الترجمة التلجوية నుండి التلجوية లో సూరా الأنعام యొక్క అనువాదం
Verse 1
ఆకాశాలను మరియు భూమిని సృష్టించి; చీకట్లను మరియు వెలుగును నెలకొలిపిన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు. అయినా సత్యతిరస్కారులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా పరిగణిస్తున్నారు.
Verse 2
ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు.
Verse 3
మరియు ఆయన! అల్లాహ్ యే, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు.
Verse 4
అయినా వారి ప్రభువు సూచనల నుండి వారి వద్దకు ఏ సూచన వచ్చినా దానికి వారు విముఖతే చూపేవారు!
Verse 5
వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్య గ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు పరిహసించే దాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది.
Verse 6
ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా?) వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదలనిచ్చి వారిని భువిలో స్థిర పరిచాము; మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాలు కురిపించాము; మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము; చివరకు వారు చేసిన పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము; మరియు వారి స్థానంలో ఇతర తరాల వారిని లేపాము.
Verse 7
మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!" అని అనేవారు.
Verse 8
మరియు వారు: "ఇతని వద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింప బడ లేదు?" అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపి ఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది. కాదు.
Verse 9
మరియు ఒకవేళ మేము దైవదూతను అవతరింపజేసినా, అతనిని మేము మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారం. మరియు వారు ఇపుడు ఏ సంశయంలో పడి ఉన్నారో! వారిని ఆ సంశయానికే గురి చేసి ఉండేవారం.
Verse 10
మరియు వాస్తవానికి నీకు పూర్వం కూడా చాలా మంది ప్రవక్తలను ఎగతాళి చేయటం జరిగింది, కావున పరిహసించే వారు దేనిని గురించి ఎగతాళి చేసేవారో అదే వారిని చుట్టుకున్నది.
Verse 11
ఇలా అను: "మీరు భూమిలో సంచారం చేసి, సత్యతిరస్కారుల ముగింపు ఎలా జరిగిందో చూడండి!"
Verse 12
వారిని అడుగు: "ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఎవరికి చెందినది?" అని. (నీవే) జవాబివ్వు: "(అంతా) అల్లాహ్ దే!" ఆయన కరుణించటాన్ని, తనపై తాను (కర్తవ్యంగా) విధించుకున్నాడు. నిశ్చయంగా, ఆయన పునరుత్థాన దినమున మీ అందరినీ సమావేశ పరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైతే తమను తాము నష్టానికి గురి చేసుకున్నారో, అలాంటి వారే విశ్వసించరు!
Verse 13
మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
Verse 14
(ఓ ముహమ్మద్!) ఇలా అను: "ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా? మరియు ఆయనే అందరికీ ఆహార మిస్తున్నాడు. మరియు ఆయన కెవ్వడూ ఆహార మివ్వడు." (ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా, అందరి కంటే ముందు నేను ఆయనకు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లింను) కావాలని మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించేవారిలో చేరకూడదనీ ఆదేశించబడ్డాను!"
Verse 15
(ఇంకా) ఇలా అను :"నిశ్చయంగా, నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే నిశ్చయంగా, రాబోయే ఆ గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను!"
Verse 16
ఆ రోజు దాని (ఆ శిక్ష నుండి) తప్పించుకున్న వాడిని, వాస్తవంగా! ఆయన (అల్లాహ్) కరుణించినట్లే. మరియు అదే స్పష్టమైన విజయం (సాఫల్యం).
Verse 17
మరియు అల్లాహ్ నీకు ఏదైనా హాని కలిగిస్తే! ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేస్తే! ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 18
మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.
(ఓ ముహమ్మద్! వారిని) అడుగు: "అన్నింటి కంటే గొప్ప సాక్ష్యం ఏదీ?" ఇలా అను: "నాకూ మరియు మీకూ మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు. మరియు మిమ్మల్ని మరియు ఇది (ఈ సందేశం) అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి, ఈ ఖుర్ఆన్ నాపై అవతరింపజ జేయబడింది." ఏమీ? వాస్తవానికి అల్లాహ్ తో పాటు ఇంకా ఇతర ఆరాధ్యదైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా, సాక్ష్యమివ్వగలరా? ఇలా అను: "నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను!" ఇంకా ఇలా అను: "నిశ్చయంగా ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దేవుడు. మరియు నిశ్చయంగా, మీరు ఆయనకు సాటి కల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు!"
Verse 20
ఎవరికైతే మేము గ్రంథాన్ని ప్రసాదించామో! వారు తమ పుత్రులను గుర్తించినట్లు, ఇతనిని (ముహమ్మద్ ను) కూడా గుర్తిస్తారు. ఎవరైతే, తమను తాము నష్టానికి గురి చేసుకుంటారో అలాంటి వారే విశ్వసించరు.
Verse 21
మరియు అల్లాహ్ పై అసత్యం కల్పించే వాని కంటే! లేదా, అల్లాహ్ సూచనలను తిరస్కరించే వాని కంటే, ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందరు.
Verse 22
మరియు ఆరోజు మేము వారందరినీ సమావేశపరుస్తాము. ఆ తరువాత (అల్లాహ్ కు) సాటి కల్పించే (షిర్కు చేసే) వారితో: "మీరు (దైవాలుగా) భావించిన (అల్లాహ్ కు సాటి కల్పించిన) ఆ భాగస్వాములు ఇప్పుడు ఎక్కడున్నారు?" అని అడుగుతాము.
Verse 23
అప్పుడు వారికి: "మా ప్రభువైన అల్లాహ్ సాక్షిగా! మేము ఆయన (అల్లాహ్) కు సాటి కల్పించేవారము (ముష్రికీన్) కాదు!" అని చెప్పడం తప్ప మరొక సాకు దొరకదు.
Verse 24
చూడండి! వారు తమను గురించి తామే ఏ విధంగా అబద్ధాలు కల్పించు కున్నారో! మరియు ఏ విధంగా వారు కల్పించుకున్నవి (బూటకదైవాలు) మాయమై పోయాయో!
Verse 25
మరియు (ఓ ప్రవక్తా!) వారిలో కొందరు నీ (మాటలు) వింటున్నట్లు (నటించే) వారున్నారు. మరియు వారు దానిని అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాలపై తెరలు వేసి వున్నాము మరియు వారి చెవులకు చెవుడు పట్టించి వున్నాము. మరియు వారు ఏ అద్భుత సంకేతాన్ని చూసినా దానిని విశ్వసించరు. చివరకు వారు నీ వద్దకు వచ్చి, నీతో వాదులాడేటప్పుడు, వారిలో సత్యాన్ని తిరస్కరించేవారు: "ఇవి కేవలం పూర్వీకుల కట్టుకథలు మాత్రమే!" అని అంటారు.
Verse 26
మరియు వారు ఇతరులను అతని (ప్రవక్త) నుండి ఆపుతారు. మరియు స్వయంగా తాము కూడా అతనికి దూరంగా ఉంటారు. మరియు ఈ విధంగా వారు తమకు తామే నాశనం చేసుకుంటున్నారు. కాని వారది గ్రహించటం లేదు!
Verse 27
మరియు వారిని నరకం ముందు నిలబెట్టబడినపుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది!) వారు ఇలా అంటారు: "అయ్యే మా పాడుగానూ! మేము తిరిగి (పూర్వ జీవితంలోకి) పంపబడితే, మా ప్రభువు సూచనలను, అసత్యాలని తిరస్కరించకుండా విశ్వాసులలో చేరి పోయే వారం కదా!"
Verse 28
(వారు ఇలా అనటానికి కారణం), వాస్తవానికి వారు ఇంత వరకు దాచిన దంతా వారికి బహిర్గతం కావటమే! మరియు ఒకవేళ వారిని (గత జీవితంలోకి) తిరిగి పంపినా, వారికి నిషేధించబడిన వాటినే వారు తిరిగి చేస్తారు. నిశ్చయంగా, వారు అసత్యవాదులు!
Verse 29
మరియు వారు: "మాకు ఇహలోక జీవితం తప్ప మరొక (జీవితం) లేదు మరియు మేము తిరిగి లేపబడము (మాకు పునరుత్థానం లేదు)!" అని అంటారు.
Verse 30
మరియు ఒకవేళ వారిని, తమ ప్రభువు ముందు నిలబెట్టబడినప్పుడు, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది)! ఆయన (అల్లాహ్) అంటాడు: "ఏమీ? ఇది (పునరుత్థానం) నిజం కాదా?" వారు జవాబిస్తారు: "అవును (నిజమే) మా ప్రభువు సాక్షిగా!" అప్పుడు ఆయన: "అయితే మీరు మీ సత్యతిరస్కారానికి ఫలితంగా శిక్షను అనుభవించండి!" అని అంటాడు.
Verse 31
వాస్తవంగా అల్లాహ్ ను కలుసుకోవటాన్ని అబద్ధంగా పరిగణించే వారే నష్టానికి గురి అయిన వారు! చివరకు ఆకస్మాత్తుగా అంతి ఘడియ వారి పైకి వచ్చినపుడు వారు: "అయ్యే మా దౌర్భాగ్యం! దీని విషయంలో మేమెంత అశ్రద్ధ వహించాము కదా! అని వాపోతారు. (ఎందుకంటే) వారు తమ (పాపాల) బరువును తమ వీపులపై మోసుకొని ఉంటారు. అయ్యే! వారు మోసే భారం ఎంత దుర్భరమైనది కదా!
Verse 32
మరియు ఇహలోక జీవితం ఒక ఆట మరియు ఒక కాలక్షేపము మాత్రమే! మరియు దైవభీతి గల వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్ఠమైనది. ఏమీ? మీరు అర్థం చేసుకోలేరా?
Verse 33
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి వారు పలుకుతున్న మాటల వలన నీకు దుఃఖము కలుగుతున్నదని మాకు బాగా తెలుసు. కానీ, నిశ్చయంగా, వారు అసత్యుడవని తిరస్కరించేది నిన్ను కాదు! వాస్తవానికి ఆ దుర్మార్గులు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తున్నారు.
Verse 34
మరియు వాస్తవంగా, నీకు పూర్వం చాలా మంది ప్రవక్తలు, అసత్యవాదులని తిరస్కరించబడ్డారు. కాని వారు ఆ తిరస్కారాన్ని మరియు తమకు కలిగిన హింసలను, వారికి మా సహాయం అందే వరకూ సహనం వహించారు. మరియు అల్లాహ్ మాటలను ఎవ్వరూ మార్చలేరు. మరియు వాస్తవానికి, పూర్వపు ప్రవక్తల కొన్ని సమాచారాలు ఇది వరకే నీకు అందాయి.
Verse 35
మరియు (ఓ ముహమ్మద్!) వారి విముఖత నీకు భరించనిదైతే నీలో శక్తి ఉంటే, భూమిలో ఒక సొరంగం వెదకి, లేదా ఆకాశంలో ఒక నిచ్చెన వేసి, వారి కొరకు ఏదైనా అద్భుత సూచన తీసుకురా! మరియు అల్లాహ్ కోరితే వారందరినీ సన్మార్గం వైపునకు తెచ్చి ఉండేవాడు! కావున నీవు అజ్ఞానులలో చేరకు.
Verse 36
నిశ్చయంగా, ఎవరైతే (శ్రద్ధతో) వింటారో, వారే (సత్యసందేశాన్ని) స్వీకరిస్తారు. ఇక మృతులు (సత్యతిరస్కారులు) - అల్లాహ్ వారిని పునరుత్థరింప జేసినప్పుడు - (ప్రతిఫలం కొరకు) ఆయన వద్దకే రప్పింపబడతారు.
Verse 37
మరియు వారు: "ఇతనిపై (ప్రవక్తపై) ఇతని ప్రభువు తరఫు నుండి ఏదైనా అద్భుత సూచన ఎందుకు అవతరింప జేయబడలేదు?" అని అంటారు. ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్! ఎలాంటి అద్భుత సూచననైనా అవతరింప జేయగల శక్తి కలిగి ఉన్నాడు, కాని వారిలో అనేకులకు ఇది తెలియదు."
Verse 38
మరియు భూమిపై సంచరించే ఏ జంతువు గానీ, లేక తన రెండు రెక్కలతో ఎగిరే ఏ పక్షి గానీ, మీలాంటి సంఘజీవులుగా లేకుండా లేవు! మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు.
Verse 39
మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారు, చెవిటివారు మరియు మూగవారు, అంధకారంలో పడిపోయిన వారు! అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు మరియు తాను కోరిన వారిని ఋజుమార్గంలో ఉంచుతాడు.
Verse 40
వారితో అను: "ఏమీ? మీరు సత్యవంతులే అయితే ఆలోచించి (చెప్పండి!) ఒకవేళ మీపై అల్లాహ్ శిక్ష వచ్చి పడినా, లేదా అంతిమ ఘడియ వచ్చినా! మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఎవరినైనా పిలుస్తారా?
Verse 41
"అలా కానేరదు! మీరు ఆయన (అల్లాహ్) నే పిలుస్తారు. ఆయన కోరితే ఆ ఆపదను మీ పై నుండి తొలగిస్తాడు. అప్పుడు మీరు ఆయనకు సాటి కల్పించే వారిని మరచిపోతారు!"
Verse 42
మరియు వాస్తవానికి మేము, నీకు పూర్వం (ఓ ముహమ్మద్!) అనేక జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపాము. ఆ పిదప వారు వినమ్రులవటానికి మేము వారిపై ఇబ్బందులను మరియు కష్టాలను కలుగ జేశాము.
Verse 43
పిదప మా తరఫు నుండి వారిపై ఆపద వచ్చినపుడు కూడా వారెందుకు వినమ్రులు కాలేదు? కాని వారి హృదయాలు మరింత కఠినమయ్యాయి మరియు షైతాన్ వారు చేసే కర్మలన్నింటినీ వారికి మంచివిగా కనబడేటట్లు చేశాడు.
Verse 44
ఆ పిదప వారికి చేయబడిన బోధనను వారు మరచిపోగా, మేము వారి కొరకు సకల (భోగభాగ్యాల) ద్వారాలను తెరిచాము, చివరకు వారు తమకు ప్రసాదించబడిన ఆనందాలలో నిమగ్నులై ఉండగా, మేము వారిని ఆకస్మాత్తుగా (శిక్షించటానికి) పట్టు కున్నాము, అప్పుడు వారు నిరాశులయ్యారు.
Verse 45
ఈ విధంగా దుర్మార్గానికి పాల్పబడిన వారు సమూలంగా నిర్మూలించబడ్డారు. మరియు సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ మాత్రమే సర్వస్తోత్రాలకు అర్హుడు.
Verse 46
ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ మీ వినికిడినీ మరియు మీ చూపునూ పోగొట్టి, మీ హృదయాలపై ముద్ర వేస్తే! అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా? చూడు! మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నామో! అయినా వారు (వాటి నుండి) తప్పించుకొని పోతున్నారు.
Verse 47
ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చెప్పండి)? అల్లాహ్ శిక్ష మీపై (రాత్రివేళ) ఆకస్మాత్తుగా గానీ లేక (పగటివేళ) బహిరంగంగా గాని వచ్చి పడితే, దుర్మార్గులు తప్ప ఇతరులు నాశనం చేయబడతారా?
Verse 48
మరియు మేము ప్రవక్తలను కేవలం శుభవార్తలు ఇచ్చేవారుగా మరియు హెచ్చరికలు చేసే వారుగా మాత్రమే పంపుతాము. కావున ఎవరైతే విశ్వసించి (తమ నడవడికను) సరిదిద్దుకుంటారో, అలాంటి వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖ పడరు కూడా!
Verse 49
కాని మా సూచనలను అబద్ధాలని తిరస్కరించే వారికి, తమ అవిధేయతకు ఫలితంగా తప్పకుండా శిక్ష పడుతుంది.
Verse 50
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు: "ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?"
Verse 51
మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశ పరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసే వాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో!
Verse 52
మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు.
Verse 53
మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): "ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది?" అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్ కు తెలియదా?
Verse 54
మరియు మా సూచనలను విశ్వసించిన వారు నీ వద్దకు వచ్చినపుడు నీవు వారితో ఇలా అను: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీ ప్రభువు కరుణించటమే తనపై విధిగా నిర్ణయించుకున్నాడు. నిశ్చయంగా, మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల తప్పు చేసి, ఆ తరువాత పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటే! నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 55
ﭿﮀﮁﮂﮃﮄ
ﮅ
మరియు పాపుల మార్గం స్పష్టపడటానికి, మేము ఈ విధంగా మా సూచనలను వివరంగా తెలుపుతున్నాము.
Verse 56
ఇలా అను: "నిశ్చయంగా అల్లాహ్ ను వదిలి, మీరు ప్రార్థించే ఈ ఇతరులను (కల్పిత దైవాలను) ఆరాధించటం నుండి నేను వారించబడ్డాను." మరియు ఇలా అను: "నేను మీ కోరికలను అనుసరించను. (అలా చేస్తే!) వాస్తవానికి నేనూ మార్గభ్రష్టుడను అవుతాను. మరియు నేను సన్మార్గం చూపబడిన వారిలో ఉండను."
Verse 57
ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువు తరఫు నుండి లభించిన స్పష్టమైన ప్రమాణంపై ఉన్నాను. మీరు దానిని అబద్ధమని నిరాకరించారు. మీరు తొందర పెట్టే విషయం నా దగ్గర లేదు. నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంది. ఆయన సత్యాన్ని తెలుపుతున్నాడు. మరియు ఆయనే సర్వోత్తమమైన న్యాయాధికారి!"
Verse 58
ఇలా అను: "ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు.
Verse 59
మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.
Verse 60
మరియు ఆయనే రాత్రివేళ (మీరు నిద్రపోయినపుడు) మీ ఆత్మలను తీసుకుంటాడు (స్వాధీనపరచు కుంటాడు) మరియు పగటివేళ మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆ పిదప నిర్ణీత గడువు, పూర్తి అయ్యే వరకు దానిలో (పగటి వేళలో) మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆ తరువాత ఆయన వైపునకే మీ మరలింపు ఉంది. అప్పుడు (పునరుత్థాన దినమున) ఆయన మీరు చేస్తూ ఉన్న కర్మలన్నీ మీకు తెలుపుతాడు.
Verse 61
ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు.
Verse 62
తరువాత వారు, వారి నిజమైన సంరక్షకుడు, అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి! సర్వ న్యాయాధికారం ఆయనదే! మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు!
Verse 63
" 'మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము.' అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు! భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు? అని వారిని అడుగు.
Verse 64
"అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి (భాగస్వాములు) కల్పిస్తున్నారు!" అని వారికి చెప్పు.
Verse 65
ఇలా అను: "ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రింది నుండి గానీ, మీపై ఆపద అవతరింప జేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు; మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి, పరస్పర కలహాల రుచి చూప గలిగే (శక్తి కూడా) కలిగి ఉన్నాడు." చూడు! బహుశా వారు (సత్యాన్ని) గ్రహిస్తారోమోనని, మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో!
Verse 66
మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను: "నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను!"
Verse 67
ﯰﯱﯲﯳﯴﯵ
ﯶ
ప్రతి వార్తకు (విషయానికి) ఒక గడువు నియమింపబడి ఉంది. మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు.
Verse 68
మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ షైతాన్ నిన్ను మరపింపజేస్తే! జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు.
Verse 69
మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు!
మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదలిపెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోసపుచ్చింది. ఏ వ్యక్తి గానీ తన కర్మల ఫలితంగా నాశనం చేయ బడకుండా ఉండటానికి దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్ తప్ప, అతనికి రక్షించేవాడు గానీ సిఫారసు చేసేవాడు గానీ, ఎవ్వడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటి వారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్యతిరస్కారానికి ఫలితంగా, త్రాగటానికి సలసల కాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష గలవు.
Verse 71
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ ను వదలి మాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించ లేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుదిరిగి పోవాలా? అతని వలే ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ, 'మా వైపుకురా!' అంటున్నా - షైతాన్ మోసపుచ్చటం వలన - భూమిలో ఏమీ తోచకుండా, తిరుగుతాడో?" వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులముగా (ముస్లింలముగా) ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము;
Verse 72
"మరియు నమాజ్ ను స్థాపించమని మరియి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని కూడా. మరియు మీరంతా ఆయన (అల్లాహ్) సమక్షంలో జమ చేయబడతారు."
Verse 73
మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే! మరియు ఆ రోజు ఆయన: "అయిపో!" అని అనగానే, అది అయి పోతుంది. ఆయన మాటే సత్యం! మరియు బాకా (సూర్) ఊదబడే రోజు, సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసిన వాడు.
Verse 74
(జ్ఞాపకం చేసుకోండి!) ఇబ్రాహీమ్ తన తండ్రి ఆజర్ తో ఇలా అన్న విషయం: "ఏమీ? నీవు విగ్రహాలను ఆరాధ్యదైవాలుగా చేసుకుంటున్నావా? నిశ్చయంగా నేను నిన్ను మరియు నీ జాతి వారిని స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్న వారిగా చూస్తున్నాను!"
Verse 75
మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము.
Verse 76
ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: "ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: "అస్తమించే వాటిని నేను ప్రేమించను!" అని అన్నాడు.
Verse 77
ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు!" అని అన్నాడు. కాని అది అస్తమించగానే, ఒకవేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరి పోయేవాడను!"అని అన్నాడు.
Verse 78
ఆ తరువాత ఉదయించే సూర్యుణ్ణి చూసి: "ఇది నా ప్రభువు, ఇది అన్నిటికంటే పెద్దగా ఉంది!" అని అన్నాడు. కాని అది కూడా అస్తమించగానే: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వామ్యము) కల్పించే దానితో వాస్తవంగా నాకెలాంటి సంబంధం లేదు!" అని అన్నాడు.
Verse 79
(ఇంకా ఇలా అన్నాడు): " నిశ్చయంగా, నేను ఏక దైవసిద్ధాంతం (సత్యధర్మం) పాటించే వాడనై, నా ముఖాన్ని భుమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన (అల్లాహ్) వైపునకే త్రిప్పు కుంటున్నాను. మరియు నేను అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిన వాడను కాను."
Verse 80
మరియు అతని జాతివారు అతనితో వాదులాటకు దిగగా! అతను వారితో అన్నాడు: "ఏమీ? మీరు నాతో అల్లాహ్ విషయంలో వాదిస్తున్నారా? వాస్తవానికి ఆయనే నాకు సన్మార్గం చూపించాడు. మరియు మీరు ఆయనకు సాటి (భాగస్వాములుగా) కల్పించిన వాటికి నేను భయపడను. నా ప్రభువు ఇచ్ఛ లేనిది (ఏదీ సంభవించదు). నా ప్రభువు సకల వస్తువులను (తన) జ్ఞానంతో ఆవరించి వున్నాడు. ఏమీ? మీరిది గ్రహించలేరా?
Verse 81
"మరియు మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములు)గా కల్పించిన వాటికి నేనెందుకు భయపడాలి? వాస్తవానికి, ఆయన మీకు ఏ విధమైన ప్రమాణం ఇవ్వనిదే, మీరు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పించి కూడా భయపడటం లేదే? కావున ఈ రెండు పక్షాల వారిలో ఎవరు శాంతి పొందటానికి అర్హులో! మీకు తెలిస్తే చెప్పండి?"
Verse 82
ఎవరైతే విశ్వసించి, తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు.
Verse 83
మరియు ఇదే మా వాదన, దానిని మేము ఇబ్రాహీమ్ కు, తన జాతివారికి వ్యతిరేకంగా ఇచ్చాము. మేము కోరిన వారికి ఉన్నత స్తానాలకు ప్రసాదిస్తాము. నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు (జ్ఞాన సంపన్నుడు).
Verse 84
మరియు మేము అతనికి (ఇబ్రాహీమ్ కు) ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. ప్రతి ఒక్కరికీ సన్మార్గం చూపాము. అంతకు పూర్వం నూహ్ కు సన్మార్గం చూపాము. మరియు అతని సంతతిలోని వారైన దావూద్, సులైమాన్, అయ్యాబ్, యూసుఫ్, మూసా మరియు హారూన్ లకు మేము (సన్మార్గం చూపాము). మరియు ఈ విధంగా మేము సజ్జనులకు తగిన ప్రతిఫలమిస్తాము.
Verse 85
మరియు జకరియ్యా, యహ్యా, ఈసా మరియు ఇల్యాస్ లకు కూడా (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరూ సద్వర్తనులే!
Verse 86
మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వ లోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము.
Verse 87
మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము (సన్మార్గం చూపాము). మేము వారిని (మా సేవ కొరకు) ఎన్నుకొని, వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
Verse 88
ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి!
Verse 89
వీరే, మేము గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన వారు. కాని వారు దీనిని (ఈ గ్రంథాన్ని/ప్రవక్త పదవిని) తిరస్కరించి నందుకు! వాస్తవానికి మేము, దీనిని ఎన్నడూ తిరస్కరించని ఇతర ప్రజలను దీనికి కార్యకర్తలుగా నియమించాము.
Verse 90
ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వ లోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే."
మరియు వారు: "అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు." అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్ ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను: "అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడి పత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చుపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రితాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?" ఇంకా ఇలా అను:"అల్లాహ్ యే (దానిని అవతరింపజేశాడు)." ఆ పిదప వారిని, వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు!
Verse 92
మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది మరియు ఇది ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టు ప్రక్కలలో ఉన్నవారిని హెచ్చరించటానికి అవతరింపజేయ బడింది. మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమాజ్ లను క్రమబద్ధంగా పాటిస్తారు.
మరియు అల్లాహ్ పై అబద్ధపు నింద మోపే వాని కంటే, లేదా తనపై ఏ దివ్య జ్ఞానం (వహీ) అవతరించక పోయినప్పటికీ: "నాపై దివ్యజ్ఞానం అవతరింప జేయబడుతుంది." అని చేప్పేవాని కంటే, లేదా: "అల్లాహ్ అవతరింప జేసినటువంటి విషయాలను నేను కూడా అవతరింపజేయగలను." అని పలికే వాని కంటే, మించిన దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది!
Verse 94
మరియు వాస్తవంగా, మేము మొదటి సారి మిమ్మల్ని పుట్టించినట్లే, మీరిప్పుడు మా వద్దకు ఒంటరిగా వచ్చారు. మరియు మేము ఇచ్చినదంతా, మీరు మీ వీపుల వెనుక వదలి వచ్చారు. మరియు మీరు అల్లాహ్ కు సాటిగా (భాగస్వాములుగా) కల్పించిన మీ సిఫారసుదారులను, మేము మీతో పాటు చూడటం లేదే! వాస్తవంగా ఇప్పుడు మీ మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగి పోయాయి మరియు మీ భ్రమలన్నీ మిమ్మల్ని త్యజించాయి.
Verse 95
నిశ్చయంగా, ధాన్యమును మరియు ఖర్జూరపు బీజాన్ని చీల్చే (మొలకెత్త జేసే) వాడు అల్లాహ్ మాత్రమే. ఆయనే సజీవమైన దానిని, నిర్జీవమైన దాని నుండి తీస్తాడు. మరియు నిర్జీవమైన దానిని సజీవమైన దాని నుండి తీస్తాడు. ఆయనే, అల్లాహ్! అయితే మీరెందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?
Verse 96
ఆయనే (రాత్రి చీకటిని) చీల్చి ఉదయాన్ని తెచ్చేవాడు. మరియు రాత్రిని విశ్రాంతి కొరకు చేసినవాడు మరియు సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి (కాల) గణన కొరకు నియమించిన వాడు. ఇవన్నీ ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని, నియమకాలే!
Verse 97
మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము.
Verse 98
మరియు ఆయనే మిమ్మల్ని ఒకే వ్యక్తి (ప్రాణి) నుండి పుట్టించి, తరువాత నివాసం మరియు సేకరించబడే స్థలం నియమించాడు. వాస్తవంగా, అర్థం చేసుకునే వారికి ఈ విధంగా మేము మా సూచనలను వివరించాము.
మరియు ఆయనే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు తరువాత దాని ద్వారా మేము సర్వలోకాల వృక్షకోటిని ఉద్భవింపజేశాము. మరియు దాని నుండి మేము పచ్చని పైరును పండించాము. వాటిలో దట్టమైన గింజలను పుట్టించాము. మరియు ఖర్జూరపు చెట్ల గెలల నుండి క్రిందికి వ్రేలాడుతున్న పండ్ల గుత్తులను, ద్రాక్ష, జైతూన్ మరియు దానిమ్మ తోటలను (పుట్టించాము). వాటిలో కొన్ని ఒకదాని నొకటి పోలి ఉంటాయి, మరికొన్ని ఒకదాని నొకటి పోలి ఉండవు. ఫలించినప్పుడు వాటి ఫలాలను మరియు వాటి పరిపక్వాన్ని గమనించండి. నిశ్చయంగా, వీటిలో విశ్వసించే వారికి సూచనలున్నాయి.
Verse 100
మరియు వారు, ఆయన (అల్లాహ్) సృష్టించిన జిన్నాతులను, అల్లాహ్ కే సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తున్నారు. మూఢత్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు.
Verse 101
ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.
Verse 102
ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త.
Verse 103
ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.
Verse 104
వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. మరియు నేను మీ రక్షకుడను కాను."(అని అను).
Verse 105
మరియు వారు (అవిశ్వాసులు): "నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు." అని అనాలనీ మరియు తెలివి గలవారికి (సత్యాన్ని) స్పష్టపరచుటకూను, మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము.
Verse 106
నీవు నీ ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) అనుసరించు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ సాటి (భాగస్వాములను) కల్పించే వారి నుండి విముఖుడవగు.
Verse 107
మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు.
Verse 108
మరియు - అల్లాహ్ ను వదలి వారు ప్రార్థిస్తున్న ఇతరులను (వారి దైవాలను) - మీరు దూషించకండి. ఎందుకంటే, వారు ద్వేషంతో, అజ్ఞానంతో అల్లాహ్ ను దూషించ వచ్చు! ఈ విధంగా మేము ప్రతి జాతికి, వారి కర్మలు (ఆచారాలు) వారికి ఆకర్షణీయంగా కనబడేటట్లు చేశాము. తరువాత వారి ప్రభువు వైపునకు వారి మరలింపు ఉంటుంది; అప్పుడు వారికి వారి చేష్టలు తెలుపబడతాయి.
Verse 109
మరియు వారు: "ఒకవేళ మా వద్దకు అద్భుత సూచన (మహిమ) వస్తే, మేము తప్పక విశ్వసిస్తాము." అని అల్లాహ్ పేరుతో గట్టి ప్రమాణాలు చేస్తారు. వారితో అను: "నిశ్చయంగా, అద్భుత సూచనలు (మహిమలు) అల్లాహ్ వశంలోనే ఉన్నాయి. ఒకవేళ అవి (అద్భుత సూచనలు) వచ్చినా, వారు విశ్వసించరని (ఓ ముస్లిములారా!) మీకు ఏ విధంగా గ్రహింపజేయాలి?"
Verse 110
మరియు వారు మొదటిసారి దీనిని ఎలా విశ్వసించలేదో, అదే విధంగా వారి హృదయాలను మరియు వారి కన్నులను మేము త్రిప్పి వేస్తాము మరియు మేము వారిని వారి తలబిరుసుతనంలో అధులై తిరగటానికి వదలిపెడతాము.
Verse 111
మరియు ఒకవేళ మేము వారి వైపుకు దైవదూతలను దింపినా మరియు మరణించినవారు వారితో మాట్లాడినా మరియు మేము ప్రతి వస్తువును వారి కళ్ళముందు సమీకరించినా - అల్లాహ్ సంకల్పం లేనిదే - వారు విశ్వసించేవారు కారు. ఎందుకంటే, వాస్తవానికి వారిలో అనేకులు అజ్ఞానులు ఉన్నారు.
Verse 112
మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చు కోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు.
Verse 113
మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి (మోసం) వైపుకు మొగ్గాలని మరియు వారు దానితో సంతోష పడుతూ ఉండాలని మరియు వారు అర్జించేవి (దుష్టఫలితాలు) అర్జిస్తూ ఉండాలనీను.
Verse 114
(వారితో ఇలా అను): "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి వేరే న్యాయాధిపతిని అన్వేషించాలా? మరియు ఆయనే మీపై స్పష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు కదా?" మరియు నిశ్చయంగా, ఇది (ఈ గ్రంథం) నీ ప్రభువు తరఫు నుండి సత్యాధారంగా అవతరింపజేయబడిందని పూర్వం గ్రంథ మొసంగబడిన ప్రజలకు బాగా తెలుసు! కావున నీవు సందేహించే వారిలో చేరకు.
Verse 115
మరియు సత్యం రీత్యా మరియు న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు పూర్తి అయ్యింది. ఆయన వాక్కులను మార్చేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
Verse 116
మరియు భూమిలోని అధిక సంఖ్యాకులను నీవు అనుసరిస్తే వారు నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తారు. వారు కేవలం ఊహలనే అనుసరిస్తున్నారు మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు.
Verse 117
నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు ఆయన మార్గం నుండి వైదొలగి ఉన్నాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడనేది కూడా ఆయనకు బాగా తెలుసు.
Verse 118
కావున మీరు ఆయన సూచనలను (ఆయాత్ లను) విశ్వసించేవారే అయితే, అల్లాహ్ పేరు స్మరించబడిన దానినే తినండి.
Verse 119
మరియు మీకేమయింది? అల్లాహ్ పేరు స్మరించబడిన దానిని మీరెందుకు తినకూడదు? వాస్తవానికి - గత్యంతరం లేని సంకట పరిస్థితులలో తప్ప - ఏవేవి మీకు (తినటానికి) నిషేధింపబడ్డాయో, మీకు విశదీకరించబడింది కదా?మరియు నిశ్చయంగా, చాలా మంది అజ్ఞానంతో (ఇతరులను) తమ ఇష్టానుసారంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనకు హద్దులు మీరి ప్రవర్తించేవారి గురించి బాగా తెలుసు.
Verse 120
మరియు పాపాన్ని - బహిరంగంగా గానీ, రహస్యంగా గానీ - చేయటాన్ని మానుకోండి. నిశ్చయంగా, పాపం అర్జించిన వారు తాము చేసిన దుష్కృత్యాలకు తగిన ప్రతిఫలం పొందగలరు.
Verse 121
మరియు అల్లాహ్ పేరు స్మరించబడని దానిని తినకండి. మరియు అది (తినటం) నిశ్చయంగా పాపం. మరియు నిశ్చయంగా, మీతో వాదులాడటానికి షైతానులు తమ స్నేహితులను (అవులియాలను) ప్రేరేపింపజేస్తారు. ఒకవేళ మీరు వారిని అనుసరిస్తే! నిశ్చయంగా, మీరు కూడా అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించిన వారవుతారు.
Verse 122
మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని, వాటి నుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మరోహరమైనవిగా చేయబడ్డాయి.
Verse 123
మరియు ఇదే విధంగా మేము ప్రతి నగరంలో, దానిలోని నేరస్థులైన పెద్దవారిని, కుట్రలు పన్నేవారిగా చేశాము. మరియు వారు చేసే కుట్రలు కేవలం వారికే ప్రతికూలమైనవి, కాని వారది గ్రహించడం లేదు.
Verse 124
మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం) ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు. త్వరలోనే అపరాధులు అల్లాహ్ దగ్గర అవమానింపబడగలరు. మరియు వారి కుట్రల ఫలితంగా వారికి తీవ్రమైన శిక్ష విధించబడగలదు.
Verse 125
కావున అల్లాహ్ సన్మార్గం చూపదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు తెరుస్తాడు. మరియు ఎవరిని ఆయన మార్గభ్రష్టత్వంలో వదలగోరుతాడో అతని హృదయాన్ని (ఇస్లాం కొరకు) - ఆకాశం పైకి ఎక్కేవాని వలే - బిగుతుగా అణచివేయబడినట్లు చేస్తాడు. ఈ విధంగా, అల్లాహ్! విశ్వసించని వారిపై మాలిన్యాన్ని రుద్దుతాడు.
Verse 126
మరియు ఇది నీ ప్రభువు యొక్క ఋజుమార్గం. వాస్తవానికి యోచించేవారికి, మేము ఈ సూచనలను వివరించాము.
Verse 127
వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతినిలయం (స్వర్గం) ఉంటుంది. మరియు వారు (మంచి) కర్మలు చేస్తున్నందుకు ఆయన వారి సంరక్షకునిగా ఉంటాడు.
Verse 128
మరియు ఆయన వారందరినీ జమ చేసిన రోజు వారితో ఇలా అంటాడు: "ఓ జిన్నాతుల వంశీయులారా! వాస్తవంగా మీరు మానవులలో నుండి చాలా మందిని వలలో వేసుకున్నారు. అప్పుడు మానవులలోని వారి స్నేహితులు (అవులియా) అంటారు: "ఓ మా ప్రభూ! మేము పరస్పరం బాగా సుఖసంతోషాలు పొందాము. మరియు నీవు మా కొరకు నియమించిన గడువుకు మేమిప్పుడు చేరుకున్నాము." అప్పుడు అల్లాహ్ వారితో అంటాడు: "మీ నివాసం నరకాగ్నియే - అల్లాహ్ కోరితే తప్ప - మీరందు శాశ్వతంగా ఉంటారు! నిశ్చయంగా, నీ ప్రభువు మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు."
Verse 129
ఈ విధంగా మేము దుర్మార్గులను - వారు అర్జించిన దానికి ఫలితంగా - పరస్పరం స్నేహితులు (అవులియా) గా ఉంచుతాము.
Verse 130
"ఓ జిన్నాతుల మరియు మానవుల వంశీయులారా! ఏమీ? నా సూచనలను మీకు వినిపించి, మీరు (నన్ను) కలుసుకునే ఈ దినమును గురించి హెచ్చరించే ప్రవక్తలు మీలో నుంచే మీ వద్దకు రాలేదా?"(అని అల్లాహ్ వారిని అడుగుతాడు). దానికి వారు: "(వచ్చారని!) మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్షులం." అని జవాబిస్తారు. మరియు వారిని ఈ ప్రాపంచిక జీవితం మోసపుచ్చింది. మరియు వారు వాస్తవానికి సత్యతిరస్కారులుగా ఉండేవారిని స్వయంగా తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిస్తారు.
Verse 131
ఇదంతా ఎందుకంటే! నీ ప్రభువు నగరాలను - వాటిలోని ప్రజలు సత్యాన్ని ఎరుగకుండా ఉన్నప్పుడు - అన్యాయంగా నాశనంగా చేయడు.
Verse 132
మరియు ప్రతి ఒక్కరికీ వారి కర్మల ప్రకారం స్థానాలు ఉంటాయి. మరియు నీ ప్రభువు వారి కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.
Verse 133
మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు.
Verse 134
మీకు చేయబడిన వాగ్దానం తప్పక పూర్తయి తీరుతుంది. మీరు దాని (శిక్ష) నుండి తప్పించుకోలేరు.
Verse 135
ఇలా అను: "ఓ నా జాతి (విశ్వసించని) ప్రజలారా! మీరు (సరి అనుకున్నది) మీ శక్తి మేరకు చేయండి. మరియు నిశ్చయంగా (నేను సరి అనుకున్నది) నేనూ చేస్తాను. ఎవరి పరిణామం సఫలీకృతం కాగలదో! మీరు త్వరలోనే తెలుసుకుంటారు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందరు."
Verse 136
మరియు ఆయన (అల్లాహ్) పుట్టించిన పంటల నుండి మరియు పశువుల నుండి, వారు అల్లాహ్ కొరకు కొంత భాగాన్ని నియమించి: "ఇది అల్లాహ్ కొరకు మరియు ఇది మా దేవతల (అల్లాహ్ కు వారు సాటి కల్పించినవారి) కొరకు." అని తమ ఊహలో చెబుతారు. వారి దేవతలకు చెందిన భాగం అల్లాహ్ కు చేరదు. మరియు అల్లాహ్ కు చెందిన భాగం వారి దేవతలకు చేరుతుంది. ఎలాంటి చెడు నిర్ణయాలు చేస్తున్నారు వీరు!
Verse 137
మరియు ఇదే విధంగా చాలా మంది బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) తమ సంతాన హత్యను - వారు (అల్లాహ్ కు సాటి కల్పించిన) భాగస్వాములు - సరైనవిగా కనిపించేటట్లు చేశారు. ఇది వారిని నాశనానికి గురి చేయటానికి మరియు వారి ధర్మం వారికి సంశయాస్పదమైనదిగా చేయటానికి! అల్లాహ్ కోరితే వారు అలా చేసి ఉండేవారు కాదు. కావున నీవు వారిని వారి కల్పనలోనే వదలిపెట్టు.
Verse 138
మరియు వారు:"ఈ పశువులు మరియు ఈ పంటలు నిషిద్ధం చేయబడ్డాయి. మేము కోరినవారు తప్ప ఇతరులు వీటిని తినరాదు." అని అంటారు. కొన్ని జంతువుల వీపులపై బరువు వేయటాన్ని (స్వారీ చేయటాన్ని) నిషేధిస్తారు. మరికొన్ని జంతువులను (వధించేటప్పుడు) వాటి మీద అల్లాహ్ పేరు ఉచ్ఛరించరు. ఇవన్నీ వారు ఆయనపై కల్పించిన (అబద్ధాలు) మాత్రమే. ఆయన త్వరలోనే వారికి, వారి (అసత్య) కల్పనలకు తగిన ప్రతిఫలం ఇవ్వగలడు.
Verse 139
ఇంకా వారు ఇలా అంటారు: "ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషులకే ప్రత్యేకించబడింది. మరియు ఇది మా స్త్రీలకు నిషేధించబడింది. కాని ఒకవేళ అది మరణించినది అయితే, వారు (స్త్రీలు) దానిలో భాగస్థులు." ఆయన వారి ఈ ఆరోపణలకు త్వరలోనే వారికి ప్రతీకారం చేస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేచనాపరుడు, సర్వజ్ఞుడు.
Verse 140
మూఢత్వం మరియు అజ్ఞానం వల్ల తమ సంతానాన్ని హత్య చేసే వారునూ మరియు అల్లాహ్ పై అసత్యాలు కల్పిస్తూ, తమకు అల్లాహ్ ఇచ్చిన జీవనోపాధిని నిషేధించుకున్న వారునూ, వాస్తవంగా నష్టానికి గురి అయిన వారే! నిశ్చయంగా వారు మార్గం తప్పారు. వారెన్నటికీ మార్గదర్శకత్వం పొందేవారు కారు.
Verse 141
మరియు ఆయనే పందిళ్ళ మీద ప్రాకే (ఎక్కించబడే) తీగలు మరియు పందిళ్ళ మీద ప్రాకని (ఎక్కించబడని) చెట్ల తోటలు మరియు ఖర్జూరపు చెట్లు మరియు వివిధ రకాల రుచి గల పంటలు మరియు జైతూన్ (ఆలివ్), దానిమ్మ చెట్లను పుట్టించాడు. అవి కొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మరికొన్ని విషయాలలో ఒకదానితో ఒకటి పోలి ఉండవు. వాటికి ఫలాలు వచ్చినపుడు వాటి ఫలాలను తినండి. కానీ వాటి కోత దినమున (ఫలకాలంలో) వాటి హక్కు (జకాత్) చెల్లించండి. మరియు వృథాగా ఖర్చు చేయకండి. నిశ్చయంగా, ఆయన వృథా ఖర్చు చేసే వారంటే ఇష్టపడడు.
Verse 142
మరియు పశువులలో కొన్ని బరువు మోయటానికి, మరికొన్ని చిన్నవి (భారం మోయలేనివి) ఉన్నాయి. అల్లాహ్ మీకు జీవనోపాధికి ఇచ్చిన వాటిని తినండి. మరియు షైతన్ అడుగుజాడలలో నడవకండి. నిశ్చయంగా, వాడు మీకు బహిరంగ శత్రువు!
Verse 143
(పెంటి-పోతు కలిసి) ఎనిమిది రకాలు (జతలు). అందులో గొర్రెలలో నుండి రెండు (పెంటి - పోతు) మరియు మేకలలో నుండి రెండు (పెంటి - పోతు). వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా ? లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండు ఆడవాటి గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే, నాకు సరైన జ్ఞానంతో తెలుపండి."
Verse 144
"మరియు ఒంటెలలో రెండు (పెంటి - పోతు) మరియు ఆవులలో రెండు (పెంటి - పోతు)." వారిని అడుగు: "ఏమీ? ఆయన నిషేధించింది, రెండు మగవాటినా లేక రెండు ఆడవాటినా? లేక ఆ రెండింటి గర్భాలలో ఉన్నవాటినా? అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించినపుడు, మీరు సాక్షులుగా ఉంటిరా? లేకపోతే! జ్ఞానం లేకుండా ప్రజలను పెడమార్గం పట్టించటానికి అల్లాహ్ పేరుతో అబద్ధాన్ని కల్పించే వ్యక్తి కంటే మించిన దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు."
Verse 145
(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: "నాపై అవతరింబజేయబడిన దివ్యజ్ఞానంలో (వహీలో) :ఆహారపదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం - ఎందుకంటే అది అపరిశుద్ధమైది (రిజ్స్); లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి - ఆయన పేరుతో గాక - ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా, క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 146
"మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము!"
Verse 147
( ఓ ముహమ్మద్!) ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే!" నీవు వారితో ఇలా అను: "మీ ప్రభువు కారుణ్య పరిధి సువిశాలమైనది. కాని ఆయన శిక్ష పాపిష్ఠి ప్రజలపై పడకుండా నివారించబడదు."
Verse 148
అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించేవారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరితే మేము గానీ, మా తండ్రితాతలు గానీ ఆయనకు సాటి కప్పించే వారమూ కాము మరియు దేనినీ నిషేధించి ఉండేవారమూ కాము." వారికి పూర్వం వారు కూడా మా శిక్షను రుచి చూడనంత వరకు ఇదే విధంగా తిరస్కరించారు. వారిని అడుగు: "మీ వద్ద ఏదైనా (రూఢి అయిన) జ్ఞానం ఉందా! ఉంటే మా ముందు పెట్టండి. మీరు కేవలం కల్పనలను అనుసరిస్తున్నారు మరియు మీరు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు."
Verse 149
ఇలా అను: "రూఢి అయిన ప్రమాణం అల్లాహ్ వద్దనే ఉంది. ఆయన గనక తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు."
Verse 150
(ఇంకా) ఇలా అను: " 'నిశ్చయంగా, అల్లాహ్ ఈ వస్తువులను నిషేధించాడు.' అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకొని రండి." ఒకవేళ వారు అలా సాక్ష్యమిస్తే, నీవు వారితో కలిసి సాక్ష్యమివ్వకు. మరియు మా సూచనలను అసత్యాలని తిరస్కరించే వారి మరియు పరలోకము నందు విశ్వాసం లేని వారి మరియు ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టే వారి మనోవాంఛలను నీవు ఏ మాత్రం అనుసరించకు!
ఇలా అను: "రండి మీ ప్రభువు మీకు నిషేధించి వున్న వాటిని మీకు వినిపిస్తాను: 'మీరు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.
Verse 152
" 'మరియు అనాథుడు తన యుక్త వయస్సుకు చేరనంత వరకు అతని ఆస్తిని, బాగుపరచటానికి తప్ప ఇతర ఉద్దేశ్యంతో సమీపించకండి. కొలవటంలో మరియు తూచటంలో న్యాయాన్ని పాటించండి. ఏ ప్రాణిపై గడూ మేము దాని శక్తికి మించిన భారాన్ని మోపము. పలికితే న్యాయమే పలకండి. అది మీ దగ్గరి బంధువుకు (ప్రతికూలమైనది) అయినా సరే! అల్లాహ్ తో చేసిన ఒడంబడికను పూర్తి చేయండి. మీరు హితోపదేశం స్వీకరించాలని ఆయన మీకు ఈ విషయాలను ఆజ్ఞాపిస్తున్నాడు.
Verse 153
" 'మరియు నిశ్చయంగా, ఇదే ఋజుమార్గం, కావున మీరు దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని ఆయన మార్గం నుండి తప్పిస్తాయి. మీరు భయభక్తులు కలిగి ఉండాలని ఆయన మిమ్మల్ని ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు.'"
Verse 154
తరువాత మేము మూసాకు - సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శకత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమ ప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి - గ్రంథాన్ని ప్రసాదించాము.
Verse 155
మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు!
Verse 156
లేకుంటే మీరు (అరబ్బులు): "వాస్తవానికి మాకు పూర్వం ఉన్న రెండు వర్గాల వారికి (యూదులకు మరియు క్రైస్తవులకు) గ్రంథం అవతరింప జేయబడింది, కాని వారు చదివేదేమిటో మేము ఎరుగము." అని అంటారని!
Verse 157
లేదా మీరు: "ఒకవేళ నిశ్చయంగా, మాపై గ్రంథం అవతరింప జేయబడి ఉండే మేమూ వారి కంటే ఉత్తమరీతిలో సన్మార్గం మీద నడిచి ఉండేవారము." అని అంటారని. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ఈ ఖుర్ఆన్) వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికే వాడికంటే, వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించే వాడి కంటే, మించిన దుర్మార్గుడెవడు? కాబట్టి మా సూచనల పట్ల విముఖత చూపేవారికి, వారి ఈ వైముఖ్యానికి ఫలితంగా భయంకరమైన శిక్ష విధిస్తాము.
Verse 158
ఏమీ? వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గానీ, లేక నీ ప్రభువు రావాలని గానీ, లేదా నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు రావాలని గానీ ఎదురు చూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని (బహిరంగ) నిదర్శనాలు వచ్చే రోజున, పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికీ, లేదా విశ్వసించి కూడా ఏ మంచినీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు. వారితో ఇలా అను: "మీరు నిరీక్షించండి. నిశ్చయంగా, మేము కూడా నిరీక్షిస్తాము."
Verse 159
నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ వున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు.
Verse 160
ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో, అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది. మరియు ఎవడు ఒక పాపకార్యం చేస్తాడో, అతనికి దానంతటి శిక్షయే ఉంటుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు.
Verse 161
వారితో ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువు నాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాడు. అదే సరైన ధర్మం. ఏకదైవ సిద్ధాంతమైన ఇబ్రాహీమ్ ధర్మం. అతను అల్లాహ్ కు సాటి కల్పించే వారిలో చేరినవాడు కాడు!"
Verse 162
(ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే!
Verse 163
"ఆయనకు ఎలాంటి భాగస్వామి (సాటి) లేడు. మరియు నేను ఇదే విధంగా ఆదేశించబడ్డాను మరియు నేను అల్లాహ్ కు విధేయుడను (ముస్లింను) అయిన వారిలో మొట్టమొదటి వాడను!"
Verse 164
ఇలా అను: "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి ఇతరులను ప్రభువులుగా అర్థించాలా? ఆయనే ప్రతి దానికీ ప్రభువు! ప్రతి వ్యక్తీ తాను సంపాదించిందే అనుభవిస్తాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలి పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ విషయాలను గురించి భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారో, వాటిని మీకు తెలియజేస్తాడు."
Verse 165
మరియు ఆయనే మిమ్మల్ని భూమి మీద ఉత్తరాధికారులుగా నియమించి - మీకిచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించటానికి - మీలో కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష విధించటంలో అతి శీఘ్రుడు, మరియు నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
تقدم القراءة