ترجمة سورة المجادلة

الترجمة التلجوية
ترجمة معاني سورة المجادلة باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

వాస్తవానికి, తన భర్తను గురించి నీతో వాదిస్తున్న మరియు అల్లాహ్ తో మొర పెట్టుకుంటున్న ఆ స్త్రీ మాటలు అల్లాహ్ విన్నాడు. అల్లాహ్ మీ ఇద్దరి సంభాషణ వింటున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం చూసేవాడు.
మీలో ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరంగా ఉంచుతారో! అలాంటి వారి భార్యలు, వారి తల్లులు కాలేరు. వారిని కన్నవారు మాత్రమే వారి తల్లులు. మరియు నిశ్చయంగా, వారు అనుచితమైన మరియు అబద్ధమైన మాట పలుకుతున్నారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు.
మరియు ఎవరైతే తమ భార్యలను జిహార్ ద్వారా దూరం చేసి తరువాత తమ మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే! వారిద్దరు ఒకరినొకరు తాకక ముందు, ఒక బానిసను విడుదల చేయించాలి. ఈ విధంగా మీకు ఉపదేశమివ్వడుతోంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును.
కాని ఎవడైతే ఇలా చేయలేడో, అతడు తన భార్యను తాకక ముందు, రెండు నెలలు వరుసగా ఉపవాసముండాలి. ఇది కూడా చేయలేని వాడు, అరవై మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. ఇదంతా మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించటానికి. మరియు ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడుతుంది.
నిశ్చయంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు, తమకు పూర్వం గతించినవారు అవమానింపడినట్లు అవమానింపబడతారు. మరియు వాస్తవానికి మేము స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము. మరియు సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష పడుతుంది.
అల్లాహ్ వారందరిని మరల బ్రతికించి లేపి, వారు చేసిందంతా వారికి తెలిపే రోజున వారు (తాము చేసిందంతా) మరచిపోయి ఉండవచ్చు, కాని అల్లాహ్ అంతా లెక్కపెట్టి ఉంచుతాడు. మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి.
ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలోనున్న సర్వమూ అల్లాహ్ కు తెలుసునని? ఏ ముగ్గురు కలిసి రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన నాలుగవ వాడిగా ఉంటాడు. మరియు ఏ అయిదుగురు రహస్య సమాలోచనలు చేస్తూ వున్నా ఆయన ఆరవ వాడిగా ఉంటాడు. మరియు అంతకు తక్కువ మందిగానీ లేక అంతకు ఎక్కువ మంది గానీ ఉన్నా ఆయన వారితో తప్పక ఉంటాడు. వారు ఎక్కడ వున్నా సరే! తరువాత ఆయన పునరుత్థాన దినమున వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా)? రహస్య సమాలోచనల్ని నిషేధించటం జరిగినప్పటికీ! వారు - నిషేధింపబడిన దానినే - మళ్ళీ చేస్తున్నారని? మరియు వారు రహస్యంగా పాపం చేయడం - హద్దులు మీరి ప్రవర్తించడం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించడం గురించి - సమాలోచనలు చేస్తున్నారని! (ఓ ముహమ్మద్!) నీ వద్దకు వచ్చినపుడు, అల్లాహ్ కూడా నీకు సలాం చేయని విధంగా, వారు నీకు సలాం చేస్తూ, తమలో తాము ఇలా అనుకుంటారు: "మేము పలికే మాటలకు, అల్లాహ్ మమ్మల్ని ఎందుకు శిక్షించటం లేదు?" వారికి నరకమే చాలు, వారందులో ప్రవేశిస్తారు. ఎంత ఘోరమైన గమ్యస్థానం!
ఓ విశ్వాసులారా! మీరు రహస్య సమాలోచనలు చేస్తే - పాపకార్యాలు, హద్దులు మీరి ప్రవర్తించటం మరియు ప్రవక్త ఆజ్ఞలను ఉల్లంఘించటం గురించి కాకుండా - పుణ్యకార్యాలు మరియు దైవభీతికి సంబంధించిన విషయాలను గురించి మాత్రమే (రహస్య సమాలోచనలు) చేయండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన సన్నిధిలోనే మీరు సమావేశ పరచబడతారు.
నిశ్చయంగా, రహస్య సమాలోచన షైతాన్ చేష్టయే. అది విశ్వాసులకు దుఃఖం కలిగించటానికే! కాని అల్లాహ్ అనుమతి లేనిదే అది వారికి ఏ మాత్రం నష్టం కలిగించజాలదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి.
ఓ విశ్వాసులారా! సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించమని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటు కల్పిస్తే, అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. మరియు ఒకవేళ మీతో (నమాజ్ లేక జిహాద్ కు) లేవండి అని చెప్పబడితే! మీరు లేవండి. మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలా శ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానం చేయటానికి) మీ వద్ద ఏమీ లేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత అని తెలుసుకోండి.
ఏమీ? మీరు (ప్రవక్తతో) ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయ పడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు, కావు మీరు నమాజ్ ను స్థాపించండి మరియు విధి దానం (జకాత్) ఇవ్వండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
ఏమీ? అల్లాహ్ ఆగ్రహానికి గురి అయిన జాతి వారి వైపుకు మరలిన వారిని నీవు చూడలేదా? వారు మీతో చేరిన వారు కారు మరియు వారితోను చేరినవారు కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య ప్రమాణం చేస్తున్నారు.
అల్లాహ్ వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. నిశ్చయంగా, వారు చేసే పనులన్నీ చాలా చెడ్డవి.
వారు తమ ప్రమాణాలను డాలుగా చేసుకొని (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు, కావున వారికి అవమాన కరమైన శిక్ష పడుతుంది.
అల్లాహ్ (శిక్ష) నుండి కాపాడటానికి, వారి సంపదలు గానీ, వారి సంతానం గానీ వారికి ఏ మాత్రం పనికిరావు. ఇలాంటి వారే నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
అల్లాహ్ వారందరినీ మరల బ్రతికించి లేపిన రోజు, వారు మీతో ప్రమాణాలు చేసినట్లు ఆయన (అల్లాహ్) ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. మరియు దాని వలన వారు మంచి స్థితిలో ఉన్నారని భావిస్తారు. జాగ్రత్త! నిశ్చయంగా, ఇలాంటి వారే అసత్యవాదులు!
షైతాన్ వారిపై ప్రాబల్యం పొంది నందు వలన వారిని అల్లాహ్ ధ్యానం నుండి మరపింప జేశాడు. అలాంటి వారు షైతాన్ పక్షానికి చెందిన వారు. జాగ్రత్త! షైతాన్ పక్షానికి చెందినవారు, వారే! నిశ్చయంగా నష్టపోయేవారు.
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తారో! అలాంటి వారే, పరమ నీచులలో చేరిన వారు.
"నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము" అని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు!
అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు.
Icon