ﮘ
ترجمة معاني سورة يوسف
باللغة التلجوية من كتاب الترجمة التلجوية
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
అలిఫ్ - లామ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు.
వాస్తవంగా, మీరు బాగా అర్థం చేసుకోవాలని, మేము ఈ ఖుర్ఆన్ ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము.
(ఓ ప్రవక్తా!) మేము ఈ ఖుర్ఆన్ ద్వారా అవతరింపజేసిన కథలలో ఉత్తమమైన గాథను నీకు వినిపించ బోతున్నాము మరియు ఇంతకు ముందు నీవు దీనిని ఎరుగవు.
(జ్ఞాపకం చేసుకోండి) యూసుఫ్ తన తండ్రితో: "ఓ నాన్నా! నేను వాస్తవంగా (కలలో) పదకొండు నక్షత్రాలను, సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి చూశాను; వాటిని నా ముందు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను." అని అన్నప్పుడు!
(అతని తండ్రి) అన్నాడు: "ఓ నా చిన్న ప్రియకుమారుడా! నీ స్వప్నాన్ని నీ సోదరులకు తెలుపకు. ఎందుకంటే వారు నీకు విరుద్ధంగా కుట్ర పన్నవచ్చు! నిశ్చయంగా, షైతాన్ మానవునికి బహిరంగ శత్రువు.
"మరియు ఆ విధంగానే జరుగుతుంది! నీ ప్రభువు నిన్ను ఎన్నుకుంటాడు మరియు నీకు సంఘటనల (స్వప్నాల) గూడార్థ వివరణ కూడా నేర్పుతాడు మరియు నీ పూర్వీకులైన (తాతముత్తాతలైన), ఇబ్రాహీమ్ మరియు ఇస్ హాఖ్ లకు ప్రసాదించినట్లు నీకూ మరియు యఅఖూబ్ సంతతి వారికి సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా, నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
వాస్తవానికి, యూసుఫ్ మరియు అతని సోదరుల (గాథలో) అడిగే వారికి ఎన్నో సూచనలు ఉన్నాయి.
అప్పుడు వారు (యూసుఫ్ సోదరులు) పరస్పరం ఇలా అనుకున్నారు: "మనది ఒక బలమైన వర్గం, అయినప్పటికీ యూసుఫ్ మరియు అతన సోదరుడు (బెన్యామీన్) అంటే మన తండ్రికి మన కంటే ఎక్కువ ప్రేమ. నిశ్చయంగా, మన తండ్రి స్పష్టమైన తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు."
(వారిలో ఒకడు ఇలా అన్నాడు): "యూసుఫ్ ను చంపండి, లేదా అతణ్ణి ఎక్కడైనా ఒంటరిగా వదలి పెట్టండి. ఇలా చేసినట్లయితే మీ తండ్రి ధ్యాస (ప్రేమ) కేవలం మీ వైపునకే మరలుతుంది. ఆ తరువాత మీరు (ప్రాయశ్చిత్తం చేసి) సద్వర్తనులుగా ప్రవర్తించండి."
వారిలో మరొకడు అన్నాడు: "యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి, ఎవరైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు!"
వారు అన్నారు: "నాన్నా! నీవు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని శ్రేయోభిలాషులము!
రేపు అతనిని మా వెంట పంపండి, అతడు అక్కడ ఆడుకొని సంతోషపడతాడు. మరియు మేము తప్పక అతనికి రక్షకులముగా ఉంటాము."
(వారి తండ్రి యఅఖూబ్) అన్నాడు: "మీరు అతనిని తీసుకొని పోవటం నిశ్చయంగా నన్ను చింతాక్రాంతునిగా చేస్తోంది. మీరు అతని విషయంలో ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతనిని ఏదైనా తోడేలు తిని వేస్తుందేమోనని నేను భయపడుతున్నాను."
వారన్నారు: "మేము ఇంత పెద్ద బలగం ఉన్నప్పటికీ అతనిని తోడేలు తినివేస్తే! నిశ్చయంగా మేము పనికిరాని (చేతకాని) వారమే కదా!"
ఆ పిదప వారు అతనిని తీసుకొని పోయి ఒక లోతు బావిలో పడ వేద్దామని నిర్ణయించుకున్నారు. అప్పుడు మేము అతనికి దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలిపాము: "నీవు (ఒక రోజు) వారికి ఈ కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చే సమయం వస్తుంది మరియు వారు నిన్ను గుర్తుపట్టలేరు."
మరియు ఇషా సమయంలో (చీకటి పడ్డ తరువాత) వారు తమ తండ్రి వద్దకు ఏడ్చుకుంటూ వచ్చారు.
వారన్నారు: "ఓ నాన్నా! మేము పరుగు పందాలలో మునిగి పోయాము. మరియు యూసుఫ్ ను మేము మా సామాగ్రి వద్ద విడిచి వెళ్లాము; అప్పుడు ఒక తోడేలు అతనిని తిని పోయింది. మరియు మేము సత్యం పలికినా నీవు మా మాట నమ్మకపోవచ్చు!"
వారు అతని అంగికి బూటకపు రక్తాన్ని పూసి తెచ్చారు. (వారి తండ్రి) అన్నాడు: "మీ ఆత్మ మిమ్మల్ని (ఒక ఘోర) కార్యాన్ని (విషయాన్ని), తేలికైనదిగా అనిపించేటట్లు చేసింది. ఇక (నా కొరకు) సహనమే మేలైనది. మరియు మీరు చెప్పే విషయంలో అల్లాహ్ సహాయమే నేను కోరేది!"
మరియు అటు వైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు తమ నీరు తెచ్చే మనిషిని పంపారు, అతడు (బావిలో) బొక్కెనను దింపాడు. (అతనికి బావిలో ఒక బాలుడు కనిపించగా) అన్నాడు: "ఇదిగో శుభవార్త! ఇక్కడ ఒక బాలుడున్నాడు." వారు అతనిని ఒక వ్యాపార సరుకుగా (బానిసగా) భావించి దాచుకున్నారు. మరియు వారు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
మరియు వారు స్వల్ప ధరకు, కొన్ని దిర్హములకు మాత్రమే అతనిని అమ్ముకున్నారు. మరియు అసలు వారు అతనికి ఎలాంటి ప్రాధాన్యతనివ్వలేదు.
మరియు అతనిని కొన్న ఈజిప్టు (మిస్ర్) వాసి తన భార్యతో అన్నాడు: "ఇతనిని గౌరవంగా ఉంచుకో! బహుశా ఇతను మనకు లాభదాయకుడు కావచ్చు! లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు!" మరియు ఈ విధంగా మేము యూసుఫ్ ను భూమిపై స్థానమిచ్చి అతనికి సంఘనల గూఢార్థాన్ని (స్వప్నాల భావాన్ని) తెలియజేసే (విద్యను) నేర్పాము. అల్లాహ్ తన కార్యాన్ని పూర్తి చేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని చాలా మందికి ఇది తెలియదు.
మరియు అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నపుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలము నొసంగుతాము.
మరియు అతను నివసించే ఇంటి స్త్రీ అతనిని మోహించి అతని మనస్సును చలింప జేయగోరి తలుపులు మూసి, అతనితో: "(నా వద్దకు) రా!" అని పిలిచింది. అతను :"నేను అల్లాహ్ శరణు గోరుతున్నాను! నిశ్చయంగా ఆయన! నా ప్రభువు, నాకు మంచి స్థానాన్ని ప్రసాదించాడు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు." అని పలికాడు.
మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశించింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! ఒకవేల అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండక పోతే! ఈ విధంగా జరిగింది, మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా, అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు.
మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె (తన భర్తతో) అన్నది: "నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం, లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప, మరొక శిక్ష ఏముంటుంది?"
(యూసుఫ్) అన్నాడు: "ఈమెనే, నన్ను మోహింప జేయగోరింది!" ఆమె కుటుంబం వారిలో నుండి అక్కడ ఉన్న ఒకడు ఇలా సాక్ష్యమిచ్చాడు: "ఒకవేళ అతని అంగి, ముందు నుండి చినిగి ఉంటే ఆమె పలికేది సత్యం మరియు అతను అసత్యుడు!
కానీ ఒకవేళ అతని అంగి వెనుక నుండి చినిగి ఉంటే! ఆమె పలికేది అబద్ధం మరియు అతను సత్యవంతుడు!"
అతని అంగి వెనుక నుండి చినిగి ఉండటాన్ని చూసి (ఆమె భర్త) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, ఇది మీ స్త్రీల పన్నాగం. నిశ్చయంగా మీ పన్నాగం ఎంతో భయంకరమైనది!
ఓ యూసుఫ్! ఈ విషయాన్ని పోనివ్వు!" (తన భార్యతో అన్నాడు): "నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పు చేసిన దానవు."
మరియు నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. "అజీజ్ భార్య తన యువ బానిసను మోహింపగోరింది. నిశ్చయంగా ఆమె గాఢమైన ప్రేమలో పడి ఉంది. నిశ్చయంగా, ఆమె స్పష్టమైన పొరపాటులో ఉన్నట్లు మేము చూస్తున్నాము."
ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి, (యూసుఫ్ తో): "వారి ముందుకు రా!" అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెరపోయారు మరియు (ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో) తమ చేతులను కోసుకున్నారు. (అప్రయత్నంగా) అన్నారు: "అల్లాహ్ మహిమ! (హాషలిల్లాహ్) ఇతను మానవుడు మాత్రం కాడు! ఇతను గొప్ప దేవదూతయే కాగలడు!"
ఆమె అన్నది: "ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాల పాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురి కాగలడు!"
(యూసుఫ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! ఈ స్త్రీలు నన్ను పిలిచే విషయాని కంటే నాకు చెరసాలయే ప్రియమైనది. నీవు వారి ఎత్తుగడల నుండి నన్ను తప్పించక పోతే, నేను వారి వలలో చిక్కిపోయే వాడిని మరియు అజ్ఞానులలో చేరి పోయేవాడిని."
అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఆ తరువాత వారికి - (అతను నిర్దోషి అనే) సూచనలు కనిపించినా - అతనిని కొంత కాలం చెరసాలలో ఉంచాలని అనిపించింది.
మరియు అతనితో బాటు ఇద్దరు యువకులు కూడా చెరసాలలో ప్రవేశించారు. వారిలో ఒకడు అన్నాడు: "నేను సారాయి పిండుతూ ఉన్నట్లు కల చూశాను!" రెండో వాడు అన్నాడు: "నేను నా తలపై రొట్టెలు మోస్తున్నట్లు, వాటిని పక్షులు తింటున్నట్లు కలలో చూశాను." (ఇద్దరూ కలిసి అన్నారు): "మాకు దీని భావాన్ని తెలుపు. నిశ్చయంగా, మేము నిన్ను సజ్జనునిగా చూస్తున్నాము."
(యూసుఫ్) అన్నాడు: "మీరిద్దరికి తినటానికి ఇవ్వబడే భోజనం వస్తుంది కదా! అది రాకముందే నేను వీటి (మీ కలల) భావాన్ని మీ ఇద్దరికి తెలుపుతాను. ఇది నా ప్రభువు నేర్పిన విద్యలలోనిదే. నిశ్చయంగా నేను అల్లాహ్ ను విశ్వసించనివారి మరియు పరలోకాన్ని తిరస్కరించేవారి ధర్మాన్ని వదలి పెట్టాను.
మరియు నేను నా తండ్రి తాతలైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ ల యొక్క ధర్మాన్ని అవలంబించాము. అల్లాహ్ కు ఎవడినైనా సాటి కల్పించటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది మాపై మరియు సర్వ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహం. కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు.
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! ఏమీ? చాలా మంది విభిన్న ప్రభువులు మేలా? లేక, తన సృష్టిపై సంపూర్ణాధికారం గల అద్వితీయుడైన అల్లాహ్ మేలా?
ఆయన (అల్లాహ్) ను వదలి మీరు ఆరాధిస్తున్నవి - మీరు మరియు మీ తండ్రి తాతలు కల్పించుకున్న - పేర్లు మాత్రమే! దాని కొరకు అల్లాహ్ ఎలాంటి ప్రమాణాన్ని అవతరింప జేయలేదు. నిశ్చయంగా ఆజ్ఞాపించే అధికారం కేవలం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనను తప్ప మరొకరిని ఆరాధించరాదని ఆయన ఆజ్ఞాపించాడు. ఇదే సరైన ధర్మం, కానీ చాలా మందికి ఇది తెలియదు.
ఓ నా ఇద్దరు చెరసాల సహచరులారా! మీలో ఒకడు తన యజమానికి మద్యపానం (సారాయి) త్రాగిస్తూ ఉంటాడు. ఇక రెండవ వాడు సిలువపై ఎక్కించబడతాడు మరియు అతని నెత్తిపై నుండి పక్షులు తింటూ ఉంటాయి. మీరు అడుగుతున్న (కలల) విషయం గురించి ఈ విధమైన తీర్పు ఇవ్వబడుతోంది!"
మరియు వారిద్దరిలో విడుదల పొందుతాడని భావించని వాడితో (యూసుఫ్) అన్నాడు: "నీ స్వామి దగ్గర నా ప్రస్తావన చెయ్యి." కాని అతనిని తన స్వామి దగ్గర ప్రస్తావన చేయటాన్ని షైతాన్ మరపింప జేశాడు, కావున (యూసుఫ్) చెరసాలలో మరికొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు.
(ఒకరోజు) రాజు అన్నాడు: "వాస్తవానికి నేను (కలలో) ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన (ఆవులు) తిని వేస్తున్నట్లు మరియు ఏడు పచ్చి వెన్నులను మరొక ఏడు ఎండిపోయిన వాటిని చూశాను. ఓ సభాసదులారా! మీకు స్వప్నాల భావం తెలిస్తే నా స్వప్నాల భావాన్ని తెలుపండి!"
వారన్నారు: "ఇవి పీడకలలు. మరియు మాకు కలల గూఢర్థం తెలుసుకునే నైపుణ్యం లేదు!"
ఆ ఇద్దరు బందీలలో నుండి విడుదల పొందిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడా విషయం గుర్తుకు వచ్చింది. అతడు అన్నాడు: "నేను దీని గూఢార్థాన్ని మీకు తెలుపుతాను, దానికి నన్ను (యూసుఫ్ వద్దకు) పంపడి."
(అతడు అన్నాడు): "యూసుఫ్! సత్యవంతుడా! నాకు - ఏడు బలిసిన ఆవులను, ఏడు బక్కచిక్కిన ఆవులు తిని వేయటాన్ని; మరియు ఏడు పచ్చి వెన్నుల మరి ఏడు ఎండిపోయిన (వెన్నుల) - గూఢార్థమేమిటో చెప్పు. నేను (రాజసభలోని) ప్రజల వద్దకు పోయి (చెబుతాను), వారు దానిని తెలుసుకుంటారు."
(యూసుఫ్) అన్నాడు: "మీరు యథాప్రకారంగా ఏడు సంవత్సరాలు సేద్యం చేస్తూ ఉంటారు, కాని మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మాత్రమే తినటానికి ఉపయోగించుకొని, మిగిలినదంతా, వెన్నులతోనే కొట్లలో ఉంచి (భద్రపరచండి).
ఆ తరువాత చాలా కఠినమైన ఏడు సంవత్సరాలు వస్తాయి, వాటిలో మీరు ముందే నిలువ చేసి ఉంచిన దానిని తింటారు. మీరు (విత్తనాని కోసం) భద్రంగా ఉంచుకున్న కొంతభాగం తప్ప!
ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు (రసం/నూనె) తీస్తారు (పిండుతారు)."
రాజు ఇలా అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకు రండి!" రాజదూత అతని వద్దకు వచ్చినపుడు (యూసుఫ్) అన్నాడు: "నీవు తిరిగి పోయి నీ స్వామిని అడుగు: 'తమ చేతులు కోసుకున్న స్త్రీల వాస్తవ విషయమేమిటి?' నిశ్చయంగా, నా ప్రభువుకు వారి కుట్ర గురించి బాగా తెలుసు."
(రాజు స్త్రీలను) విచారించాడు: "మీరు యూసుఫ్ ను మోహింప జేయటానికి ప్రయత్నించిన విషయమేమిటి?" వారందరూ (ఒకేసారిగా) అన్నారు: "అల్లాహ్ రక్షించుగాక! మేము అతనిలో ఏ పాపాన్ని చూడలేదు!" అజీజ్ భార్య అన్నది: "ఇప్పుడు సత్యం బయటపడింది. నేనే అతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను. మరియు నిశ్చయంగా, అతను సత్యవంతుడు."
(అప్పుడు యూసుఫ్) అన్నాడు: "నేను ఇదంతా చేసింది నిశ్చయంగా, నేను (అజీజ్ కు) గోప్యంగా ఎలాంటి నమ్మకద్రోహం చేయలేదని తెలుపటానికే మరియు నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహుల కుట్రను సాగనివ్వడు.
"మరియు నన్ను నేను (ఈ నింద నుండి) విముక్తి చేసుకోవడం లేదు. వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది - నా ప్రభువు కరుణించిన వాడు తప్ప - నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
మరియు రాజు అన్నాడు: "అతనిని నా వద్దకు తీసుకొని రండి నేను అతనిని ప్రత్యేకంగా నా కొరకు నియమించుకుంటాను." (యూసుఫ్) అతడితో మాట్లాడినప్పుడు (రాజు) అన్నాడు: "నిశ్చయంగా, నీవు ఈ నాటి నుండి మా వద్ద ఉన్నత స్థానంలో నమ్మకం గల వ్యక్తిగా పరిగణింపబడతావు."
(యూసుఫ్) అన్నాడు: "నన్ను దేశపు కోశాగారాధికారిగా నియమించండి. నిశ్చయంగా నేను తెలివి గల మంచి రక్షకుడను."
మరియు ఈ విధంగా మేము యూసుఫ్ కు భూమిపై అధికార మొసంగాము. దానితో అతను తన ఇష్ట ప్రకారం వ్యవహరించ గలిగాడు. మేము కోరిన వారి మీద మా కారుణ్యాన్ని ధార పోస్తాము. మరియు మేము సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయము.
మరియు విశ్వసించి భయభక్తులు గలవారికి, పరలోక ప్రతిఫలమే ఎంతో ఉత్తమమైనది.
మరియు యూసుఫ్ (జోసెఫ్) సోదరులు వచ్చి అతని ముందు ప్రవేశించారు. అతను వారిని గుర్తించాడు కాని వారు అతనిని గుర్తించ లేక పోయారు.
మరియు అతను వారి సామగ్రిని సిద్ధపరచిన తరువాత వారితో అన్నాడు: "మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి మీరు (మళ్ళీ వచ్చేటప్పుడు) నా వద్దకు తీసుకొని రండి. ఏమీ? నేను ఏ విధంగా నిండుగా కొలిచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసేవారిలో నేను ఉత్తముడను.
కాని మీరు అతనిని నా వద్దకు తీసుకొని రాకపోతే నా వద్ద మీకు ఎలాంటి (ధాన్యం) దొరకదు, అలాంటప్పుడు మీరు నా దరిదాపులకు కూడా రాకండి!"
వారు ఇలా అన్నారు: "మేము అతనిని గురించి అతని తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నిస్తాము. మరియు మేము అలా తప్పకుండా చేస్తాము."
మరియు (యూసుఫ్) తన సేవకులతో: "వారు (ధాన్యాన్ని కొనటానికి) తెచ్చిన సామగ్రిని (తిరిగి) వారి సంచులలో పెట్టండి. వారు తిరిగి తమ కుటుంబం వారి వద్దకు పోయిన తరువాత అది తెలుసుకొని బహుశా తిరిగి రావచ్చు!" అని అన్నాడు.
వారు తమ తండ్రి దగ్గరకు తిరిగి వచ్చిన తరువాత అన్నారు: "నాన్నా! ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వడానికి తిరస్కరించారు, కావున ధాన్యం తేవాలంటే! నీవు మా తమ్ముణ్ణి (బెన్యామీన్ ను) మాతోపాటు పంపు మరియు నిశ్చయంగా, మేము అతనిని కాపాడుతాము."
(యఅఖూబ్) అన్నాడు: "ఏమీ? నేను మిమ్మల్ని అతని విషయంలో - ఇది వరకు అతని సోదరుని విషయంలో నమ్మనట్లు - నమ్మాలా? వాస్తవానికి, అల్లాహ్ యే ఉత్తమ రక్షకుడు. ఆయనే కరుణించేవారిలో అందరికంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి."
మరియు వారు తమ మూటలను విప్పగా తమ సొమ్ము కూడా తమకు తిరిగి ఇవ్వబడటాన్ని చూసి తమ తండ్రితో అన్నారు: "నాన్నా! (చూడండి) ఇంకేం కావాలి? మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడింది. మరియు మేము మన ఇంటివారి కొరకు మరింత ఎక్కువ ధాన్యం తేగలము. మేము మా తమ్ముణ్ణి కాపాడుకుంటాము. ఇంకా ఒక ఒంటె మోసే బరువు (ధాన్యం) కూడా ఎక్కువగా తీసుకొని రాగలము. ఇక అంత ధాన్యం కూడా (అదనంగా) సులభంగా లభిస్తుంది కదా!"
(యఅఖూబ్) అన్నాడు: "మీరు ముట్టడికి గురి అయితే తప్ప, అతనిని నా వద్దకు తప్పక తీసుకు రాగలమని అల్లాహ్ పేరుతో నా ముందు ప్రమాణం చేస్తేనే గానీ, నేను అతనిని మీ వెంట పంపను." వారు ప్రమాణం చేసిన తరువాత, అతను అన్నాడు: "మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి!"
(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ నా కుమారులారా! మీరందరూ ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి, మీరు వేర్వేరు ద్వారాల గుండా ప్రవేశించండి. నేను మిమ్మల్ని అల్లాహ్ (సంకల్పం) నుండి ఏ విధంగానూ తప్పించలేను. అంతిమతీర్పు కేవలం అల్లాహ్ కే చెందుతుంది. నేను ఆయనను మాత్రమే నమ్ముకున్నాను. మరియు ఆయనను నమ్ముకున్న వారు కేవలం ఆయన పైననే ఆధారపడి ఉంటారు."
మరియు వారు తమ తండ్రి ఆజ్ఞ ప్రకారం (ఆ నగరంలో వేర్వేరు ద్వారాల గుండా) ప్రవేశించారు. అది కేవలం యఅఖూబ్ మనస్సులోని కోరికను పూర్తి చేయటానికి మాత్రమే, కాని అల్లాహ్ సంకల్పం నుండి తప్పించుకోవటానికి, వారికి ఏ మాత్రమూ పనికి రాలేదు. మేము అతనికి నేర్పిన జ్ఞానం ప్రకారం అతను జ్ఞానవంతుడే కాని చాలా మందికి తెలియదు.
మరియు వారు యూసుఫ్ వద్ద ప్రవేశించగా అతను తన సోదరుణ్ణి (బెన్యామీన్ ను) తన దగ్గరికి తీసుకున్నాడు. అతనితో అన్నాడు: "వాస్తవానికి! నేనే నీ (తప్పిపోయిన) సోదరుడను, కావున వారు ఇంత వరకు చేస్తూ వచ్చిన పనులకు నీవు దుఃఖపడకు."
వారికి వారి సామగ్రి సిద్ధపరచిన తరువాత తన సోదరుని జీను సంచిలో ఒక నీరు త్రాగే పాత్రను పెట్టాడు. ఆ పిదప ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటించాడు: "ఓ బిడారు వారలారా! మీరు నిశ్చయంగా దొంగలు!"
వారు (యూసుఫ్ సోదరులు) వారి వైపు తిరిగి ఇలా అన్నారు: "మీ వస్తువు ఏదైనా పోయిందా?"
(కార్యకర్తలు) అన్నారు: "రాజు గారి పాత్రపోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం (బహుమానంగా) ఇవ్వబడుతుంది మరియు నేను దానికి బాధ్యుణ్ణి."
(యూసుఫ్ సోదరులు) అన్నారు: "అల్లాహ్ సాక్షి! మీకు బాగా తెలుసు. మేము మీ దేశంలో సంక్షోభం రేకెత్తించటానికి రాలేదు మరియు మేము దొంగలము కాము!"
(కార్యకర్తలు) అన్నారు: "మీరు అబద్ధమాడుతున్నారని తెలిస్తే దానికి శిక్ష ఏమిటి?"
వారు (యూసుఫ్ సోదరులు) జవాబిచ్చారు: "ఎవడి సంచిలో ఆ పాత్ర దొరకుతుందో అతడు దానికి పరిహారంగా (బానిసగా) ఉండాలి. మేము ఇదే విధంగా దుర్మార్గులను శిక్షిస్తాము."
అప్పుడతడు తన సోదరుని మూట వెదికే ముందు, వారి (సవతి సోదరుల) మూటలను వెతకటం ప్రారంభించాడు. చివరకు తన సోదరుని మూట నుండి దానిని (పాత్రను) బయటికి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కొరకు యుక్తి చూపాము. ఈ విధంగా - అల్లాహ్ ఇచ్ఛయే లేకుంటే - అతను తన సోదరురుణ్ణి, రాజధర్మం ప్రకారం ఉంచుకోలేక పోయేవాడు. మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. మరియు జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు (అల్లాహ్) ఉన్నాడు.
(అతని సోదరులన్నారు): "ఇతడు దొంగతనం చేసినా (ఆశ్చర్యం లేదు)! వాస్తవానికి ఇతని సోదరుడు కూడా ఇంతకు ముందు దొంగతనం చేశాడు." ఇది విని యూసుఫ్ (కోపాన్ని) తన హృదయంలోనే దాచుకున్నాడు మరియు దానిని వారిపై వ్యక్త పరచలేదు. (తన మనస్సులో) అనుకున్నాడు: "మీరు చాలా నీచమైన వారు మరియు మీరు పలికేది అల్లాహ్ కు బాగా తెలుసు!"
వారన్నారు: "ఓ సర్దార్ (అజీజ్) వాస్తవానికి, ఇతని తండ్రి చాలా ముసలివాడు, కావున ఇతనికి బదులుగా నీవు మాలో ఒకనిని ఉంచుకో. వాస్తవానికి, మేము నిన్ను మేలు చేసేవానిగా చూస్తున్నాము."
అతను అన్నాడు: "అల్లాహ్ నన్ను రక్షించుగాక! మా సొమ్ము ఎవరి వద్ద దొరికిందో అతనిని విడిచి, మరొకతనిని మేమెలా పట్టుకోగలము. ఒకవేళ అలా చేస్తే నిశ్చయంగా, మేము దుర్మార్గులమవుతాము."
తరువాత వారు అతని పట్ల నిరాశులై, ఆలోచించటానికి ఏకాంతంలో చేరారు! వారిలో పెద్దవాడు అన్నాడు: ఏమీ? మీ తండ్రి వాస్తవానికి మీతో అల్లాహ్ పై ప్రమాణం తీసుకున్న విషయం మీకు గుర్తులేదా? మరియు ఇంతకు పూర్వం మీరు యూసుఫ్ విషయంలో కూడా మాట తప్పారు కదా? కావున నేను నా తండ్రి నాకు అనుమతి ఇవ్వనంత వరకు లేదా అల్లాహ్ నా గురించి తీర్పు చేయనంత వరకు, నేను ఈ దేశాన్ని వదలను. మరియు ఆయనే తీర్పు చేసేవారిలో అత్యుత్తముడు."
(ఇంకా ఇలా అన్నాడు): "మీరు నాన్న దగ్గరికి పోయి అతనితో ఇలా చెప్పండి: 'నాన్నా! వాస్తవానికి నీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని (దొంగతనం చేస్తూ ఉండగా) చూడలేదు! మాకు తెలిసిందే (మేము చెబుతున్నాము). మరియు వాస్తవానికి రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా!
మరియు మేము ఉన్న నగరవాసులను మరియు మేము కలిసి తిరిగి వచ్చిన బిడారు వారిని కూడా అడగిండి. మరియు మేము నిశ్చయంగా సత్యం పలుకుతున్నాము.'"
(యఅఖూబ్) అన్నాడు: "కానీ, మీ (దుష్ట) మనస్సులు మీచేత మరొక ఘోరకార్యాన్ని తేలికగా చేయించాయి. ఇక నా కొరకు సహనమే మేలైనది. ఇక అల్లాహ్ యే! వారందరినీ నా వద్దకు తీసుకు రావచ్చు! నిశ్చయంగా, ఆయనే సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు."
మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: "అయ్యో! యూసుఫ్" అతని కన్నులు, దుఃఖం వలన తెల్లబడ్డాయి (చూపు పోయింది). అయినా అతను దానిని (వెలిబుచ్చకుండా) అణచుకున్నాడు.
అతని (కుమారులు) అన్నారు: "అల్లాహ్ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్ ను జ్ఞాపకం చేసుకోవటం మానవు."
(యఅఖూబ్) అన్నాడు: "వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్ తో మాత్రమే మొర పెట్టుకోగలను మరియు మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుంది.
నా కుమారులారా! మీరు పోయి యూసుఫ్ ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాప్తు చేయండి మరియు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాస చెందకండి. నిశ్చయంగా సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాశ చెందరు."
వారు అతని (యూసుఫ్) దగ్గరకు (మరల) వచ్చి అన్నారు: "ఓ సర్దార్ (అజీజ్)! మేము మా కుటుంబం వారు చాలా ఇబ్బందులకు గురయ్యాము. మరియు మేము చాలా తక్కువ సామగ్రి తెచ్చాము, కాని మాకు పూర్తి సామగ్రి (ధాన్యాన్ని) దాన ధర్మ రూపంలోనైనా సరే ఇవ్వండి. నిశ్చయంగా, అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి మంచి ప్రతిఫలం ఇస్తాడు."
(యూసుఫ్) అడిగాడు: "అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా?"
వారన్నారు: "ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్ వా?" అతను జవాబిచ్చాడు: "నేనే యూసుఫ్ ను మరియు ఇతడు (బెన్యామీన్) నా సోదరుడు. నిశ్చయంగా, అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా, ఎవరైతే దైవభీతి కలిగి వుండి, సహనంతో ఉంటారో, అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృథా చేయడు."
వారన్నారు: "అల్లాహ్ తోడు! వాస్తవంగా, అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మరియు నిశ్చయంగా మేము అపరాధులము!"
(యూసుఫ్) అన్నాడు: "ఈరోజు మీపై ఎలాంటి నిందలేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక! ఆయన కరుణించే వారిలో అందరి కంటే ఉత్తమమైన కారుణ్యమూర్తి!
మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకొని రండి."
ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలు దేరగానే వారి తండ్రి అన్నాడు: "మీరు నన్ను బుద్ధి నశించిన ముసలివాడు అన్నా! నిశ్చయంగా నాకు యూసుఫ్ సువాసన వస్తోంది."
(అతని దగ్గర ఉన్నవారు) అన్నారు: "అల్లాహ్ తోడు! నిశ్చయంగా నీవు నీ పూర్వపు పొరపాటులోనే పడి ఉన్నావు."
ఆ తరువాత శుభవార్త తెలిపేవాడు వచ్చి, (యూసుఫ్ చొక్కాను) అతని ముఖం మీద వేయగానే అతని దృష్టి తిరిగి వచ్చేసింది. (అప్పుడు) అతను అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? 'మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుందని?'"
వారన్నారు: "ఓ మా నాన్నా! మా పాపాల క్షమాపణకై (అల్లాహ్ ను) ప్రార్థించు. నిశ్చయంగా, మేము అపరాధులము."
అతను అన్నాడు: "మిమ్మల్ని క్షమించమని నేను నా ప్రభువును ప్రార్థించగలను. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత!"
తరువాత వారందరూ యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన తల్లిదండ్రులకు స్థానమిచ్చి అన్నాడు: "ఈజిప్టులో ప్రవేశించండి. అల్లాహ్ కోరితే, మీకు సుఖశాంతులు దొరుకుతాయి."
మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. మరియు (యూసుఫ్) అన్నాడు: "ఓ నా తండ్రీ! నేను పూర్వం కన్న కల యొక్క భావం ఇదే కదా! నా ప్రభువు వాస్తవంగా దానిని సత్యం చేసి చూపాడు. మరియు వాస్తవంగా నన్ను చెరసాన నుండి బయటికి తీసి కూడా నాకు ఎంతో మేలు చేశాడు; నాకూ మరియు నా సోదరుల మధ్య షైతాను విరోధం కలిగించిన తరువాత (ఇప్పుడు) మిమ్మల్ని ఎడారి నుండి (ఇక్కడకు) తెచ్చాడు. నిశ్చయంగా, నా ప్రభువు సూక్ష్మగ్రాహి తాను కోరినది యుక్తితో నెరవేర్చుతాడు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
"ఓ నా ప్రభూ! నీవు నాకు వాస్తవంగా రాజ్యాధికారాన్ని ప్రసాదించావు మరియు నాకు స్వప్న నిర్వచన జ్ఞానాన్ని కూడా ప్రసాదించావు. నీవే భూమ్యాకాశాలకు మూలాధారుడవు. మరియు ఇహపర లోకాలలో నీవే నా సంరక్షకుడవు. నీకు విధేయునిగా (ముస్లింగా) ఉన్న స్థితిలోనే నన్ను మరణింపజేయి. మరియు నన్ను సద్వర్తనులలో కలుపు."
(ఓ ప్రవక్తా!) మేము నీక దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేసిన ఈ గాథ అగోచర విషయాలలోనిది. ఎందుకంటే, వారందరూ కలసి కుట్రపన్ని, నిర్ణయాలు చేసినప్పుడు, నీవు అక్కడ వారితో బాటు లేవు.
మరియు నీవు ఎంత కోరినా, వీరిలో చాలా మంది విశ్వసించేవారు కారు.
మరియు నీవు వారిని దీని (హితబోధ) కొరకు ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సర్వలోకాల వారికి కేవలం ఒక హితబోధ మాత్రమే.
మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని గమనించలేక) వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
మరియు వారిలో చాలా మంది అల్లాహ్ ను విశ్వసించి కూడా, ఆయనకు సాటి కల్పించే వారున్నారు.
ఏమిటి? అల్లాహ్ శిక్ష తమను క్రమ్ముకోకుండా, వారు సురక్షితంగా ఉండగలరని, వారు భావిస్తున్నారా? లేదా వారికి తెలియకుండానే అకస్మాత్తుగా (అంతిమ) ఘడియ రాదని వారు భావిస్తున్నారా?
(వారితో) అను: "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడను కాను!"
మరియు మేము నీ కంటే పూర్వం దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చి పంపిన వారందరూ పురుషులే, వారూ నగరవాసులలోని వారే. ఏమీ? వీరు భూమిలో సంచారం చేయలేదా, తమ పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి ? దైవభీతి గలవారికి పరలోక వాసమే ఎంతో మేలైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?
తుదకు ప్రవక్తలు నిరాశులయ్యారు మరియు వారు వాస్తవానికి (ప్రజల ద్వారా) అబద్ధీకులని తిరస్కరించబడ్డారని భావించినప్పుడు వారికి (ప్రవక్తలకు) మా సహాయం లభించింది కాబట్టి మేము కోరినవాడు రక్షించబడ్డాడు. మరియు మా శిక్ష అపరాధులైన జాతి వారిపై నుండి తొలగింపబడదు.
వాస్తవానికి వారి గాథలలో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇది (ఈ ఖుర్ఆన్) కల్పితగాథ కాదు. కాని ఇది ఇంత వరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి వున్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించేవారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను.