ﯪ
surah.translation
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
ఆకాశాలలోనున్న సమస్తమూ మరియు భూమిలోనున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
ఓ విశ్వాసులారా! మీరు చేయని దానిని ఎందుకు పలుకుతున్నారు?
మీరు చేయని దానిని పలకటం అల్లాహ్ దృష్టిలో చాలా అసహ్యకరమైన విషయం.
నిశ్చయంగా, అల్లాహ్! తన మార్గంలో దృఢమైన కట్టడం వలే బారులు తీరి పోరాడే వారిని ప్రేమిస్తాడు.
మరియు మూసా తన జాతివారితో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడనని రూఢిగా తెలిసి కూడా, మీరు నన్ను ఎందుకు బాధిస్తున్నారు?" అయినా వారు వక్రమార్గం అవలంబించినందుకు, అల్లాహ్ వారి హృదయాలను వక్రమార్గంలో పడవేశాడు. మరియు అల్లాహ్ దుర్జనులకు (ఫాసిఖీన్ లకు) సన్మార్గం చూపడు.
మరియు మర్యమ్ కుమారుడు ఈసా (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్) వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే!"
తనను ఇస్లామ్ వైపునకు పిలిచినప్పుడు, అల్లాహ్ మీద అపనిందలు మోపే వాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.
వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత వహించే ధర్మంగా చేశాడు - అది బహుదైవారాధకులకు ఎంత అసహ్యకరమైనా!
ఓ విశ్వాసులారా! మిమ్మల్ని బాధాకరమైన శిక్ష నుండి కాపాడే వ్యాపారాన్ని మీకు సూచించాలా?
(అది), మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం మరియు అల్లాహ్ మార్గంలో మీ సంపదలను మరియు మీ ప్రాణాలను వినియోగించి పోరాడటం. మీరు తెలుసుకుంటే! ఇదే మీకు ఎంతో మేలైనది.
(ఇలా చేస్తే) ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు శాశ్వతమైన స్వర్గవనాలలో మంచి గృహాలను ప్రసాదిస్తాడు. అదే ఆ గొప్ప విజయం.
మరియు మీకు ప్రీతికరమైన, మరొక (అనుగ్రహం) కూడా ఉంది! (అది) అల్లాహ్ సహాయం మరియు శీఘ్ర విజయం. మరియు ఈ శుభవార్తను విశ్వాసులకు తెలుపు.
ఓ విశ్వాసులారా! మర్యమ్ కుమారుడు ఈసా తన శిష్యులకు (హవారియ్యూన్ లకు) ఉపదేశించిన విధంగా, మీరు కూడా అల్లాహ్ కు సహాయకులుగా ఉండండి. (ఆయన వారితో ఇలా అన్నాడు): "అల్లాహ్ మార్గంలో నాకు తోడ్పడేవారు ఎవరు?" ఆ శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము అల్లాహ్ (మార్గంలో) తోడ్పడే వారము!" అప్పుడు ఇస్రాయీల్ సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించారు, మరొక వర్గం వారు తిరస్కరించారు. తరువాత మేము విశ్వసించిన వారికి, వారి శత్రువులకు వ్యతిరేకంగా సహాయం చేశాము, కావున వారు ఆధిక్యతను పొందారు.