سورة الشعراء

الترجمة التلجوية

ترجمة معاني سورة الشعراء باللغة التلجوية من كتاب الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الترجمة التلجوية

مولانا عبد الرحيم بن محمد

الناشر

مجمع الملك فهد

آية رقم 1
తా - సీన్ - మీమ్.
آية رقم 2
ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయతులు)
آية رقم 3
(ఓ ముహమ్మద్) వారు విశ్వసించలేదనే బాధతో బహుశా నీవు నీ ప్రాణాలే కోల్పోతావేమో!
మేము కోరితే ఆకాశం నుండి వారిపై ఒక అద్భుత సంకేతాన్ని (ఆయత్ ను) అవతరింపజేసి, దానికి వారి మెడలను నమ్రతతో వంగి పోయేలా చేసేవారము.
మరియు వారి వద్దకు అనంత కరుణామయుడని వద్ద నుండి క్రొత్త సందేశం వచ్చినప్పుడల్లా, వారు దాని నుండి విముఖులు కాకుండా ఉండలేదు.
آية رقم 6
వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది.
ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో?
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
آية رقم 9
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 10
మరియు నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించిన విషయాన్ని వారికి జ్ఞాపకం చేయించు: "దుర్మార్గులైన జాతి ప్రజల వద్దకు వెళ్ళు;
آية رقم 11
ఫిర్ఔన్ జాతివారి వద్దకు. ఏమీ? వారికి దైవభీతి లేదా?"
آية رقم 12
(మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! వారు నన్ను అసత్యవంతుడవని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను.
آية رقم 13
నా హృదయం కుంచించుకు పోతోంది మరియు నా నాలుక తడబడుతోంది, కావున నీవు హారూన్ వద్దకు కూడా (వహీ) పంపు.
آية رقم 14
మరియు వారి దగ్గర నా మీద ఒక నేరం మోపబడి ఉన్నది, కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను."
(అల్లాహ్) సెలవిచ్చాడు: "అట్లు కానేరదు! మీరిద్దరూ మా సూచనలతో వెళ్ళండి. నిశ్చయంగా, మేము కూడా మీతో పాటు ఉండి సర్వమూ వింటూ ఉంటాము.
آية رقم 16
కావున మీరిద్దరూ ఫిరఔన్ వద్దకు వెళ్ళి అనండి: "నిశ్చయంగా, మేము సర్వలోకాల పోషకుని సందేశహరులము.
آية رقم 17
కావున ఇస్రాయీల్ సంతతి వారిని మా వెంట పోనివ్వు."
(ఫిర్ఔన్) అన్నాడు: "ఏమీ? మేము నిన్ను బాల్యంలో మాతో పాటు పోషించలేదా? మరియు నీవు నీ వయస్సులోని అనేక సంవత్సరాలు మాతో పాటు గడిపావు కదా!
آية رقم 19
అయినా నీవు హీనమైన ఆ పని చేశావు, కావున నీవు కృతఘ్నులలోని వాడవు!"
آية رقم 20
(మూసా) అన్నాడు: "నేను పొరపాటుగా ఆ పని చేశాను!
ఆ పిదప మీకు భయపడి పారిపోయాను, కాని ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని ప్రసాదించి, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు.
آية رقم 22
ఇక నీవు నాకు చేసిన ఆ ఉపకారానికి నన్ను ఎత్తి పొడిస్తే! నీవు మాత్రం ఇస్రాయీల్ సంతతి వారినంతా బానిసలుగా చేసుకున్నావు కదా!"
آية رقم 23
(ఫిర్ఆన్) అడిగాడు: "అయితే ఈ సర్వలోకాల ప్రభువు అంటే ఏమిటి?"
(మూసా) జవాబిచ్చాడు: "మీరు నమ్మేవారే అయితే! ఆయనే ఆకాశాలకూ మరియు భూమికీ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు!"
آية رقم 25
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న వారితో: "ఏమీ? మీరు వింటున్నారా?" అని ప్రశ్నించాడు.
آية رقم 26
(మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) మీ ప్రభువు మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కూడానూ!"
آية رقم 27
(ఫిర్ఔన్) అన్నాడు: "మీ వద్దకు పంపబడిన మీ ఈ సందేశహరుడు నిశ్చయంగా పిచ్చివాడే!"
(మూసా) అన్నాడు: "మీరు అర్థం చేసుకోగలిగితే! ఆయనే తూర్పూ పడమరలకూ మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు."
آية رقم 29
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకుంటే నేను నిన్ను చెరసాలలో ఉన్నవారితో చేర్చుతాను."
آية رقم 30
(మూసా) అన్నాడు: "ఏమీ? నేను నీ వద్దకు ఒక స్పష్టమైన విషయాన్ని (సత్యాన్ని) తీసుకువచ్చిన తరువాత కూడానా?"
آية رقم 31
(ఫిర్ఔన్) అన్నాడు: "నీవు సత్యవంతుడవే అయితే దానిని (ఆ అద్భుత సూచనను) చూపు!"
آية رقم 32
అప్పుడు (మూసా) తన చేతి కర్రను పడవేయగానే, అది ఒక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది.
آية رقم 33
తరువాత అతను (మూసా) తన చేతిని (చంక నుండి) వెలుపలికి తీయగానే, అది చూసేవారి యెదుట తెల్లగా ప్రకాశించసాగింది!
آية رقم 34
(ఫిర్ఔన్) తన చుట్టూ ఉన్న నాయకులతో అన్నాడు: "నిశ్చయంగా, ఇతనొక నేర్పు గల మాంత్రికుడు.
آية رقم 35
ఇతను తన మంత్రజాలంతో మిమ్మల్ని మీ దేశం నుండి తరుమ గోరుతున్నాడు, అయితే మీ సలహా ఏమిటి?"
آية رقم 36
వారన్నారు: "అతనిని మరియు అతని సోదరుణ్ణి ఆపి ఉంచు మరియు (మంత్రగాళ్ళను) సమావేశ పరచటానికి అన్ని నగరాలకు వార్తాహరులను పంపు;
آية رقم 37
వారు నీ వద్దకు నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి తెస్తారు."
آية رقم 38
ఈ విధంగా ఒక నియమిత రోజున ఒక నియమిత ప్రదేశంలో మాంత్రికులంతా సమావేశ పరచబడ్డారు.
آية رقم 39
మరియు ప్రజలతో ఇలా ప్రశ్నించడం జరిగింది: "ఏమీ? మీరంతా సమావేశమయ్యారా?
آية رقم 40
ఒకవేళ మాంత్రికులు గెలుపొందితే మనమంతా వారిని అనుసరించాలి కదా!"
మాంత్రికులు వచ్చిన తరువాత ఫిర్ఔన్ తో అన్నారు: "మేము గెలుపొందితే నిశ్చయంగా మాకు బహుమాన ముంది కదా?"
آية رقم 42
(ఫిర్ఔన్) అన్నాడు: "అవును! నిశ్చయంగా, అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరుతారు!"
آية رقم 43
మూసా వారితో అన్నాడు: "మీరు విసర దలుచుకున్న దానిని విసరండి!"
అప్పుడు వారు తమ త్రాళ్ళను మరియు తమ కర్రలను విసిరి ఇలా అన్నారు: "ఫిర్ఔన్ శక్తి సాక్షిగా! నిశ్చయంగా మేమే విజయం పొందుతాము."
آية رقم 45
ఆ తరువాత మూసా తన కర్రను పడవేయగా, తక్షణమే అది వారి బూటకపు కల్పనలను మ్రింగి వేసింది.
آية رقم 46
అప్పుడు ఆ మాంత్రికులు సజ్దాలో పడ్డారు.
آية رقم 47
వారన్నారు: "మేము సర్వలోకాల ప్రభువును విశ్వసిస్తున్నాము,
آية رقم 48
మూసా మరియు హారూన్ ల ప్రభువును."
(ఫిర్ఔన్) అన్నాడు: "నేను మీకు అనుమతి ఇవ్వక ముందే మీరు ఇతనిని విశ్వసించారా? నిశ్చయంగా, ఇతడే మీ గురువు, మీకు జాలవిద్యను నేర్పినవాడు. సరే! ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ వ్యతిరేక (ప్రతిపక్ష) దిశల చేతులను మరియు కాళ్ళను నరికిస్తాను మరియు మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను."
آية رقم 50
(మాంత్రికులు) అన్నారు: "బాధ లేదు! నిశ్చయంగా, మేము మా ప్రభువు వద్దకే కదా మరలిపోయేది.
నిశ్చయంగా, మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే వాస్తవానికి అందరి కంటే ముందుగా విశ్వసించిన వారం మేమే!"
మరియు మేము మూసాకు ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "నీవు నా దాసులను రాత్రివేళ తీసుకొని వెళ్ళిపో నిశ్చయంగా, మీరు వెంబడించబడతారు."
آية رقم 53
తరువాత ఫిర్ఔన్ అన్ని పట్టణాలకు వార్తాహరులను పంపాడు.
آية رقم 54
(ఇలా ప్రకటన చేయించాడు): "వాస్తవానికి వీరు (ఈ ఇస్రాయీల్ సంతతి వారు) ఒక చిన్న తెగవారు మాత్రమే.
آية رقم 55
మరియు నిశ్చయంగా, వారు మాకు చాలా కోపం తెప్పించారు;
آية رقم 56
మరియు నిశ్చయంగా, మనం ఐకమత్యంతో ఉండి జాగరూకత చూపేవారము."
آية رقم 57
కావున మేము వారిని, తోటల నుండి మరియు చెలమల నుండి వెళ్ళగొట్టాము;
آية رقم 58
మరియు కోశాగారాల నుండి మరియు ఉన్నతమైన స్థానాల నుండి కూడా.
آية رقم 59
ఈ విధంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని, వాటికి వారసులుగా చేశాము.
آية رقم 60
అప్పుడు (ఫిర్ఔన్ జాతి) వారు సూర్యోదయ కాలమున (ఇస్రాయీల్ సంతతి) వారిని వెంబడించారు.
آية رقم 61
ఆ ఇరుపక్షాల వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు, మూసా అనుచరులు అన్నారు: "నిశ్చయంగా మేము చిక్కి పోయాము!"
آية رقم 62
(మూసా అన్నాడు): "అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)."
అప్పుడు మేము మూసాకు: "నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది.
آية رقم 64
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము.
آية رقم 65
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము.
آية رقم 66
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
آية رقم 68
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిసంపన్నుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 69
ఇక వారికి ఇబ్రాహీమ్ గాథను వినిపించు.
آية رقم 70
అతను తన తండ్రితో మరియు తన జాతి వారితో: "మీరెవరిని ఆరాధిస్తున్నారు?" అని అడిగినపుడు;
آية رقم 71
వారన్నారు: "మేము విగ్రహాలను ఆరాధిస్తున్నాము మరియు మేము వాటికే ఎల్లప్పుడు భక్తులమై ఉంటాము."
آية رقم 72
(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు వీటిని పిలిచినప్పుడు ఇవి మీ మొర ఆలకిస్తాయా?
آية رقم 73
లేదా, మీకేమైనా మేలు చేయగలవా? లేదా హాని చేయగలవా?"
آية رقم 74
వారన్నారు: "అలా కాదు! మేము మా తండ్రితాతలను ఇలా చేస్తూ ఉండగా చూశాము."
آية رقم 75
అతను అన్నాడు: "ఏమీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరెవరిని ఆరాధిస్తున్నారో?
آية رقم 76
మీరు గానీ మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గానీ (ఆలోచించారా)?
آية رقم 77
ఎందుకంటే! నిశ్చయంగా, ఇవన్నీ నా శత్రువులే! కేవలం ఆ సర్వలోకాల ప్రభువు తప్ప!
آية رقم 78
ఆయనే నన్ను సృష్టించాడు. కాబట్టి ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.
آية رقم 79
ఆయనే నాకు తినిపించేవాడు మరియు త్రాగించేవాడు.
آية رقم 80
మరియు నేను వ్యాధిగ్రస్తుడనైతే, ఆయనే నాకు స్వస్థత నిచ్చేవాడు.
آية رقم 81
మరియు ఆయనే నన్ను మరణింపజేసేవాడు, తరువాత మళ్ళీ బ్రతికింపజేసేవాడు.
آية رقم 82
మరియు ఆయనే తీర్పుదినమున నా తప్పులను క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాను.
آية رقم 83
మరియు ఓ నా ఫ్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు మరియు నన్ను సద్వర్తనులలో కలుపు.
آية رقم 84
మరియు తరువాత వచ్చే తరాల వారిలో నాకు మంచి పేరును ప్రసాదించు.
آية رقم 85
మరియు సర్వసుఖాల స్వర్గానికి వారసులయ్యేవారిలో నన్ను చేర్చు.
آية رقم 86
మరియు నా తండ్రిని క్షమించు. నిశ్చయంగా, అతడు మార్గభ్రష్టులలోని వాడే!
آية رقم 87
మరియు అందరూ తిరిగి బ్రతికింపబడే రోజు నన్ను అవమానం పాల చేయకు.
آية رقم 88
ఏ రోజునైతే ధనసంపత్తులు గానీ, సంతానం గానీ పనికిరావో!
آية رقم 89
కేవలం నిర్మలమైన హృదయంతో అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు తప్ప!"
آية رقم 90
మరియు (ఆ రోజు) స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది.
آية رقم 91
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది.
آية رقم 92
మరియు వారితో అనబడుతుంది: "మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు?
آية رقم 93
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా?"
آية رقم 94
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు.
آية رقم 95
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ.
آية رقم 96
వారు పరస్పరం వాదించుకుంటూ ఇలా అంటారు:
آية رقم 97
"అల్లాహ్ సాక్షిగా! మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాము.
آية رقم 98
ఎప్పుడైతే మేము మిమ్మల్ని సర్వలోకాల ప్రభువుతో సమానులుగా చేశామో!
آية رقم 99
మరియు మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసింది కేవలం ఈ అపరాధులే.
آية رقم 100
మాకిప్పుడు సిఫారసు చేసేవారు ఎవ్వరూ లేరు.
آية رقم 101
మరియు ఏ ప్రాణ స్నేహితుడు కూడా లేడు.
آية رقم 102
ఒకవేళ మళ్ళీ మరలిపోయే అవకాశం మాకు దొరికి ఉంటే, మేము తప్పకుండా విశ్వసించిన వారిలో చేరిపోతాము!"
آية رقم 103
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
آية رقم 104
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 105
నూహ్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
آية رقم 106
వారి సహోదరుడు నూహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
آية رقم 107
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
آية رقم 108
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
آية رقم 110
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
آية رقم 111
వారన్నారు: "ఏమీ? మేము నిన్ను విశ్వసించాలా? నిన్ను కేవలం అధములైన వారే కదా అనుసరిస్తున్నది?"
آية رقم 112
(నూహ్) అన్నాడు: "వారేమి (పనులు) చేస్తూ ఉండేవారో నాకేం తెలుసు?
آية رقم 113
వారి లెక్క కేవలం నా ప్రభువు వద్ద ఉంది. మీరిది అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది.
آية رقم 114
మరియు నేను విశ్వసించే వారిని ధిక్కరించే వాడను కాను.
آية رقم 115
నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే!"
آية رقم 116
వారన్నారు: "ఓ నూహ్! నీవు దీనిని మానుకోకపోతే, నీవు తప్పక రాళ్ళు రువ్వి చంపబడతావు."
آية رقم 117
(నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నా జాతి ప్రజలు నన్ను అసత్యుడవని తిరస్కరిస్తున్నారు.
آية رقم 118
కావున నీవే నాకూ మరియు వారికీ మధ్య తీర్పు చేయి. మరియు నన్నూ మరియు నాతో పాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు."
آية رقم 119
ఆ పిదప మేము అతనిని మరియు అతనితో పాట నిండునావలో ఎక్కి ఉన్న వారినందరినీ కాపాడాము.
آية رقم 120
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము.
آية رقم 121
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
آية رقم 122
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 123
ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
آية رقم 124
వారి సహోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
آية رقم 125
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
آية رقم 126
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
آية رقم 128
ఏమీ? మీరు కేవలం ఆడంబరానికి ప్రతి ఎత్తైన స్థలం మీద ఒక స్మారకాన్ని నిర్మిస్తారా?
آية رقم 129
మరియు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారన్నట్లు పెద్దపెద్ద కోటలు కడతారా?
آية رقم 130
మరియు మీరు ఎవరినైనా పట్టుకుంటే, అతి క్రూరులై పట్టుకుంటారా?
آية رقم 131
ఇకనైన మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
آية رقم 132
మరియు మీకు తెలిసివున్న (మంచి) వస్తువులను, మీకు విస్తారంగా ఇచ్చిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి.
آية رقم 133
ఆయన విస్తారంగా మీకు పశువులను మరియు సంతానాన్ని అనుగ్రహించాడు.
آية رقم 134
మరియు తోటలను మరియు చెలమలను.
آية رقم 135
నిశ్చయంగా, మీపై ఒక మహా దినమున (పడబోయే) శిక్షకు నేను భయపడుతున్నాను!"
آية رقم 136
వారన్నారు: "నీవు ఉపదేశించినా, ఉపదేశించక పోయినా మాకు అంతా సమానమే!
آية رقم 137
ఇది మా పూర్వీకుల యొక్క ప్రాచీన ఆచారమే!
آية رقم 138
మరియు మాకు ఎలాంటి శిక్ష విధించబడదు."
ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
آية رقم 140
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 141
సమూద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
آية رقم 142
వారి సహోదరుడు సాలిహ్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
آية رقم 143
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
آية رقم 144
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
آية رقم 146
ఏమీ? మీరిప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలోనే సుఖశాంతులలో ఎల్లప్పుడూ వదలి వేయబడతారని అనుకుంటున్నారా?
آية رقم 147
తోటలలో మరియు చెలమలలో!
آية رقم 148
మరియు ఈ పొలాలలో, మాగిన పండ్లగుత్తులు గల ఖర్జూరపు చెట్ల మధ్య;
آية رقم 149
మరియు మీరు కొండలను తొలిచి ఎంతో నేర్పుతో గృహాలను నిర్మిస్తూ ఉంటారనీ!
آية رقم 150
అలా కాదు, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
آية رقم 151
మరియు మితిమీరి ప్రవర్తించే వారి ఆజ్ఞలను అనుసరించకండి.
آية رقم 152
ఎవరైతే భూమిలో కల్లోలం రేకెత్తిస్తున్నారో మరియు ఎన్నడూ సంస్కరణను చేపట్టరో!"
آية رقم 153
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! కావున నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా అద్భుత సూచన తీసుకురా!"
آية رقم 155
(సాలిహ్) అన్నాడు: "ఇదిగో ఈ ఆడ ఒంటె. ఇది నీరు త్రాగే (దినం) మరియు మీరు నీరు త్రాగే దినం నిర్ణయించబడ్డాయి.
آية رقم 156
దీనికి హాని కలిగించకండి. అలా చేస్తే ఒక మహా దినపు శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది."
آية رقم 157
కాని వారు దాని వెనుక కాలి మోకాలి పెద్ద నరమును కోసి చంపారు, ఆ తరువాత వారు పశ్చాత్తాప పడతూ ఉండిపోయారు.
కావున, వారిని శిక్ష పట్టుకుంది. నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
آية رقم 159
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 160
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.
آية رقم 161
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
آية رقم 162
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
آية رقم 163
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
آية رقم 165
(ప్రకృతికి విరుద్ధంగా) సర్వప్రాణులలో కెల్లా మీరే పురుషుల వద్దకు పోతారేమిటీ?
మీ ప్రభువు, మీ కొరకు సహవాసులు (అజ్వాజ్) గా పుట్టించిన వారిని విడిచి పెడుతున్నారేమిటి? అలా కాదు, మీరు హద్దు మీరి ప్రవర్తించే జాతివారు!"
آية رقم 167
(దానికి) వారన్నారు: "ఓ లూత్! ఇక నీవు మానుకోక పోతే నీవు దేశం నుండి బహిష్కరించబడిన వారిలో చేరుతావు!"
آية رقم 168
(లూత్) అన్నాడు: "నిశ్చయంగా మీ ఈ చేష్టను అసహ్యించుకునే వారిలో నేనూ ఉన్నాను."
آية رقم 169
(ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నన్నూ మరియు నా కుటుంబం వారినీ వీరి చేష్ట నుండి కాపాడు."
آية رقم 170
కావున మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరినీ కాపాడాము -
آية رقم 171
వెనుక ఉండి పోయిన వారిలో కలసి పోయిన ముసలామె తప్ప -
آية رقم 172
ఆ తరువాత, మిగతా వారిని నిర్మూలించాము.
آية رقم 173
వారిపై ఒక వర్షాన్ని కురిపించాము. అది (ముందు) హెచ్చరించబడిన వారిపై (కురిపించబడ్డ) అతి భయంకరమైన వర్షం.
آية رقم 174
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించడం లేదు.
آية رقم 175
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 176
వన (అయ్ కహ్) వాసులు సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించారు.
آية رقم 177
షుఐబ్ వారితో ఇలా అన్నాడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
آية رقم 178
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను.
آية رقم 179
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.
నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.
آية رقم 181
మీరు (ఇచ్చినపుడు) సరిగ్గా కొలిచి ఇవ్వండి. నష్టపరిచే వారిలో చేరకండి!
آية رقم 182
త్రాసుతో సరిసమానంగా తూచండి.
آية رقم 183
ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో కల్లోలం రేకెత్తిస్తూ దౌర్జన్యపరులుగా ప్రవర్తించకండి.
آية رقم 184
మిమ్మల్ని మరియు మీకు పూర్వం గతించిన తరాల వారిని సృష్టించిన ఆయన (అల్లాహ్) యందు భయభక్తులు కలిగి ఉండండి."
آية رقم 185
వారన్నారు: "నిశ్చయంగా, నీవు మంత్రజాలంతో వశపరచుకోబడ్డావు!
آية رقم 186
నీవు కేవలం మా వంటి ఒక మానవుడవు మాత్రమే! నిశ్చయంగా, మేము నిన్ను అసత్యవాదులలో ఒకనిగా పరిగణిస్తున్నాము!
آية رقم 187
నీవు సత్యవంతుడవే అయితే ఆకాశం యొక్క ఒక తునకను మాపై పడవేయి."
آية رقم 188
(షుఐబ్) అన్నాడు: "మీరు చేసేది నా ప్రభువుకు బాగా తెలుసు!"
కాని, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు, కావున వారిపై ఛాయాకృత ఉపద్రవం (మేఘాల శిక్ష) వచ్చి పడింది. నిశ్చయంగా, అదొక భయంకరమైన దినపు శిక్ష!
آية رقم 190
నిశ్చయంగా, ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
آية رقم 191
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.
آية رقم 192
మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం).
آية رقم 193
దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు;
آية رقم 194
నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని;
آية رقم 195
స్పష్టమైన అరబ్బీ భాషలో!
آية رقم 196
నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.
آية رقم 197
ఇస్రాయీల్ సంతతి వారిలోని విద్వాంసులు ఈ విషయాన్ని ఒప్పు కోవటం వారికొక సూచనగా సరిపోదా?
آية رقم 198
ఒకవేళ మేము దీనిని అరబ్ కాని వానిపై అవతరింపజేసి ఉంటే!
آية رقم 199
అతను దానిని వారికి చదివి వినిపించినా, వారు దానిని విశ్వసించేవారు కారు.
آية رقم 200
ఈ విధంగా, మేము దీనిని (తిరస్కారాన్ని) అపరాధుల హృదయాల లోనికి దిగిపోయేలా చేశాము.
آية رقم 201
కఠినశిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు.
آية رقم 202
అది వారికి తెలియకుండానే అకస్మాత్తుగా వచ్చి పడుతుంది.
آية رقم 203
అప్పుడు వారంటారు: "ఏమీ? మాకు కొంత వ్యవధి ఇవ్వబడుతుందా?
آية رقم 204
ఏమీ? మా శిక్ష శీఘ్రంగా రావలెనని వారు కోరుతున్నారా?
آية رقم 205
చూశావా? మేము కొన్ని సంవత్సరాలు వారికి (ఈ జీవితంలో) సుఖసంతోషాలతో గడిపే వ్యవధినిచ్చినా!
آية رقم 206
తరువాత వాగ్దానం చేయబడినది (శిక్ష) వారిపైకి వచ్చినపుడు;
آية رقم 207
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు.
آية رقم 208
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు!
آية رقم 209
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు.
آية رقم 210
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు.
آية رقم 211
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు.
آية رقم 212
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు.
آية رقم 213
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు.
آية رقم 214
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;
آية رقم 215
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు.
آية رقم 216
ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే వారితో అను: "మీరు చేసే కార్యాలకు నేను బాధ్యుడను కాను."
آية رقم 217
మరియు ఆ సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత మీద నమ్మకం ఉంచుకో!
آية رقم 218
ఆయన నీవు నిలిచినపుడు, నిన్ను చూస్తున్నాడు.
آية رقم 219
మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారితో నీ రాకపోకడలను కూడా!
آية رقم 220
నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
آية رقم 221
షైతాన్ లు ఎవరిపై దిగుతారో నేను మీకు తెలుపనా?
آية رقم 222
వారు అసత్యవాదులైన పాపాత్ములపై దిగుతారు;
آية رقم 223
గాలి వార్తలను చెవులలో ఊదుతారు; మరియు వారిలో చాలా మంది అసత్యవాదులే!
آية رقم 224
మరియు మార్గభ్రష్టులే కవులను అనుసరిస్తారు.
آية رقم 225
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా వారు (కవులు) తమ కవిత్వంలో ప్రతి విషయాన్ని ఉద్దేశరహితంగా (ప్రశంసిస్తూ) ఉంటారని;
آية رقم 226
మరియు నిశ్చయంగా, వారు తాము ఆచరించని దానిని చెప్పుకుంటారని;
కాని, (వారిలో) విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ, అల్లాహ్ ను అమితంగా స్మరించే వారూ మరియు - తమకు అన్యాయం జరిగినప్పుడే - ప్రతీకార చర్య తీసుకునే వారు తప్ప! అన్యాయం చేసేవారు తమ పర్యవసానం ఏమిటో త్వరలో తెలుసుకోగలరు.
تقدم القراءة