ﮮ
surah.translation
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.
భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు.
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "అంతిమ ఘడియ (పునరుత్థానం) మాపై ఎన్నడూ రాదు!" వారితో ఇలా అను: "ఎందుకు రాదు! అగోచర విషయ జ్ఞానం గల నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీ మీదకు వస్తుంది." ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో (పరమాణువుతో) సమానమైన వస్తువుగానీ, లేదా దాని కంటే చిన్నది గానీ లేదా దాని కంటే పెద్దది గానీ, ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడకుండా) ఆయనకు మరుగుగా లేదు.
అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి (స్వర్గం) ఉంటాయి.
మరియు ఎవరైతే మా సూచనలను (ఆయాత్ లను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంటుంది.
మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు, ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యమనీ మరియు అది సర్వశక్తిమంతుడు ప్రశంసనీయుడు (అయిన అల్లాహ్) మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందనీ గ్రహిస్తారు.
మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా?"
"అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగ ద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసే వారం. నిశ్చయంగా, ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది.
మరియు వాస్తవంగా, మేము దావూద్ కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము: "ఓ పర్వతాల్లారా! మరియు పక్షులారా! అతనితో కలిసి (మా స్తోత్రాన్ని) ఉచ్ఛరించండి!" (అని మేము ఆజ్ఞాపించాము). మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము.
(అతనికి ఇలా ఆదేశమిచ్చాము): "నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!" మరియు (ఓ మానవులారా!): "మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను."
మరియు మేము గాలిని సులైమాన్ కు (వశపరచాము); దాని ఉదయపు గమనం ఒక నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేసేది మరియు దాని సాయంకాలపు గమనం ఒక నెల. మరియు మేము అతని కొరకు రాగి ఊటను ప్రవహింప జేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నధిలో పని చేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము.
వారు (జిన్నాతులు) అతనికి అతను కోరే, పెద్ద పెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంటల వంటి పెద్ద పెద్ద గంగాళాలను, (తమ స్థానము నుండి) కదిలింపలేని కళాయీలను తయారు చేసేవారు. "ఓ దావూద్ వంశీయులారా! మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండిండి." మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ.
మేము అతని (సులైమాన్)పై మృత్యువును విధించినప్పుడు, అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప, మరెవ్వరూ అతని మరణం విషయం, వారికి (జిన్నాతులకు) తెలుపలేదు. ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే, తాము అవమాన కరమైన ఈ బాధలో పడి ఉండే వారం కాము కదా అని తెలుసుకున్నారు.
వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలు ఉండేవి (వారితో): "మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!" (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు.
అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారి పైకి, కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైనా ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము.
ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము.
మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: "వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము).
కాని వారు: "ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు." అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి.
వాస్తవానికి ఇబ్లీస్ (షైతాన్) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప, అందరూ వాడిని అనుసరించారు.
మరియు వాడికి (షైతాన్ కు) వారిపై ఎలాంటి అధికారం లేదు. కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డ వాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమిలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు.
వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.
మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)! చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవతలు): "మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: "సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు.
వారిని ఇలా అడుగు: "మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి తెలుపు: "అల్లాహ్!" అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము.
ఇంకా ఇలా అను: "మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము."
వారితో ఇలా అను: "మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు."
వారితో ఇలా అను: "మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు! వాస్తవానికి ఆయన, అల్లాహ్ యే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు."
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.
మరియు వారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?" అని అడుగుతున్నారు.
వారితో ఇలా అను: "మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది; మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకూ చేయలేరు లేదా (ఒక్క ఘడియ) ముందుకునూ చేయలేరు."
మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మేము ఈ ఖుర్ఆన్ ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము." ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు, వారు ఒకరి నొకరు, ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే (ఎంత బాగుండును)! బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో: "మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసుల మయ్యేవారం!" అని అంటారు.
దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు!"
మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు: "అలా కాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని - అల్లాహ్ ను తిరస్కరించి - ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు." మరియు వారు శిక్షను చూసినప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్ళు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా?
మరియు మేము హెచ్చరిక చేసే అతనిని (ప్రవక్తను) ఏ నగరానికి పంపినా, దానిలోని ఐశ్యర్యవంతులు: "నిశ్చయంగా, మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము." అని అనకుండా ఉండలేదు.
వారు ఇంకా ఇలా అన్నారు: "మేము (నీకంటే) ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము. మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము."
వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు."
మరియు మీ సంపద గానీ మరియు మీ సంతానం గానీ మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు; కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు.
మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠినశిక్షకు హాజరు చేయబడతారు.
వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తన దాసులలో తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన) వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత."
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: "ఏమీ? వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు?"
వారు (దేవదూతలు) జవాబిస్తారు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు."
(అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): "అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు." మరియు మేము దుర్మార్గులతో: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి!" అని పలుకుతాము.
మరియు వారికి మా స్పష్టమైన సూచన (ఆయాత్) లను వినిపింప జేసినప్పుడు వారు: "ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు." అని అంటారు. వారింకా ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే." మరియు సత్యతిరస్కారులు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!" అని అంటారు.
(ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు.
మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారికిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో!
(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!"
ఇలా అను: "నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి, నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి!"
ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు."
ఇలా అను: "సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు."
ఇలా అను: "ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే, అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) వల్లనే! నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు (అతి సన్నిహితుడు)!"
మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు.
అప్పుడు (పరలోకంలో) వారంటారు: "మేము (ఇప్పుడు) దానిని (సత్యాన్ని) విశ్వసించాము!" వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని (విశ్వాసాన్ని) ఎలా పొందగలరు?
మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు.
మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే, వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డు వేయబడుతుంది. నిశ్చయంగా, వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు.