surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

అలిఫ్-లామ్-మీమ్
ఇవి వివేకంతో నిండి ఉన్న గ్రంథ సూచనలు (ఆయాత్)
(ఇందులో) సజ్జనులకు మార్గదర్శకత్వమూ మరియు కారుణ్యమూ ఉన్నాయి.
(వారికే) ఎవరైతే నమాజ్ ను స్థాపించి విధిదానం (జకాత్) ఇస్తారో మరియు పరలోక జీవితం మీద దృఢమైన నమ్మకం కలిగి ఉంటారో;
అలాంటి వారే, తమ ప్రభువు తరఫు నుండి (వచ్చిన) మార్గదర్శకత్వం మీద ఉన్నవారు. మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు.
మరియు మానవులలో కొందరు - జ్ఞానం లేక, వ్యర్థ కాలక్షేపం చేసే మాటలను కొని - ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించే వారున్నారు మరియు వారు దానిని (అల్లాహ్ మార్గాన్ని) పరిహాసం చేస్తుంటారు. అలాంటి వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది.
అలాంటి వానికి, మా సూచనలు (ఆయాత్) వినిపింప జేసినప్పుడు, అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా, అతడు వాటిని విననే లేదన్నట్లుగా, అహంకారంతో మరలిపోతాడు. వానికి అతి బాధాకరమైన శిక్ష పడుతుందనే వార్తను వినిపించు.
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారి కొరకు పరమానందకరమైన స్వర్గ వనాలుంటాయి.
వారు, శాశ్వతంగా వాటిలో ఉంటారు. ఇది అల్లాహ్ యొక్క సత్య వాగ్దానం. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతో పాటు కదలకుండా ఉండాలని; మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేసాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను) ఉత్పత్తి చేశాము.
ఇదంతా అల్లాహ్ సృష్టియే! ఇక ఆయన తప్ప ఇతరులు ఏమి సృష్టించారో నాకు చూపండి. అలా కాదు ఈ దుర్మార్గులు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.
మరియు నిశ్చయంగా, మేము లుఖ్మాన్ కు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాహ్ కు కృతజ్ఞుడుగా ఉండాలని. మరియు ఎవడైతే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతాడో, అతడు నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుతాడు. మరియు కృతఘ్నతకు పాల్పడిన వాడు, నిశ్చయంగా అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడని (తెలుసుకోవాలి).
మరియు (జ్ఞాపకం చేసుకోండి) లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: "ఓ నా పుత్రుడా! అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించకు. నిశ్చయంగా, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించటం (బహుదైవారాధన) మహా దుర్మార్గము."
మరియు (అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు): "మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా జేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞుడవై ఉండు. నీకు నా వైపునకే మరలి రావలసి ఉన్నది."
"మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను."
"ఓ నా కుమారా! ఒకవేళ నీ కర్మ ఆవగింజంత ఉండి, అది ఒక పెద్ద రాతిబండలో గానీ, ఆకాశంలో గానీ లేదా భూమిలో గానీ దాగివున్నా, అల్లాహ్ దానిని తప్పక (వెలుగులోకి) తెస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంతో సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు."
"ఓ నా కుమారా! నమాజ్ స్థాపించు మరియు ధర్మాన్ని ఆదేశించు మరియు అధర్మాన్ని నిషేధించు, ఆపదలో సహనం వహించు. నిశ్చయంగా, ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు."
"మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు."
"మరియు నీ నడకలలో నమ్రత పాటించు. మరియు నీ స్వరాన్ని తగ్గించు. నిశ్చయంగా, స్వరాలలో అన్నిటికంటే కరకైన (వినసొంపుకానిది) గాడిద స్వరమే!"
ఏమీ? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సకల వస్తువులను వాస్తవానికి అల్లాహ్ మీకు ఉపయుక్తంగా చేశాడనీ మరియు ఆయన బహిరంగంగానూ మరియు గోప్యంగానూ తన అనుగ్రహాలను, మీకు ప్రసాదించాడనీ, మీకు తెలియదా? మరియు ప్రజలలో కొందరు ఎలాంటి జ్ఞానం, మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేనిదే అల్లాహ్ ను గురించి వాదులాడే వారున్నారు!
మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన దానిని అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "కాదు మా తండ్రితాతలు నడిచిన మార్గాన్నే మేము అనుసరిస్తాము." అని అంటారు. ఏమీ? షైతాన్ వారిని భగభగమండే అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నప్పటికీ, (వారు అలాంటి మార్గాన్నే అనుసరిస్తారా)?
ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే! మరియు సకల వ్యవహారాల ముగింపు (తీర్పు) అల్లాహ్ వద్దనే ఉంది.
మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. వారందరి మరలింపు మా వైపునకే ఉంది; అప్పుడు మేము వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాము. నిశ్చయంగా, అల్లాహ్ కు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు.
మేము వారిని కొంత కాలం సుఖాలను అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని కఠినమైన శిక్ష వైపుకు త్రోస్తాము.
ఒకవేళ మీరు వారిని: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించింది ఎవరు?" అని అడిగితే! వారు నిస్సంకోచంగా అంటారు: "అల్లాహ్!" అని. వారితో అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.
ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ కే చెందుతుంది. నిశ్చయంగా, అల్లాహ్! కేవలం ఆయనే సర్వసంపన్నుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.
ఒకవేళ వాస్తవానికి, భూమిలో ఉన్న వృక్షాలన్నీ కలములై ఈ సముద్రం మరియు దానితో పాటు అటువంటి ఏడు సముద్రాల (నీళ్ళంతా) సిరాగా ఉన్నా, అల్లాహ్ మాటలు (సూచనలు వ్రాయటానికి) పూర్తి కావు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
మీ అందరినీ సృష్టించటం మరియు తిరిగి (సజీవులుగా) లేపటం ఆయనకు ఒక మానవుణ్ణి (సృష్టించి, తిరిగి లేపడం వంటిదే). నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వ చూసేవాడు.
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? నిశ్చయంగా, అల్లాహ్ రాత్రిని పగటిలోనికి ప్రవేశింప జేస్తున్నాడని మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింప జేస్తున్నాడని. మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్దులుగా చేసి ఉంచాడనీ ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో మరియు (పరిధిలో) తిరుగుతూ ఉంటాయనీ! మరియు నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగునని?
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
ఏమీ? నీకు తెలియదా? మీకు కొన్ని సూచనలను తెలుపటానికి, అల్లాహ్ అనుగ్రహంతో, ఓడ సముద్రంలో పయనం చేస్తున్నదనీ? నిశ్చయంగా, ఇందులో సహనం వహించే ప్రతివానికి, కృతజ్ఞునికి, ఎన్నో సూచనలున్నాయి.
మరియు వారిని సముద్రపు అల, మేఘంగా క్రమ్ముకున్నప్పుడు, వారు పరిపూర్ణ భక్తితో అల్లాహ్ నే వేడుకుంటారు. కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాస-అవిశ్వాసాల) మధ్య ఆగిపోతారు. మరియు మా సూచనలను, కేవలం విశ్వాసఘాతకులు, కృతఘ్నులైన వారు మాత్రమే, తిరస్కరిస్తారు.
ఓ మానవులారా! మీ ప్రభువు నందే భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆ దినానికి భయపడండి, (ఏనాడైతే) తండ్రి తన కుమారునికి నష్టపరిహారం చెల్లించలేడో మరియు ఏ కుమారుడు కూడా తన తండ్రికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేడో! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం! కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురి చేయనివ్వకూడదు. మరియు ఆ వంచకుణ్ణి (షైతానును) మిమ్మల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురి చేయనివ్వకూడదు సుమా!
నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు).