ترجمة سورة الغاشية

الترجمة التلجوية
ترجمة معاني سورة الغاشية باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా?
కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి.
(ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి,
వారు దహించే అగ్నిలో పడి కాలుతారు.
వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు.
అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు!
ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి;
తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు.
అత్యున్నతమైన స్వర్గవనంలో.
అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు.
అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి;
అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి;
మరియు పేర్చబడిన (మధు) పాత్రలు;
మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు;
మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు.
ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో?
మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో?
మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో?
మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో?
కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే!
నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు.
ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో!
అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు.
నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది;
ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే!
Icon