الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الكهف యొక్క అనువాదం
ﰡ
Verse 1
తన దాసునిపై (ముహమ్మద్ పై) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేసిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్తత్వాన్ని ఉంచలేదు.
Verse 2
ఇది సక్రమంగా స్థిరంగా ఉండి, ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం (స్వర్గం) తప్పక ఉంటుందనే శుభవార్తనూ ఇస్తుంది.
Verse 3
ﯸﯹﯺ
ﯻ
అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు.
Verse 4
ﯼﯽﯾﯿﰀﰁ
ﰂ
ఇంకా ఇది: "అల్లాహ్ కు సంతానముంది!" అని అనే వారిని హెచ్చరిస్తుంది.
Verse 5
ఈ విషయాన్ని గురించి వారికి గానీ, వారి తండ్రి తాతలకు గానీ ఎలాంటి జ్ఞానం లేదు, వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే.
Verse 6
ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నీవు నీ ప్రాణాన్నే కోల్పోతావేమో!
Verse 7
నిశ్చయంగా - ప్రజలలో మంచిపనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి - మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా (ఆకర్షణీయమైనవిగా) చేశాము.
Verse 8
ﭼﭽﭾﭿﮀﮁ
ﮂ
మరియు నిశ్చయంగా, మేమే దానిపై ఉన్న దాన్నంతటినీ చదువైన మైదానం (బంజరునేల) గా మార్చగలము.
Verse 9
ఏమీ? నిశ్చయంగా, ఆ గుహవాసులు మరియు ఆ శిలాఫలకం వారు, మా (ఇతర) సూచనలన్నింటిలో అద్భుతమైనవి నీవు భావించావా?
Verse 10
(జ్ఞాపకం చేసుకోండి) ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో, ఇలా ప్రార్థించారు: "ఓ మా ప్రభూ! మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. మరియు మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లు మమ్మల్ని సరిదిద్దు!"
Verse 11
కావున ఆ గుహలో, కొన్ని సంవత్సరాల వరకు మేము వారి చెవులను మూసివేశాము.
Verse 12
ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో ఎవరు, వారు (గుహలో) నివసించిన కాలాన్ని సరిగ్గా లెక్కపెడతారో చూద్దామని వారిని లేపాము.
Verse 13
మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా, వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు; మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము.
Verse 14
మరియు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని ప్రసాదించాము. వారు లేచి నిలబడినప్పుడు ఇలా అన్నారు: "భూమ్యాకాశాల ప్రభువే మా ప్రభువు! ఆయనను వదలి మేము వేరే దైవాన్ని ఎలాంటి స్థితిలోనూ ప్రార్థించము. వాస్తవానికి అలా చేస్తే దారుణం చేసిన వారమవుతాము!
Verse 15
"ఈ, మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే, వారిని (ఆ దైవాలను) గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు?"
Verse 16
(వారు పరస్పరం ఇలా అనుకున్నారు): "ఇపుడు మీరు వారిని మరియు అల్లాహ్ ను కాదని వారు ఆరాధించే దైవాలను విడిచి, గుహలో శరణు తీసుకోండి. మీ ప్రభువు తన కారుణ్యాన్ని మీపై విస్తరింపజేస్తాడు. మరియు మీ కార్యాలను సరిదిద్ది వాటిని మీకు సులభమైనట్లుగా చేస్తాడు."
Verse 17
మరియు వారు (ఆ గుహలోని) ఒక విశాలమైన భాగంలో (నిద్రిస్తూ) ఉన్నప్పుడు; సూర్యుడు ఉదయించే టప్పుడు, (ఎండ) వారి గుహ నుండి కుడి ప్రక్కకు వాలి పోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు (ఎండ) ఎడమ ప్రక్కకు తొలగి పోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లాహ్ సూచనలలో ఒకటి. అల్లాహ్ మార్గదర్శకత్వం చేసినవాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుడిని నీవు పొందలేవు.
Verse 18
మరియు వారు నిద్రపోతున్నప్పటికీ, నీవు వారిని మేల్కొని ఉన్నారనే భావించి ఉంటావు! మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించే వారము. మరియు వారి కుక్క గుహద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగిచూసి ఉంటే, నీవు తప్పక వెనుదిరిగి పారిపోయే వాడవు మరియు వారిని గురించి భయకంపితుడవై పోయేవాడవు.
Verse 19
మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: "మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: "మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము." (మరికొందరు) ఇలా అన్నారు: "మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు.
Verse 20
"ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తు పడితే, వారు తప్పక మిమ్మల్ని రాళ్ళు రువ్వి చంపుతారు లేదా (బలవంతంగా) మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు, అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు."
Verse 21
మరియు ఈ విధంగా అల్లాహ్ వాగ్దానం సత్యమని చివరి ఘడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి, ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు వారు (ప్రజలు) వారి (గుహవాసుల) విషయాన్ని తీసుకొని పరస్పరం వాదులాడుకున్న విషయం (జ్ఞాపకం చేసుకోండి!) వారిలో కొందరన్నారు: "వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి." వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి (ప్రాబల్యం) ఉన్నవారు: "వారి స్మారకంగా ఒక మస్జిద్ ను నిర్మించాలి." అని అన్నారు.
Verse 22
(వారి సంఖ్యను గురించి) కొందరంటారు: "వారు ముగ్గురు, నాలుగవది వారి కుక్క." మరికొందరంటారు: "వారు అయిదుగురు ఆరవది వారి కుక్క." ఇవి వారి ఊహాగానాలే. ఇంకా కొందరంటారు: "వారు ఏడుగురు, ఎనిమిదవది వారి కుక్క." వారితో అను: "వారి సంఖ్య కేవలం నా ప్రభువుకే తెలుసు. వారిని గురించి కొందరికి మాత్రమే తెలుసు." కావున నిదర్శనం లేనిదే వారిని గురించి వాదించకు. మరియు (గుహ) వారిని గురించి వీరిలో ఎవ్వరితోనూ విచారణ చేయకు.
Verse 23
మరియు ఏ విషయాన్ని గురించి అయినా: "నేను ఈ పనిని రేపు చేస్తాను." అని అనకు -
Verse 24
"అల్లాహ్ కోరితే తప్ప (ఇన్షా అల్లాహ్)!" అని అననిదే! మరియు నీ ప్రభువును స్మరించు, ఒకవేళ నీవు మరచిపోతే! ఇలా ప్రార్థించు: "బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీని కంటే దగ్గరి త్రోవ చూపుతాడేమో!"
Verse 25
మరియు వారు తమ గుహలో మూడు వందల సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి తొమ్మిది సంవత్సరాలు అధికం.
Verse 26
వారితో అను: "వారెంతకాలం (గుహలో) ఉన్నారో అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త అగోచర విషయాలు కేవలం ఆయనకే తెలుసు. ఆయన అంతా చూడగలడు మరియు వినగలడు. వారికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు మరియు ఆయన తన ఆధిపత్యంలో ఎవ్వడినీ భాగస్వామిగా చేర్చుకోడు."
Verse 27
మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) చదివి వినిపించు. ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు. మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు.
Verse 28
మరియు (ఓ ప్రవక్తా!) ఎవరు ఆయన ముఖ దర్శనం (ప్రసన్నతను) కోరుతూ, ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో, వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు (వారిని ఉపేక్షించకు). మరియు అలాంటి వానిని అనుసరించకు (మాట వినకు), ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించామో మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు (కర్మలు) వ్యర్థమయ్యాయో!
Verse 29
మరియు వారితో అను: "ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించ వచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు!" నిశ్చయంగా, మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంటాము, దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొర పెట్టుకున్నప్పుడు, వారికి ముఖాలను మాడ్చే (మరిగే) నూనె వంటి నీరు (అల్ ముహ్లు) ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ (దుర్భరమైన) విరామ స్థలం!
Verse 30
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో, నిశ్చయంగా మేము అలాంటి వారి మంచిపనుల ప్రతిఫలాన్ని వృథా కానివ్వము.
Verse 31
అలాంటి వారు! వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలు ఉంటాయి. అందు వారు బంగారు కంకణాలను మరియు ఆకు పచ్చని బంగారు జలతారుగల పట్టు వస్త్రాలను ధరించి, ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్ఠమైన విరామ స్థలం!
Verse 32
మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు: వారిద్దరిలో ఒకడికి మేము రెండు ద్రాక్షతోటలను ప్రసాదించి, వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంటపొలాన్ని ఏర్పరిచాము.
Verse 33
ఆ రెండు తోటలు, ఏ కొరతా లేకుండా (పుష్కలంగా) పంటలిచ్చేవి. మరియు వాటి మధ్య మేము ఒక సెలయేరును ప్రవహింపజేశాము.
Verse 34
మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు: "నేను నీ కంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు."
Verse 35
మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునేవాడవుతూ, తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు: "ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను!
Verse 36
మరియు అంతిమ ఘడియ కూడా వస్తుందని నేను భావించను, ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా, అచ్చట నేను దీని కంటే మేలైన స్థానాన్నే పొందగలను."
Verse 37
అతడి పొరుగువాడు అతడితో మాట్లాడుతూ అన్నాడు: "నిన్ను మట్టితో, తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి, ఆ తరువాత నిన్ను (సంపూర్ణ) మానవుడిగా తీర్చిదిద్దిన ఆయన (అల్లాహ్)ను నీవు తిరస్కరిస్తున్నావా?
Verse 38
కాని నిశ్చయంగా, నా మట్టుకు మాత్రం ఆయన! అల్లాహ్ యే నా ప్రభువు మరియు నేను ఎవ్వడినీ నా ప్రభువుకు భాగస్వామిగా (సాటిగా) కల్పించను.
Verse 39
"మరియు ఒకవేళ నీవు, నన్ను సంపదలో మరియు సంతానంలో నీ కంటే తక్కువగా తలచినప్పటికీ, నీవు నీ తోటలో ప్రవేశించినపుడు: "అల్లాహ్ కోరిందే అవుతుంది (మాషా అల్లాహ్), సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహ్ యే (లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)! అని అని వుంటే ఎంత బాగుండేది.
Verse 40
"వాస్తవానికి నా ప్రభువు, నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి, దాని (నీ తోట) పైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి, దానిని చదునైన మైదానంగా చేయవచ్చు!
Verse 41
లేదా ! దాని నీటిని భూమిలో ఇంకి పోయినట్లు చేస్తే, నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేవు!"
Verse 42
మరియు అతడి పంటను (వినాశం) చుట్టుముట్టింది, అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నేను నా ప్రభువుకు భాగస్వాములను (షరీక్ లను) కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది!"
Verse 43
మరియు అల్లాహ్ కు విరుద్ధంగా అతడికి సహాయపడే వారెవ్వరూ లేక పోయారు. మరియు అతడు కూడా తనకు తాను సహాయం చేసుకోలేక పోయాడు.
Verse 44
అక్కడ (ఆ తీర్పుదినం నాడు) శరణు (రక్షణ) కేవలం అల్లాహ్, ఆ సత్యవంతునిదే! ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితం ఇచ్చేవాడు.
Verse 45
మరియు వారికి ఇహలోక జీవితాన్ని ఈ ఉపమానం ద్వారా బోధించు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించినపుడు, దానిని భూమిలోని చెట్టూ చేమలు పీల్చుకొని (పచ్చగా పెరుగుతాయి). ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినపుడు, గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 46
ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి.
Verse 47
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము. మరియు నీవు భూమిని చదువైన మైదానంగా చూస్తావు. మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము.
Verse 48
మరియు వారందరు నీ ప్రభువు సన్నిధిలో వరుసలలో ప్రవేశపెట్టబడతారు, (నీ ప్రభువు వారితో): "వాస్తవానికి మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చారు! కాని మా ముందు హాజరయ్యే ఘడియను మేము నియమించలేదని మీరు భావించేవారు కదా!" అని పలుకుతాడు.
Verse 49
మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.
Verse 50
మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగ పడండి." అని చెప్పినపుడు, ఒక్క ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతులలోని వాడు. అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమీ? మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా! దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది.
Verse 51
నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గానీ, లేదా స్వయంగా వారిని (షైతానులను) సృష్టించినప్పుడు గానీ వారిని సాక్షులుగా పెట్టలేదు. మార్గం తప్పించే వారిని నేను (అల్లాహ్) సహాయకులుగా చేసుకునే వాడను కాను.
Verse 52
మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ దినమున ఆయన (అల్లాహ్) వారితో: "మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి!" అని అన్నప్పుడు, వారు (భాగస్వాములుగా భావించిన) వారిని పిలుస్తారు, కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము.
Verse 53
మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎలాంటి ఉపాయం పొందరు.
Verse 54
మరియు నిశ్చయంగా, మేము ఈ ఖుర్ఆన్ లో మానవులకు, ప్రతి విధమైన ఉపమానాన్ని వివరించాము. కాని మానవుడు పరమ జగడాల మారి!
Verse 55
మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు, దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంక పరిచిందేమిటి! వారి పూర్వీకుల మీద పడిన (ఆపద) వారి మీద కూడా పడాలనో, లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప?
Verse 56
మరియు మేము సందేశహరులను కేవలం శుభవార్తలు అందజేసేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మాత్రమే పంపుతాము. మరియు సత్యతిరస్కారులు, సత్యాన్ని ఖండించటానికి నిరర్థకమైన మాటలతో వాదులాడుతారు. మరియు నా సూచనలను మరియు హెచ్చరికలను హాస్యంగా తీసుకుంటారు.
Verse 57
మరియు తన ప్రభువు సూచనలతో హితబోధ చేయబడినపుడు, వాటికి విముఖుడై తన చేతులారా చేసుకొని పంపిన దాన్ని (దుష్పరిణామాన్ని) మరచి పోయే వ్యక్తి కంటే, పరమ దుర్మార్గుడెవడు? వారు దానిని (ఖుర్ఆన్ ను) అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాల మీద తెరలు వేసి ఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు కలిగించాము. కావున, నీవు వారిని సన్మార్గం వైపునకు పిలిచినా వారెన్నటికీ సన్మార్గం వైపునకు రాలేరు.
Verse 58
మరియు నీ ప్రభువు క్షమాశీలుడు, కారుణ్యమూర్తి. ఆయన వారి దుష్కర్మల ఫలితంగా వారిని పట్టుకోదలిస్తే, వారిపై తొందరగానే శిక్ష పంపి ఉండేవాడు. కాని వారికొక నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంది, దాని నుండి వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
Verse 59
మరియు (ఆ నగరాల వారు) దుర్మార్గం చేసినందుకు మేము నాశనం చేసిన నగరాలు ఇవే! మరియు వారి నాశనం కొరకు కూడా మేము ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాము.
Verse 60
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే!"
Verse 61
ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి - సొరంగం గుండా పోయినట్లు - దూసుకు పోయింది.
Verse 62
ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత, అతను (మూసా) తన సేవకునితో ఇలా అన్నాడు: "మన భోజనం తీసుకురా! వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము."
Verse 63
(సేవకుడు) ఇలా అన్నాడు: "చూశారా! మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినపుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచి పోయాను. షైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొని పోయింది!"
Verse 64
(మూసా) అన్నాడు: "అదే కదా, మనం కోరుతున్నది (వెతుకుతున్న స్థానం)!" ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు.
Verse 65
అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి (అచ్చట) చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి, అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము.
Verse 66
మూసా అతనితో (ఖిద్ర్ తో) అన్నాడు: "నీకు నేర్పబడిన జ్ఞానాన్ని నీవు నాకు నేర్పుటకై నేను నిన్ను అనుసరించ వచ్చునా?"
Verse 67
ﮘﮙﮚﮛﮜﮝ
ﮞ
అతను జవాబిచ్చాడు: "నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవు!
Verse 68
అసలు నీకు తెలియని విషయాన్ని గురించి నీవెట్లు సహనం వహించగలవు?"
Verse 69
(మూసా) అన్నాడు: "అల్లాహ్ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించను!"
Verse 70
అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు."
Verse 71
ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరు పడవలో ఎక్కినపుడు అతను పడవకు రంధ్రం చేశాడు. (మూసా) అతనితో అన్నాడు: "ఏమీ? పడవలో ఉన్న వారిని ముంచి వేయటానికా, నీవు దానిలో రంధ్రం చేశావు? వాస్తవానికి, నీవు ఒక దారుణమైన పని చేశావు!"
Verse 72
అతను అన్నాడు: "నేను నీతో అనలేదా? నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవని?"
Verse 73
(మూసా) అన్నాడు: "మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పుపట్టకు. నేను చేసిన దానికి నా పట్ల కఠినంగా వ్యవహరించకు!"
Verse 74
ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని (బాలుణ్ణి) చంపాడు. (అది చూసి) మూసా అన్నాడు: "ఏమీ? ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ (చంపలేదే)! వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పని చేశావు!"
Verse 75
అతను (ఖిద్ర్) అన్నాడు: "నేను నీతో అనలేదా, నిశ్చయంగా, నీవు నాతో పాటు ఏ మాత్రం సహనం వహించలేవని?"
Verse 76
(మూసా) అన్నాడు: "ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు, నా తరఫు నుండి ఇంత వరకు చాలినన్ని సాకులు స్వీకరించావు."
Verse 77
ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒక నగరం చేరుకొని ఆ నగరవాసులను భోజనమడిగారు. కాని వారు (ఆ నగరవాసులు) వారిద్దరికి ఆతిథ్యమివ్వటానికి నిరాకరించారు. అప్పుడు వారక్కడ కూలిపోనున్న ఒక గోడను చూశారు. అతను (ఖిద్ర్) దానిని మళ్ళీ నిలబెట్టాడు. (మూసా) అన్నాడు: "నీవు కోరితే దానికి (ఆ శ్రమకు) ప్రతిఫలం (వేతనం) తీసుకొని ఉండవచ్చు కదా!"
Verse 78
అతను (ఖిద్ర్) అన్నాడు: "ఇక నేనూ నీవూ విడిపోవలసిన (సమయం) వచ్చింది. ఇక నీవు సహనం వహించ లేక పోయిన విషయాల వాస్తవాలను (తత్త్వాలను) గురించి నీకు తెలుపుతాను.
Verse 79
ఇక ఆ నావ విషయం: అది సముద్రంలో పని చేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను; ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు (లోపం లేని) ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు.
Verse 80
ఇక ఆ బాలుని విషయం: అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్యతిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము.
Verse 81
కావున వారిద్దరి ప్రభువు వారికి అతనికి బదులు అతని కంటే ఎక్కువ నీతిమంతుడు మరియు కారుణ్యం గలవాడిని ఇవ్వాలని కోరాము.
Verse 82
ఇక ఆ గోడ విషయం: అది ఈ పట్టణంలోని ఇద్దరు ఆనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి (పాతబడి) ఉంది. మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్తవయస్తులైన పిదప - నీ ప్రభువు కారుణ్యంగా - తమ నిధిని, వారు త్రవ్వి తీసుకోవాలని, నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం (తత్త్వం) ఇదే!"
Verse 83
మరియు వారు నిన్ను జుల్ ఖర్ నైన్ ను గురించి అడుగుతున్నారు. వారితో అను: "అతనిని గురించి జ్ఞాపకముంచుకో దగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను."
Verse 84
నిశ్చయంగా మేము అతని (అధికారాన్ని) భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము.
Verse 85
ﭜﭝ
ﭞ
అతను ఒక మార్గం మీద పోయాడు.
Verse 86
చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు. మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము: "ఓ జుల్ ఖర్ నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు!"
Verse 87
అతను అన్నాడు: "ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము. ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు.
Verse 88
ఇక ఎవడైతే! విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అతనికి మంచి ప్రతిఫల ముంటుంది. మేము అతనిని ఆజ్ఞాపించి నపుడు, సులభతరమైన ఆజ్ఞనే ఇస్తాము."
Verse 89
ﮖﮗﮘ
ﮙ
తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.
Verse 90
చివరకు సూర్యుడు ఉదయించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని (సూర్యుణ్ణి) ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని (సూర్యుని) నుండి కాపాడుకోవటానికి ఎలాంటి చాటు (రక్షణ) నివ్వలేదు.
Verse 91
ఈ విధంగా! వాస్తవానికి, అతనికి (జుల్ ఖర్ నైన్ కు) తెలిసి ఉన్న విషయాలను గురించి మాకు బాగా తెలుసు.
Verse 92
ﯓﯔﯕ
ﯖ
ఆ తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు.
Verse 93
చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతివారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థం చేసుకోగలిగారు.
Verse 94
వారన్నారు: "ఓ జుల్ ఖర్ నైన్! వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజ్ లు, ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకూ మరియు వారికీ మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి, మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా?"
Verse 95
అతను అన్నాడు: "నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే, నేను మీకూ మరియు వారికీ మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను.
Verse 96
"మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి." అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు: "అగ్ని రగిలించండి." దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత, అన్నాడు: "ఇక కరిగిన రాగిని తీసుకు రండి, దీని మీద పోయటానికి."
Verse 97
ఈ విధంగా వారు (యాజూజ్ మరియు మాజూజ్ లు) దానిపై నుండి ఎక్కి రాలేక పోయారు. మరియు దానిలో కన్నం కూడా చేయలేక పోయారు.
Verse 98
అతను (జుల్ ఖర్ నైన్) అన్నాడు: "ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినపుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు. మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది."
Verse 99
మరియు ఆ (యాజూజ్ మరియు మాజూజ్ లు బయటికి వచ్చిన) రోజు, మేము వారిని అలల వలే ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము. మరియు బాకా (సూర్) ఊదబడి నప్పుడు, వారందరినీ ఒకచేట సమావేశ పరుస్తాము.
Verse 100
ﭱﭲﭳﭴﭵ
ﭶ
మరియు ఆ రోజున మేము సత్యతిరస్కారులకు నరకాన్ని స్పష్టంగా చూసేందుకు వారి ముందుకు తెస్తాము.
Verse 101
అలాంటి వారికి, ఎవరి కన్నులైతే, మా హితోపదేశం పట్ల కప్పబడి ఉండెనో మరియు వారికి, ఎవతైతే (దానిని) ఏ మాత్రమూ వినటానికి కూడా ఇష్టపడలేదో!
Verse 102
ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి, నా దాసులను తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకొనగలరని భావించారా? నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంటాము.
Verse 103
ﮓﮔﮕﮖﮗ
ﮘ
వారితో అను: "కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువ నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?
Verse 104
"ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసే వన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!
Verse 105
వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి వున్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము.
Verse 106
అదే వారి ప్రతిఫలం నరకం! ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు.
Verse 107
నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! వారి ఆతిథ్యం కొరకు ఫిర్ దౌస్ స్వర్గవనాలు ఉంటాయి.
Verse 108
ﯪﯫﯬﯭﯮﯯ
ﯰ
వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు.
Verse 109
వారితో అను: "నా ప్రభువు మాటలను వ్రాయటానికి, సముద్రమంతా సిరాగా మారి పోయినా - నా ప్రభువు మాటలు పూర్తికాక ముందే - దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా, అది కూడా తరిగి పోతుంది."
Verse 110
(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు."
تقدم القراءة