయబడనిదే, పెరుగుతున్న వాడి వయస్సు పెరగనూ జాలదు మరియు ఎవని వయస్సు తరగనూ జాలదు. నిశ్చయంగా, ఇదంతా అల్లాహ్ కు ఎంతో సులభం.
రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి!
ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడు మరియు సూర్యచంద్రులను నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. అవి తమ తమ పరిధిలో, నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉన్నాయి. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు, విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే! మరియు ఆయనను వదలి మీరు వేడుకునే వారు, ఖర్జూర బీజంపై నున్న పొరకు కూడా యజమానులు కారు.
మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు.
ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.
ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి (మీ స్థానంలో) క్రొత్త సృష్టిని తేగలడు.
మరియు అలా చేయటం అల్లాహ్ కు కష్టమైనది కాదు.
మరియు బరువు మోసేవాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు, దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. కాని నిశ్చయంగా, నీవు వారినే హెచ్చరించ గలవు ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు నమాజ్ ను స్థాపిస్తారో. మరియు ఎవడైతే నీతిమంతుడవుతాడో అతడు తన స్వంత (లాభం) కొరకే నీతిమంతుడవుతాడు. మరియు (అందరికీ) అల్లాహ్ వైపునకే మరలి పోవలసి ఉన్నది.
మరియు గ్రుడ్డివాడు మరియు కళ్ళున్నవాడు సరిసమానులు కాజాలరు;
మరియు (అదే విధంగా) చీకట్లు (అవిశ్వాసం) మరియు వెలుగు (విశ్వాసం);
మరియు నీడలు, మరియు ఎండా;
మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లు చేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించ జాలవు.
నీవు (ఓ ముహమ్మద్!) కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే.
నిశ్చయంగా, మేము, నిన్ను సత్యం ప్రసాదించి, శుభవార్తనిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము. మరియు హెచ్చరిక చేసేవాడు వారి మధ్య లేకుండా, ఏ సమాజం కూడా గడచిపోలేదు!
మరియు ఒకవేళ వీరు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తున్నారంటే (ఆశ్చర్యమేమీ కాదు)! ఎందుకంటే, వీరిక పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా తమ ప్రవక్తలను) అసత్యవాదులని తిరస్కరించారు. వారి సందేశహరులు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలను, శాసనాలను (జబుర్ లను) మరియు వెలుగునిచ్చే గ్రంథాన్ని తీసుకొని వచ్చారు.
ఆ తరువాత సత్యతిరస్కారులను నేను (శిక్షకు) గురి చేశాను. (చూశారా) నా శిక్ష ఎంత కఠినమైనదో!
ఏమీ? నీవు చూడటం లేదా? నిశ్చయంగా, అల్లాహ్ యే ఆకాశం నుండి వర్షం కురిపించేవాడని. తరువాత దాని నుండి మేము రంగురంగుల ఫలాలను ఉత్పత్తి చేస్తామని! మరియు పర్వతాలలో తెల్లని, ఎర్రని వివిధ రంగుల చారలను (కొన్నిటిని) మిక్కిలి నల్లగా కూడా చేస్తామని.
మరియు ఇదే విధంగా మానవుల, ఇతర ప్రాణుల మరియు పశువుల రంగులు కూడా వేర్వేరుగా ఉంటాయి. నిశ్చయంగా, అల్లాహ్ దాసులలో జ్ఞానం గలవారు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.
నిశ్చయంగా, అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) పారాయణం చేసేవారు మరియు నమాజ్ ను స్థాపించేవారు మరియు తమకు ప్రసాదించబడిన జీవనోపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా ఖర్చు (దానం) చేసేవారు అందరూ! నష్టంలేని వ్యాపారాన్ని అపేక్షించేవారే!
ఇదంతా అల్లాహ్ వారి ప్రతిఫలాన్ని పూర్తిగా వారికి ఇవ్వాలనీ మరియు తన అనుగ్రహంతో వారికి మరింత అధికంగా ఇవ్వాలనీ! నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.
మరియు (ఓ ముహమ్మద్!) మేము నీపై అవతరింపజేసిన గ్రంథమే నిజమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలలో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవపరిచేది. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులను బాగా ఎరిగేవాడు, సర్వదృష్టికర్త.
ఆ తరువాత మేము ఈ గ్రంథానికి, మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారిని వారసులుగా చేశాము. వారిలో కొందరు తమకు తాము అన్యాయం చేసుకున్న వారున్నారు, మరికొందరు మధ్యస్థంగా ఉండేవారున్నారు, ఇంకా కొందరు అల్లాహ్ సెలవుతో సత్కార్యాలలో మున్ముందు ఉండే వారూ ఉన్నారు. ఇదే ఆ గొప్ప అనుగ్రహం.
శాశ్వతమైన స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. అందు వారు బంగారు కంకణాలు మరియు ముత్యాలతో అలంకరింప బడుతారు. మరియు వారి వస్త్రాలు పట్టుతో చేయబడి ఉంటాయి.
మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: "మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా, మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.
ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు."
మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము.
మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము." (వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది) :"ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు."
నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు.
ఆయనే మిమ్మల్ని భూమిపై ఉత్తరాధికారులుగా చేసినవాడు. కావున ఎవడు (సత్యాన్ని) తిరస్కరిస్తాడో అతని తిరస్కారం అతనిపైననే పడుతుంది. సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారి ప్రభువు వద్ద కేవలం వారి యెడల అసహ్యాన్నే అధికం చేస్తుంది. మరియు సత్యతిరస్కారులకు వారి తిరస్కారం వారికి నష్టాన్నే అధికం చేస్తుంది.
వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే ఈ భాగస్వాములను గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు భూమిలో ఏమి సృష్టించారో నాకు చూపండి? లేదా వారికి ఆకాశాలలో ఏదైనా భాగస్వామ్యం ఉందా? లేదా మేము వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చామా? వారు దాని స్పష్టమైన ప్రమాణంపై ఉన్నారని అనటానికి? అది కాదు, అసలు ఈ దుర్మార్గులు పరస్పరం, కేవలం మోసపు మాటలను గురించి వాగ్దానం చేసుకుంటున్నారు."
నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? నిశ్చయంగా, ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు.
మరియు, ఒకవేళ హెచ్చరిక చేసేవాడు వారి వద్దకు వస్తే! వారు తప్పక, ఇతర సమాజాల వారి కంటే ఎక్కువగా సన్మార్గం మీద ఉండేవారని అల్లాహ్ సాక్షిగా గట్టి ప్రమాణాలు చేస్తారు. కాని హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వచ్చినపుడు మాత్రం (అతని రాక) వారి వ్యతిరేకతను తప్ప మరేమీ అధికం చేయలేక పోయింది;
(ఇది) వారు భూమిలో మరింత దురహంకారంతో తిరుగుతూ, దుష్ట పన్నాగాలు పన్నినందుకు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు, వాటిని పన్నే వారికే హాని కలిగిస్తాయి. తమ పూర్వీకుల పట్ల అవలంబించ బడిన విధానమే (వారి పట్ల కూడా) అవలంబించ బడాలని వారు నిరీక్షిస్తున్నారా ఏమిటి? కాని నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి అతిక్రమాన్ని చూడలేవు.
వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా ఏమిటి? వారికి పూర్వం గతించిన వారు వీరి కంటే అత్యంత బలవంతులైనా, వారి పరిణామం ఏమయిందో వారు చూడలేదా? అల్లాహ్ నుండి తప్పించుకో గలిగేది ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ ఏదీ లేదు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు.
ఒకవేళ అల్లాహ్ మానవులను వారు చేసిన కర్మలకు గానూ పట్టుకోదలిస్తే! (భూమి) మీద ఏ ఒక్క ప్రాణిని కూడా ఆయన వదిలి పెట్టి ఉండేవాడు కాదు! నిజానికి ఆయన వారికి ఒక నియమిత సమయం వరకు గడువునిస్తున్నాడు. కాని వారి గడువు పూర్తయితే; అప్పుడు నిశ్చయంగా, అల్లాహ్ సదా తన దాసులను స్వయంగా చూసుకుంటాడు.