ﯗ
surah.translation
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
ﭑ
ﰀ
హా - మీమ్.
ﭓ
ﰁ
ఐన్ - సీన్ - ఖాఫ్,
(ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.
ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో, వారిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు. మరియు నీవు వారికి బాధ్యుడవు కావు.
మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.
మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు, రక్షించేవాడు గానీ సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది. ఆయనే అల్లాహ్! నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను.
ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. ఈ విధంగా, ఆయన మిమ్మల్ని వ్యాపింప జేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క తాళపు చెవులు ఆయన వద్దనే వున్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వానికి) దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయనకు ప్రతిదానిని గురించి బాగా తెలుసు.
ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.
మరియు వారి వద్దకు (సత్య) జ్ఞానం వచ్చిన తరువాతనే - వారి పరస్పర ద్వేషం వల్ల - వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరపు నుండి చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారి తర్వాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని (ఇస్లాంను) గురించి గొప్ప సంశయంలో పడి ఉన్నారు.
కావున నీవు (ఓ ముహమ్మద్!) దీని (ఈ సత్యధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను: "అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నే నేను విశ్వసించాను. మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లాహ్ యే మా ప్రభువు! మరియు మీ ప్రభువు కూడాను, మా కర్మలు మాకూ మరియు మీ కర్మలు మీకూ, మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. మరియు ఆయన వైపే (మనందరి) గమ్యస్థానముంది."
మరియు అల్లాహ్ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించిన వారితో) ఆయనను గురించి ఎవరు వాదిస్తారో, వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్థకమైనది; మరియు వారిపై ఆయన (అల్లాహ్) ఆగ్రహం విరుచుకు పడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది.
అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!
దానిని నమ్మని వారే దాని కొరకు తొందర పెడతారు. మరియు విశ్వసించిన వారు, దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా, సత్యమేనని తెలుసుకుంటారు. వినండి! నిశ్చయంగా ఎవరైతే తీర్పు ఘడియను గురించి వాదులాడుతారో, వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయిన వారే!
అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదుహృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు ఆయన మహా బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు.
ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము. మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు.
ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది.
ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది అదే ఆ గొప్ప అనుగ్రహం.
ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!" మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.
ఏమీ? వారు: "అతను (ముహమ్మద్!) అల్లాహ్ పేరుతో అసత్యాలు కల్పిస్తున్నాడు" అని అంటున్నారా? కాని ఒకవేళ అల్లాహ్ తలచుకుంటే, నీ హృదయం మీద ముద్రవేసే వాడు. మరియు అల్లాహ్ అసత్యాన్ని రూపుమాపి, తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు.
ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు.
మరియు ఆయన విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్యతిరస్కారులు! వారికి కఠిన శిక్ష పడుతుంది.
మరియు ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం, మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును, ఆయన అంతా చూస్తున్నాడు!
మరియు ఆయనే, వారు నిరాశకులోనై ఉన్నప్పుడు వర్షాన్ని కురిపిస్తాడు మరియు తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు. మరియు ఆయనే సంరక్షకుడు, ప్రశంసనీయుడు.
మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో), ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటినన్నింటినీ సమీకరించగల సమర్ధుడు.
మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ తప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు.
మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు. మరియు మీకు అల్లాహ్ తప్ప మరొక సంరక్షకుడు గానీ, సహాయకుడు గానీ లేడు!
మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) సముద్రంలో, కొండల మాదిరిగా పయనించే ఓడలు కూడా వున్నాయి.
ఒకవేళ ఆయన కోరితే గాలిని ఆపగలడు. అప్పుడవి దాని (సముద్రపు) వీపు మీద నిలిచిపోతాయి. నిశ్చయంగా, ఇందులో సహనం గలవానికి, కృతజ్ఞునికి ఎన్నో సూచనలున్నాయి.
లేదా ఆయన వారి కర్మల ఫలితంగా వారిని (ముంచి) నాశనం చేయవచ్చు, కాని ఆయన ఎన్నింటినో క్షమిస్తాడు కూడాను.
మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వాదులాడేవారు, తమకు తప్పించుకునే చోటు లేదని తెలుసుకుంటారు.
కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే - విశ్వసించి తమ ప్రభువునే నమ్ముకున్న వారి కొరకు - ఉత్తమమైనదీ మరియు శాశ్వతమైనదీను.
మరియు అలాంటి వారు పెద్ద పాపాలు మరియు అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటారు మరియు కోపం వచ్చినా క్షమిస్తారు,
మరియు అలాంటి వారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీనవోపాధి నుండి ఇతరుల మీద ఖర్చు చేస్తారు;
మరియు అలాంటి వారు తమపై దౌర్జన్యం జరిగినపుడు దానికి న్యాయప్రతీకారం మాత్రమే చేస్తారు.
మరియు కీడుకు ప్రతీకారం దానంతటి కీడు మాత్రమే. కాని ఎవడైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతిఫలం అల్లాహ్ దగ్గర ఉంది. నిశ్చయంగా, ఆయన దుర్మార్గులంటే ఇష్టపడడు.
కాని ఎవరైనా తమకు అన్యాయం జరిగినప్పుడు దానికి తగినంత న్యాయప్రతీకారం మాత్రమే తీసుకుంటే అలాంటి వారు నిందార్హులు కారు.
కాని, వాస్తవానికి ఎవరైతే ప్రజలపై దౌర్జన్యాలు చేస్తారో మరియు భూమిలో అన్యాయంగా ఉపద్రవాలు రేకెత్తిస్తారో అలాంటి వారు నిందార్హులు. అలాంటి వారు, వారికే! బాధాకరమైన శిక్ష గలదు.
మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో! నిశ్చయంగా, అది (అల్లాహ్ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) కూడిన పని!
మరియు, ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్షకుడు, ఎవ్వడూ ఉండడు. మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసినపుడు: "మేము తిరిగి (భూలోకంలోకి) పోయే మార్గమేదైనా ఉందా?" అని అడగటం నీవు చూస్తావు.
మరియు వారిని, దాని (నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగచూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించిన వారు ఇలా అంటారు: "నిశ్చయంగా, తమను తాము మరియు తమ సంబంధీకులను (అనుచరులను) నష్టానికి గురి చేసుకున్నవారే, ఈ పునరుత్థాన దినమున నష్టపోయే వారు. జాగ్రత్త! నిశ్చయంగా, దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురి అవుతారు."
మరియు అల్లాహ్ తప్ప, ఇతరులెవ్వరూ వారికి రక్షకులుగా గానీ, సహాయకులుగా గానీ ఉండరు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వారికి (దాని నుండి బయటపడే) మార్గమేదీ వుండదు.
(కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్ తరఫు నుండి రాకముందే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మరియు మీకు (మీ పాపాలను) నిరాకరించటానికి కూడా వీలుండదు.
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీ పని కేవలం (సందేశాన్ని) అందజేయటం మాత్రమే. మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే, దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్న దానికి ఫలితంగా, కీడు కలిగినట్లయితే! నిశ్చయంగా, అప్పుడు మానవుడు కృతఘ్ను డవుతాడు!
భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తుడు.
లేదా! వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్ధుడు.
మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు.
మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.
అల్లాహ్ మార్గం! భూమ్యాకాశాలలో నున్న ప్రతిదీ ఆయనకే చెందుతుంది. వాస్తవానికి, వ్యవహారాలన్నీ చివరకు (తీర్పు కొరకు) అల్లాహ్ వద్దకే చేరుతాయి.