ترجمة سورة الطلاق

الترجمة التلجوية
ترجمة معاني سورة الطلاق باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఓ ప్రవక్తా! మీరు స్త్రీలకు విడాకులు (తలాఖ్) ఇచ్చేటప్పుడు వారికి, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) తో విడాకులివ్వండి. మరియు ఆ గడువును ఖచ్చితంగా లెక్కపెట్టండి. మరియు మీ ప్రభువైన అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వారు బహిరంగంగా అశ్లీల చేష్టలకు పాల్పడితే తప్ప, మీరు వారిని వారి ఇండ్ల నుండి వెడల గొట్టకండి మరియు వారు కూడా స్వయంగా వెళ్ళి పోకూడదు. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు ఎవడైతే అల్లాహ్ (నిర్ణయించిన) హద్దులను అతిక్రమిస్తాడో వాస్తవానికి వాడు తనకు తానే అన్యాయం చేసుకున్నట్లు. నీకు తెలియదు, బహుశా! దాని తరువాత అల్లాహ్ ఏదైనా క్రొత్త మార్గం చూపించవచ్చు!
ఇక వారి నిర్ణీత గడువు ముగిసినప్పుడు, వారిని ధర్మప్రకారంగా (వివాహబంధంలో) ఉంచుకోండి, లేదా ధర్మప్రకారంగా వారిని విడచి పెట్టండి. మరియు మీలో న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. మరియు అల్లాహ్ కొరకు సాక్ష్యం సరిగ్గా ఇవ్వండి. అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించే ప్రతి వ్యక్తి కొరకు, ఈ విధమైన ఉపదేశమివ్వబడుతోంది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు గలవానికి, ఆయన ముక్తిమార్గం చూపుతాడు.
మరియు ఆయన, అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీనవోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. వాస్తవానికి, అల్లాహ్ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్) నిర్ణయించి ఉన్నాడు.
మరియు మీ స్త్రీలు ఋతుస్రావపు వయస్సు గడిచి పోయినవారైతే లేక మీకు దానిని గురించి ఎలాంటి అనుమానం ఉంటే; లేక వారి ఋతుస్రావం ఇంకా ప్రారంభం కాని వారైతే, అలాంటి వారి గడువు మూడు మాసాలు. మరియు గర్భవతులైన స్త్రీల గడువు వారి కాన్పు అయ్యే వరకు. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు గలవానికి ఆయన, అతని వ్యవహారంలో సౌలభ్యం కలిగిస్తాడు.
ఇది అల్లాహ్ ఆజ్ఞ, ఆయన దానిని మీపై అవతరింపజేశాడు. మరియు ఎవడైతే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉంటాడో, ఆయన అతని పాపాలను తొలగిస్తాడు. మరియు అతని ప్రతిఫలాన్ని అధికం చేస్తాడు.
(నిర్ణీత గడువు కాలంలో) మీ శక్తి మేరకు, మీరు నివసించే చోటనే, వారిని కూడా నివసించనివ్వండి. మరియు వారిని ఇబ్బందులకు గురి చేయడానికి వారిని బాధించకండి. మరియు వారు గర్భవతులైతే, వారు ప్రసవించే వరకు వారి మీద ఖర్చు పెట్టండి. ఒకవేళ వారు మీ బిడ్డకు పాలుపడుతున్నట్లైతే, వారికి వారి ప్రతిఫలం ఇవ్వండి. దాని కొరకు మీరు ధర్మసమ్మతంగా మీ మధ్య సంప్రదింపులు చేసుకోండి. ఒకవేళ మీకు దాని (పాలిచ్చే) విషయంలో ఇబ్బందులు కలిగితే, (తండ్రి) మరొక స్త్రీతో (బిడ్డకు) పాలిప్పించవచ్చు!
సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమత ప్రకారం ఖర్చు పెట్టాలి. మరియు తక్కువ జీవనోపాధి గల వ్యక్తి అల్లాహ్ తనకు ప్రసాదించిన విధంగా ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఏ వ్యక్తిపై కూడా అతనికి ప్రసాదించిన దాని కంటే మించిన భారం వేయడు. అల్లాహ్ కష్టం తరువాత సుఖం కూడా కలిగిస్తాడు.
మరియు ఎన్నో నగరవాసులు, తమ ప్రభువు మరియు ఆయన ప్రవక్తల ఆజ్ఞలను తిరస్కరించారు. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్క తీసుకున్నాము. మరియు వారికి తీవ్రమైన శిక్షను సిద్ధ పరిచాము.
కావున వారు తమ వ్యవహారాల దుష్టఫలితాన్ని రుచి చూశారు. మరియు వారి వ్యవహారాల పర్యవసానం నష్టమే!
అల్లాహ్ వారి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కావున విశ్వాసులైన బుద్ధమంతులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. వాస్తవానికి అల్లాహ్ మీ వద్దకు హితబోధను (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు.
ఒక ప్రవక్తను కూడా! అతను మీకు స్పష్టమైన అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వినిపిస్తున్నాడు. అది, విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని అంధకారాల నుండి వెలుగులోనికి తీసుకురావటానికి. మరియు అల్లాహ్ ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడ వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. వాస్తవానికి అల్లాహ్ అలాంటి వ్యక్తి కొరకు ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాడు.
అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసుకోవటానికి.
Icon