ﮎ
surah.translation
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
ﭑ
ﰀ
అలిఫ్-లామ్-మీమ్
ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము.
(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో, నమాజ్ను స్థాపిస్తారో మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో;
మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీపై అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటినీ (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో!
అలాంటి వారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు
నిశ్చయంగా, సత్యతిరస్కారులను (ఓ ముహమ్మద్!) నీవు హెచ్చరించినా, హెచ్చరించక పోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు.
అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు. మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంది.
మరియు ప్రజలలో కొందరు: "మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము." అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు
వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుంటున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!
వారి హృదయాలలో రోగముంది. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.
మరియు: "భువిలో కల్లోలం రేకెత్తించకండి." అని వారితో అన్నప్పుడు; వారు: "మేము సంస్కర్తలము మాత్రమే!" అని అంటారు
జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.
మరియు: "ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి." అని, వారితో అన్నప్పుడు, వారు: "మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?" అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.
మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: "మేము విశ్వసించాము." అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్ట నాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము." అని అంటారు.
అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, (అందులో వారు) అంధులై తిరుగుతున్నారు;
ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్న వారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు.
వారి ఉపమానం ఇలా ఉంది: ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు.
(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు.
లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని, మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు.
ఆ మెరుపు వారి దృష్టిని ఇంచు మించు ఎగురవేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ము కొనగానే వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించే వాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!
ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.
మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).
కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.
మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కొరకు నిశ్చయంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు, ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: "ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవే!" అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలిక గలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు.
నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దాని కంటే చిన్నదాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్యతిరస్కారులు, వాటిని విని: "ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటి?" అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపుతాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు.
ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటి వారే, వాస్తవంగా నష్టపడేవారు.
మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీనులుగా ఉన్న మిమ్మల్ని సజీలుగా చేశాడు కదా! తరువాత మీ ప్రాణాన్ని తీసి, తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు.
ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు.
మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు.
మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు.
వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు.
ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!"
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు.
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు!"
ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది."
తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
ఓ ఇస్రాయీల్ సంతతివారలారా! నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!
మరియు మీ వద్దనున్న వాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించే వారిలో మీరు మొట్టమొదటి వారు కాకండి. మరియు అల్పలాభాలకు నా సూచన(ఆయత్) లను అమ్మకండి. కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి.
మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి.
మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే (రుకూఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూఉ చేయండి).
ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని, స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచి పోతున్నారెందుకు? మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?
మరియు సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది.
అలాంటి వారు తాము తమ ప్రభువును నిశ్చయంగా, కలుసు కోవలసి ఉందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు.
ఓ ఇస్రాయీల్ సంతతివారలారా! నేను మీకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని (మీ కాలంలో) సర్వలోకాల వారి కంటే అధికంగా ఆదరించాను!
మరియు ఆ (తీర్పు) దినమునకు భయపడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.
మరియు ఫిరఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోరహింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచి పెట్టేవారు మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను.
మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి).
ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచినపుడు) మీరు అతను లేకపోవడం చూసి ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. మరియు మీరు దుర్మార్గులయ్యారు.
అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని మన్నించాము.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరే చేసే) గీటురాయిని ప్రసాదించాము.
మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారితో ఇలా అన్న విషయాన్ని: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్టికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోరపాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు - మీ సృష్టికర్త దృష్టిలో - శ్రేష్ఠమైనది." ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత.
మరియు అప్పుడు మీరు అతనితో (మూసాతో) అన్న మాటలు (జ్ఞప్తికి తెచ్చుకోండి): "ఓ మూసా! మేము అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూడనంత వరకు నిన్ను ఏ మాత్రం విశ్వసించము!" అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన పిడుగు మీపై విరుచుకు పడింది (మీరు చనిపోయారు).
ఆ పిమ్మట, మీరు కృతజ్ఞులై ఉంటారేమోనని - మీరు చచ్చిన తరువాత మిమ్మల్ని తిరిగి బ్రతికించాము.
మరియు మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము మరియు మన్ మరియు సల్వాలను మీ కొరకు ఆహారంగా దించాము. "మేము మీకు ప్రసాదించిన శుద్ధమయిన వస్తువులను తినండి." అని అన్నాము. (కాని వారు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు), అయినా వారు మాకు అపకారమేమీ చేయలేదు, పైగా వారు తమకు తామే అపకారం చేసుకున్నారు.
మరియు మేము మీతో :"ఈ నగరం (జేరుసలం)లో ప్రవేశించండి మరియు అక్కడున్న వస్తువులను మీ ఇష్టానుసారంగా కావలసినంత తినండి మరియు నగర ద్వారంలోకి వినమ్రులై తలవంచుతూ: 'మమ్మల్ని క్షమించు (హిత్తతున్),' అంటూ ప్రవేశించండి; మేము మీ పాపాలను క్షమిస్తాము. మరియు మేము సజ్జనులను అత్యధికంగా కరుణిస్తాము." అని చెప్పిన మాటలను (జ్ఞప్తికి తెచ్చుకోండి)!
కాని దుర్మార్గులైన వారు, వారికి చెప్పిన మాటను మరొక మాటతో మార్చారు. కనుక, మేము దుర్మార్గం చేసిన వారిపై, వారి దౌష్ట్యాలకు ఫలితంగా, ఆకాశం నుండి ఆపదను దింపాము.
మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన ప్రజలకు నీటి కొరకు ప్రార్థించి నప్పుడు, మేము: "నీవు ఆ బండను నీ కర్రతో కొట్టు!" అని ఆదేశించాము. అప్పుడు దాని నుండి పన్నెండు ఊటలు ప్రవహించసాగాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారితో అన్నాము): "అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారాన్ని తినండి త్రాగండి కానీ, భూమిలో కల్లోలం రేపుతూ దౌర్జన్యపరులుగా తిరగకండి!"
మరియు అప్పుడు మీరు: "ఓ మూసా!మేము ఒకే రకమైన ఆహారం తింటూ ఉండలేము. కావున భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకు కూరలు, దోసకాయలు (కూరగాయలు), వెల్లుల్లి (గోధుమలు), ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండించమని నీ ప్రభువును ప్రార్థించు." అని అన్నారు. దానికతను: "ఏమీ? శ్రేష్ఠమైన దానికి బదులుగా అల్పమైన దానిని కోరుకుంటున్నారా? (అలాగయితే) మీరు ఏదైనా నగరానికి తిరిగిపొండి. నిశ్చయంగా, అక్కడ మీకు, మీరు కోరేదంతా దొరుకుతుంది!" అని అన్నాడు. మరియు వారు, తీవ్ర అవమానం మరియు దారిద్ర్యానికి గురయ్యారు. మరియు వారు అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యారు. అదంతా వాస్తవానికి వారు అల్లాహ్ సూచన (ఆయతు) లను తిరస్కరించిన దాని మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపిన దాని ఫలితం. ఇదంతా వారు చేసిన ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.
నిశ్చయంగా, విశ్వసించిన వారు (ముస్లింలు) కానీ, (ఇస్లాంకు పూర్వపు) యూదులు కానీ, క్రైస్తవులు కానీ, సాబీయూలు కానీ (ఎవరైనా సరే) ! అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి, వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంటుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
మరియు (ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా!) మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి, మీ చేత చేయించిన గట్టి వాగ్దానాన్ని (జ్ఞప్తికి తెచ్చుకోండి)! అప్పుడు మేము: "మీకు ప్రసాదిస్తున్న దానిని (గ్రంథాన్ని) దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్నదంతా జ్ఞాపకం ఉంచుకోండి, బహుశా మీరు భయభక్తులు గలవారు కావచ్చు!" అని అన్నాము.
ఆ పిదప కూడా మీరు వెనుదిరిగి పోయారు. అయినప్పటికీ అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ మీపై లేకుంటే, మీరు నష్టానికి గురైనవారిలో చేరేవారు.
మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు. మేము వారిని: "నీచులైన కోతులు కండి!" అన్ని అన్నాము.
ఈ విధంగా మేము దానిని (వారి ముగింపును) ఆ కాలం వారికీ మరియు భావితరాల వారికీ ఒక గుణపాఠంగానూ, దైవభీతి గలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన జాతి వారితో: "అల్లాహ్ మిమ్మల్ని: 'ఒక ఆవును బలి ఇవ్వండి!' అని ఆజ్ఞాపిస్తున్నాడు." అని అన్నప్పుడు వారు: "ఏమీ? నీవు మాతోపరహాసమాడుతున్నావా?" అని పలికారు. (అప్పుడు మూసా) అన్నాడు: "నేను అవివేకులతో కలిసి పోకుండా ఉండాలని, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను."
వారు: "అది ఎలాంటిదై ఉండాలో మాకు స్పష్టంగా తెలుపమని నీ ప్రభువును ప్రార్థించు!" అని అన్నారు. (మూసా) అన్నాడు: "'నిశ్చయంగా, ఆ ఆవు ముసలిది గానీ లేగదూడ గానీ కాకుండా, మధ్య వయస్సు గలదై ఉండాలి.' అని ఆయనంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చేయండి."
వారు: "దాని రంగు ఎలా ఉండాలో మాకు తెలుపమని నీ ప్రభువును వేడుకో!" అని అన్నారు. (దానికి అతను) అన్నాడు: " 'అది మెరిసే పసుపు వన్నె కలిగి, చూసే వారికి మనోహరంగా కనిపించాలి.' అని ఆయన ఆజ్ఞ!"
వారు ఇలా అన్నారు: "అసలు ఏ విధమైన ఆవు కావాలో నీవు నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు; దానిని నిర్ణయించడంలో మాకు సందేహం కలిగింది మరియు నిశ్చయంగా, అల్లాహ్ కోరితే మేము తప్పక అలాంటి ఆవును కనుగొంటాము (మార్గదర్శకత్వం పొందుతాము)."
అతను (మూసా) అన్నాడు: "ఆయన (అల్లాహ్) అంటున్నాడు: 'ఆ గోవు భూమిని దున్నటానికి గానీ, పొలాలకు నీళ్ళు తోడటానికి గానీ ఉపయోగించబడకుండా, ఆరోగ్యంగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి.' అని!" అప్పుడు వారన్నారు: "ఇప్పుడు నీవు సత్యం తెచ్చావు." తరువాత వారు దానిని బలి (జిబ్హ్) చేశారు, లేకపోతే వారు అలా చేసేవారని అనిపించలేదు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి), మీరు ఒక వ్యక్తిని చంపి ఆ నిందను ఒకరిపై నొకరు మోపుకోసాగారు. కాని మీరు దాస్తున్న దానిని అల్లాహ్ బయట పెట్టాడు.
కనుక మేము: "దానిని (ఆ శవాన్ని), ఆ ఆవు (మాంసపు) ఒక ముక్కతో కొట్టండి, (అతడు సజీవుడవుతాడు)." అని ఆజ్ఞాపించాము. ఈ విధంగా అల్లాహ్ మృతులను బ్రతికించి, తన సూచనలను మీకు చూపుతున్నాడు, బహుశా మీరు అర్థం చేసుకుంటారేమోనని!
కానీ దీని తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి, అవి రాళ్ళ మాదిరిగా! కాదు, వాటి కంటే కూడా కఠినంగా అయిపోయాయి. ఎందుకంటే వాస్తవానికి రాళ్ళలో కొన్ని బ్రద్దలైనప్పుడు వాటి నుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. మరియు నిశ్చయంగా, వాటిలో కొన్ని చీలిపోయి వాటి నుండి నీళ్ళు బయటికి వస్తాయి. మరియు వాస్తవానికి వాటిలో మరికొన్ని అల్లాహ్ భయం వల్ల పడిపోతాయి. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.
(ఓ విశ్వాసులారా!) వారు (యూదులు) మీ సందేశాన్ని విశ్వసిస్తారని ఆశిస్తున్నారా ఏమిటి ? మరియు వాస్తవానికి వారిలో ఒక వర్గం వారు (ధర్మవేత్తలు) అల్లాహ్ ప్రవచనం (తౌరాత్) విని, అర్థం చేసుకొని కూడా, బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసేవారు కదా?
మరియు వారు (యూదులు) విశ్వాసులను కలిసినప్పుడు: "మేము విశ్వసించాము!" అని అంటారు. కాని వారు ఏకాంతంలో (తమ తెగవారితో) ఒకరినొకరు కలుసుకున్నప్పుడు: "ఏమీ? అల్లాహ్ మీకు తెలిపింది వారికి (ముస్లింలకు) తెలుపుతారా! దానితో వారు (ముస్లింలు) మీ ప్రభువు ముందు మీతో వాదులాడటానికి! మీరిది అర్థం చేసుకోలేరా ఏమిటి?" అని అంటారు.
ఏమీ? వారికి తెలియదా? వారు (యూదులు) దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా అల్లాహ్ కు బాగా తెలుసని?
మరియు వారిలో (యూదులలో) కొందరు నిరక్షరాస్యులున్నారు, వారికి గ్రంథ జ్ఞానం లేదు, వారు కేవలం మూఢవిశ్వాసాలను (నమ్ముతూ), ఊహలపై మాత్రమే ఆధారపడి ఉన్నారు.
కావున ఎవరైతే తమ చేతులారా ఒక పుస్తకాన్ని వ్రాసి - దాని వల్ల తుచ్ఛమూల్యం పొందే నిమిత్తం - "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని (ప్రజలకు) చెబుతారో, వారికి వినాశముంది. వారి చేతులు వ్రాసినందుకు వారికి వినాశముంది మరియు వారు సంపాదించిన దానికి కూడా వారికి వినాశముంది!
మరియు వారు (యూదులు) అంటారు: "మాకు నరకాగ్ని శిక్ష పడినా, అది కొన్ని రోజుల కొరకు మాత్రమే!" (ఓ ముహమ్మద్!) నీవు వారి నడుగు: "ఏమీ? మీరు అల్లాహ్ నుండి వాగ్దానం పొందారా? ఎందుకంటే, అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగం చేయడు. లేదా మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ కు అంటగడుతున్నారా?"
వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి నుండి ఇలా తీసుకున్న వాగ్దానం (జ్ఞప్తికి తెచ్చుకోండి): "మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకూడదు. మరియు తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, యాచించని పేదవారిని ఆదరించాలి. మరియు ప్రజలను సహృదయంతో పలకరించాలి, నమాజ్ ను స్థాపించాలి మరియు జకాత్ ఇవ్వాని." అటు పిమ్మట మీలో కొందరు తప్ప, మిగతా వారంతా (తమ వాగ్దానం నుండి) తిరిగి పోయారు. మీరంతా విముఖులైపోయే వారే!
మరియు మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని (జ్ఞాపకం చేసుకోండి); మీరు మీ (తోటివారి) రక్తాన్ని చిందిచగూడదని మరియు మీ వారిని, వారి ఇండ్ల నుండి పారద్రోల గూడదని! అప్పుడు మీరు దానికి ఒప్పుకున్నారు. మరియు దానికి స్వయంగా మీరే సాక్షులు.
ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు.
ఇలాంటి వారే పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని కొనేవారు! కావున వీరికి పడే శిక్ష తగ్గించబడదు మరియు వీరికి ఎలాంటి సహాయమూ లభించదు.
మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము. ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు.
మరియు వారు: "మా హృదయాలు మూయబడి ఉన్నాయి."అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్యతిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ.
మరియు ఇప్పుడు వారి వద్ద నున్న దానిని (తౌరాత్ ను) ధృవీకరించే గ్రంథం (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చింది. మరియు దీనికి ముందు వారు సత్యతిరస్కారులపై విజయం కొరకు ప్రార్థించే వారు. ఇప్పుడు సత్యమని గుర్తించబడినది (ఈ గ్రంథం) వచ్చినా, వారు దానిని తిరస్కరించారు. కాబట్టి, సత్యతిరస్కారులపై అల్లాహ్ అభిశాపం (బహిష్కారం) అవతరిస్తుంది.
అల్లాహ్ అవతరింపజేసిన సందేశాన్ని (ఖుర్ఆన్ ను) తిరస్కరించి, వారు ఎంత నీచమైన మూల్యానికి తమను తాము అమ్ముకున్నారు! అది (వారి తిరస్కారం) అల్లాహ్! తన దాసులలో, తాను కోరిన వారిపై, తన అనుగ్రహం (ఖుర్ఆన్ /ప్రవక్తృత్వం) అవతరింపజేశాడనే కక్ష వల్లనే! కనుక వారు (అల్లాహ్) క్రోధం మీద మరింత క్రోధానికి గురయ్యారు. మరియు ఇలాంటి సత్యతిరస్కారులకు అవమానకరమైన శిక్ష ఉంది.
మరియు వారితో (యూదులతో): "అల్లాహ్ అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి." అని అన్నప్పుడు, వారు: "మా (ఇస్రాయీల్) వారిపై అవతరింపజేయబడిన దానిని (తౌరాత్ ను) మాత్రమే మేము విశ్వసిస్తాము." అని అంటారు. మరియు దాని తరువాత వచ్చినది (ఈ ఖుర్ఆన్) సత్యమైనప్పటికీ మరియు వారి వద్దనున్న దానిని (తౌరాత్ ను) ధృవపరుస్తున్నప్పటికీ, దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. (ఓ ముహమ్మద్) వారిని అడుగు: "మీరు (మీ వద్దనున్న గ్రంథాన్ని) విశ్వసించే వారే అయితే ఇంతకు పూర్వం వచ్చిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్యచేస్తూ వచ్చారు?"
మరియు వాస్తవానికి మూసా స్పష్టమైన సూచనలను తీసుకొని మీ వద్దకు వచ్చాడు, తరువాత అతను పోగానే, మీరు ఆవుదూడ (విగ్రహాన్ని) ఆరాధ్యదైవంగా చేసుకున్నారు మరియు మీరు ఎంత దుర్మార్గులు!
మరియు మేము 'తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ నుంచి తీసుకున్న ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "మేము మీకు చేస్తున్న వాటిని (ఉపదేశాలను) స్థిరంగా పాటించండి మరియు జాగ్రత్తగా వినండి." అని చెప్పాము. వారు: "మేము విన్నాము కానీ అతిక్రమిస్తున్నాము." అని అన్నారు, వారి సత్యతిరస్కారం వలన వారి హృదయాలలో ఆవుదూడ ప్రేమ నిండి పోయింది. వారితో అను: "మీరు విశ్వాసులే అయితే! ఈ చెడు చేష్టలను చేయమని మిమ్మల్ని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా చెడ్డది."
వారితో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ వద్దనున్న పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం, మీకు మాత్రమే ప్రత్యేకించబడి ఉంటే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే, మీరు మరణాన్ని కోరండి!"
కాని వారు ఎన్నటికీ దానిని (మరణాన్ని) కోరరు. ఎందుకంటే, వారు తమ చేతులారా చేసి పంపినవి (తమ కర్మలు) వారికి బాగా తెలుసు. ఈ దుర్మార్గుల విషయం అల్లాహ్ కు బాగా తెలుసు.
మరియు నిశ్చయంగా, జీవితం పట్ల సర్వజనుల కంటే ఎక్కువ వ్యామోహం వారి (యూదుల)లోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రికులను కూడా మించి పోయారు. వారిలో ప్రతి ఒక్కడూ వేయి సంవత్సరాలు బ్రతకాలని కోరుతుంటాడు. కానీ దీర్ఘాయుర్ధాయం వారిని శిక్ష నుండి తప్పించలేదు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "జిబ్రీల్ పట్ల విరోధమున్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖుర్ఆన్ ను నీ హృదయంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని దివ్యగ్రంథాలను ఇది ధృవీకరిస్తున్నది మరియు విశ్వసించే వారికి ఇది సన్మారం చూపుతున్నది మరియు శుభవార్తను ఇస్తున్నది.
"అల్లాహ్ కు ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీల్ కు మరియు మీకాయీల్ కు ఎవరు శత్రువులో, నిశ్చయంగా అలాంటి సత్యతిరస్కారులకు అల్లాహ్ శత్రువు."
మరియు వాస్తవంగా, మేము నీపై స్పష్టమైన సూచనలు (ఆయత్) అవతరింపజేశాము. మరియు అవిదేయులుతప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు.
ఏమీ? వారు ఒడంబడిక చేసినపుడల్లా, వారిలో ఒక వర్గం వారు దానిని త్రోసి పుచ్చుటం జరగలేదా? వాస్తవానికి వారిలో చాలా మంది విశ్వసించని వారున్నారు.
మరియు వారి దగ్గర పూర్వం నుంచే ఉన్న దానిని (దివ్యగ్రంథాన్ని) ధృవపరుస్తూ ఒక ప్రవక్త (ముహమ్మద్) అల్లాహ్ తరఫు నుండి వారి వద్దకు వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా, అల్లాహ్ గ్రంథాన్ని తమ వీపుల వెనుకకు త్రోసి వేశారు.
మరియు వారు సులైమాన్ రాజ్య కాలమున, షైతానులు పఠించే దానిని (జాల విద్యను) అనుసరించారు. సులైమాన్ సత్యతిరస్కారి కాలేదు; కానీ నిశ్చయంగా, షైతానులు సత్యాన్ని తిరస్కరించారు. వారు బాబీలోన్ నగరమందు, హారూత్ మారూత్, అనే ఇద్దరు దేవదూతల ద్వారా తేబడిన జాలవిద్యను ప్రజలకు నేర్పుచుండిరి. ఎవరికైనా ఆ విద్యను నేర్పేటప్పుడు, వారిద్దరు (దేవదూతలు) ఇలా చెప్పే వారు: "నిశ్చయంగా మేము (మానవులకు) ఒక పరీక్ష! కాబట్టి మీరు (ఈ జాలవిద్యను నేర్చుకొని) సత్యతిరస్కారులు కాకండి." అయినప్పటికీ వారు (ప్రజలు), భార్యా-భర్తలకు ఎడబాటు కలిగించేది (జాలవిద్య) వారిద్దరి దగ్గర నేర్చుకునేవారు. మరియు అల్లాహ్ అనుమతి లేనిదే, దాని ద్వారా ఎవరికీ ఏ మాత్రం హాని కలిగించలేరు. మరియు వారు నేర్చుకునేది, వారికి నష్టం కలిగించేదే, కాని లాభం కలిగించేది ఎంత మాత్రం కాదు. మరియు వాస్తవానికి దానిని (జాలవిద్యను) స్వీకరించే వానికి పరలోక సౌఖ్యాలలో ఏ మాత్రమూ భాగం లేదని వారికి బాగా తెలుసు. మరియు వారు ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా తమను తాము అమ్ముకున్నారు! ఇది వారికి తెలిస్తే ఎంత బాగుండేది!
మరియు వారు విశ్వసించి, దైవభీతి కలిగి ఉండినట్లయితే! నిశ్చయంగా, అల్లాహ్ తరఫు నుండి వారికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభించి ఉండేది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది!
ఓ విశ్వాసులారా, (మీరు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు) రా'ఇనా! అని అనకండి. ఉన్"జుర్నా! అని (గౌరవంతో) అనండి మరియు (అతని మాటలను) శ్రద్ధతో వినండి. మరియు సత్యతిరస్కారులకు బాధాకరమైన శిక్ష గలదు.
సత్యతిరస్కారులైన గ్రంథప్రజలకు గానీ మరియు బహుదైవారాధకులకు (ముష్రికులకు) గానీ, మీ ప్రభువు నుండి మీకు ఏదైనా మేలు అవతరించడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ అల్లాహ్ తాను కోరిన వారినే తన కరుణకు ప్రత్యేకించు కుంటాడు. మరియు అల్లాహ్ అనుగ్రహించటంలో సర్వోత్తముడు.
మేము మా ప్రవచనాలలో (ఆయాత్ లలో) ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దాని కంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నీకు తెలియదా?
ఏమీ? వాస్తవానికి, భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందుతుందని, నీకు తెలియదా? మరియు అల్లాహ్ తప్ప మిమ్మల్ని రక్షించేవాడు గానీ, సహాయం చేసేవాడు గానీ మరెవ్వడూ లేడు!
ఏమీ? పూర్వం (యూదులచే) మూసా ప్రశ్నించబడినట్లు, మీరు కూడా మీ ప్రవక్త (ముహమ్మద్) ను ప్రశ్నించగోరు తున్నారా? మరియు ఎవడైతే, సత్యతిరస్కారాన్ని, విశ్వాసానికి బదులుగా స్వీకరిస్తాడో! నిశ్చయంగా, వాడే సరైన మార్గం నుండి తప్పిపోయిన వాడు.
గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నంచండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
మరియు నమాజ్ స్థాపించండి. విధిదానం (జకాత్) ఇవ్వండి. మీరు ముందుగా చేసి పంపిన మంచి కార్యాలను మీరు అల్లాహ్ దగ్గర పొందుతారు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
మరియు వారు: "యూదుడు లేదా క్రైస్తవుడు తప్ప, మరెవ్వడూ స్వర్గంలో ప్రవేశించలేడు!" అని అంటారు. ఇవి వారి అభిలాషలు మాత్రమే. వారిని ఇలా అడుగు: "మీరు సత్యవంతులే అయితే దానికి మీ నిదర్శనాలు చూపండి!"
వాస్తవానికి ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై (ఇస్లాం స్వీకరించి) తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు అంకితం చేసుకుని, సజ్జనుడై ఉంటాడో! దానికి అతడు తన ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతాడు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
మరియు యూదులు: "క్రైస్తవుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు క్రైస్తవులు: "యూదుల వద్ద (సత్యధర్మమనేది) ఏదీ లేదు." అని అంటారు. మరియు వారందరూ చదివేదు దివ్యగ్రంథమే. ఇలాగే (దివ్యగ్రంథ) జ్ఞానం లేనివారు (బహుదైవారాధకులు) కూడా ఇదే విధంగా పలుకు తుంటారు. కావున వారందరిలో ఉన్న అభిప్రాయభేదాలను గురించి, అల్లాహ్ పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు.
మరియు అల్లాహ్ మస్జిద్ లలో ఆయన నామస్మరణం నిషేధించి వాటిని నాశనం చేయటానికి పాటుపడే వారి కంటే ఎక్కువ దుర్మార్గులెవరు? అలాంటి వారు వాటిలో (మస్జిద్ లలో) ప్రవేశించటానికి అర్హులు కారు; వారు (ఒకవేళ ప్రవేశించినా) భయపడుతూ ప్రవేశించాలి. వారికి ఇహలోకంలో పరాభవం ఉంటుంది మరియు పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.
మరియు తూర్పు పడమరలు అల్లాహ్ కే చెందినవి. కావున మీరు (మీ ముఖాలను) ఏ దిక్కుకు త్రిప్పినా మీకు అల్లాహ్ సముఖమే లభిస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్, సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.
మరియు వారు: "అల్లాహ్ ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నాడు (కన్నాడు)." అని అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. వాస్తవానికి భూమ్యాకాశాలలో ఉన్న వన్నీ ఆయనకు చెందినవే. అవన్నీ ఆయనకు విధేయులై ఉన్నాయి.
ఆయనే ఆకాశాలనూ మరియు భూమినీ ఏ నమూనా లేకుండా ఆరంభించిన (సృష్టించిన) వాడు. మరియు ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు దానిని కేవలం: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది.
మరియు అజ్ఞానులు: "అల్లాహ్ మాతో ఎందుకు మాట్లాడడు? లేక మా వద్దకు ఏదైనా సూచన (ఆయత్) ఎందుకు రాదు? అని అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇదే విధంగా అడిగేవారు. వారందరి మనస్తత్వాలు (హృదయాలు) ఒకే విధమైనవి. వాస్తవానికి, దృఢనమ్మకం ఉన్న వారికి మేము మా సూచన (ఆయత్) లను సృష్టపరుస్తాము.
నిశ్చయంగా, మేము నిన్ను (ఓ ముహమ్మద్) సత్యాన్ని ప్రసాదించి, శుభవార్త నిచ్చేవానిగా మరియు హెచ్చరిక చేసే వానిగా పంపాము. మరియు భగ-భగ మండే నరకాగ్నికి గురి అయ్యే వారిని గురించి నీవు ప్రశ్నించబడవు.
మరియు యూదులైనా, క్రైస్తవులైనా నీవు వారి మతమును అనుసరించే వరకూ, వారు నీతో సంపన్నులు కారు. నీవు: "నిశ్చయంగా, అల్లాహ్ చూపిన మార్గమే సన్మార్గం." అని చెప్పు. మరియు నీకు జ్ఞానం లభించిన తరువాత కూడా, నీవు వారి కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ (శిక్ష) నుండి నిన్ను రక్షించేవాడు గానీ, సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
మేము దివ్య గ్రంథాన్ని ప్రసాదించిన వారు (యూదులు మరియు క్రైస్తవులు), దానిని (తమ గ్రంథాన్ని) కర్తవ్యంతో పఠించ వలసిన విధంగా పఠిస్తే, అలాంటి వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరించే వారే నష్టపడువారు.
ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నిశ్చయంగా, నేను మిమ్మల్ని (మీ కాలంలోని) సర్వ లోకాల వారి కంటే ఎక్కువగా ఆదరించాను.
మరియు ఆ (పునరుత్థాన) దినాన్ని గురించి భయభీతి కలిగి ఉండండి, ఆనాడు ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తికి ఏ మాత్రమూ ఉపయోగపడలేడు. మరియు ఎవడి నుండీ ఎలాంటి పరిహారం స్వీకరించబడదు. మరియు ఎవడికీ సిఫారసూ లాభదాయకం కాజాలదు మరియు వారికెలాంటి సహాయమూ లభించదు.
మరియు ఇబ్రాహీమ్ ను అతని ప్రభువు (కొన్ని) ఉత్తరువులిచ్చి పరీక్షించిన విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వాటి అన్నింటిలో అతను నెగ్గాడు. అప్పుడు ఆయన (అల్లాహ్): "నిశ్చయంగా, నేను నిన్ను మానవ జాతికి నాయకునిగా చేస్తున్నాను." అని అన్నాడు. (దానికి ఇబ్రాహీమ్): "మరి నా సంతతి వారు?" అని అడిగాడు. (దానికి అల్లాహ్): "నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు." అని జవాబిచ్చాడు.
మరియు ఈ (కఅబహ్) గృహాన్ని మేము మానవులను తరచుగా సందర్శించే కేంద్రం (పుణ్యస్థలం)గా మరియు శాంతి నిలయంగా చేసి, ఇబ్రాహీమ్ నిలబడిన చోటును మీరు నమాజ్ చేసే స్థలంగా చేసుకోండన్న విషయాన్ని (జ్ఞాపకం చేసుకోండి). మరియు మేము ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ లకు: "నా ఈ గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కొరకూ, ఏకాంత ధ్యానం (ఏతికాఫ్) పాటించేవారి కొరకూ, వంగే (రుకూఉ చేసే) వారి కొరకూ మరియు సజ్దాలు చేసే వారి కొరకూ పరిశుద్ధంగా ఉంచండి." అని నిర్దేశించాము.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతియుతమైన నగరంగా చేసి, ఇందు నివసించేవారిలో అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారికి అన్ని రకాల ఫలాలను జీవనోపాధిగా నొసంగు." అని ప్రార్థించినప్పుడు, (అల్లాహ్): "మరియు ఎవడు సత్యతిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించటానికి కొంత కాలం విడిచి పెడ్తాను. తరువాత అతనిని నరకాగ్నిలోకి బలవంతంగా త్రోసివేస్తాను. అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం!" అని అన్నాడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ మరియు ఇస్మాయీల్ ఈ గృహపు (కఅబహ్) పునాదులను ఎత్తేటపుడు (ఈ విధంగా ప్రార్థించారు): "ఓ మా ప్రభూ! మా ఈ సేవను స్వీకరించు. నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు."
"ఓ మా ప్రభూ! మమ్మల్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) చేయి మరియు మా సంతతి నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా (ముస్లింలుగా) ఉండునట్లు చేయి. మరియు మాకు, మా ఆరాధనారీతులను (మనాసిక్ లను) తెలుపు మరియు మా పశ్చాత్తాపాన్ని అంగీకరించు. నిశ్చయంగా, నీవే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు."
"ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు."
మరియు ఇబ్రాహీమ్ మతం నుండి విముఖుడయ్యేవాడెవడు, తనను తాను అవివేకిగా చేసుకొనువాడు తప్ప? వాస్తవానికి మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) ఈ లోకంలో ఎన్నుకున్నాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.
అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు." అని అన్నప్పుడు అతను: " నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయిపోయాను." అని జవాబిచ్చాడు.
మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి.
ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము."
అది ఒక గతించిన సమాజం. దాని కర్మల ఫలితం దానికి మరియు మీ కర్మలది మీకు. మరియు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు.
మరియు వారంటారు: "మీరు యూదులుగా లేదా క్రైస్తవులుగా ఉంటేనే మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది!" వారితో అను: "వాస్తవానికి, మేము (అనుసరించేది) ఇబ్రాహీమ్ మతం, ఏకదైవ సిద్ధాంతం (హనీఫా). మరియు అతను బహు-దైవారాధకుడు కాడు."
(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము."
వారు కూడా మీరు విశ్వసించినట్లు విశ్వసిస్తే, వారు సన్మార్గం పొందిన వారవుతారు. ఒకవేళ వారు తిరిగిపోతే, విరోధం వహించిన వారవుతారు. (వారి నుండి రక్షించటానికి) మీకు అల్లాహ్ చాలు. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
(వారితో ఇలా అను): "(మీరు) అల్లాహ్ రంగును (ధర్మాన్ని) స్వీకరించండి. మరియు అల్లాహ్ కంటే మంచి రంగు (ధర్మం) ఎవరిది? మరియు మేము ఆయనను మాత్రమే ఆరాధించేవారము."
(ఓ ముహమ్మద్!) వారితో అను: "ఏమీ? అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదిస్తారా? (వాస్తవానికి) ఆయన మా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. మా కర్మలు మాకు మరియు మీ కర్మలు మీకు. మరియు మేము ఆయనకు మాత్రమే మనఃపూర్వకంగా విధేయుల మయ్యాము."
లేక మీరు: "నిశ్చయంగా ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు వారి సంతతి వారంతా యూదులు మరియు క్రైస్తవులు." అని అంటారా? ఇంకా ఇలా అను: "ఏమీ మీకు బాగా తెలుసా? లేక అల్లాహ్ కు (బాగా తెలుసా)? అల్లాహ్ వద్ద నుండి తన వద్దకు వచ్చిన సాక్ష్యాన్ని దాచే వాని కంటే ఎక్కువ దుర్మార్గుడెవడు? మరియు మీ కర్మల నుండి, అల్లాహ్ నిర్లక్ష్యంగా లేడు!"
"ఇప్పుడు ఆ సంఘం గతించి పోయింది. అది చేసింది దానికి మరియు మీరు చేసింది మీకు. వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి మీరు ప్రశ్నించబడరు."
ప్రజలలోని కొందరు మూఢజనులు ఇలా అంటారు: "వీరిని (ముస్లింలను) ఇంత వరకు వీరు అనుసరిస్తూ వచ్చిన, ఖిబ్లా నుండి త్రిప్పింది ఏమిటి?" వారితో ఇలా అను: "తూర్పు మరియు పడమరలు అల్లాహ్ కే చెందినవి. ఆయన తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు."
మరియు మీరు ప్రజలకు సాక్షులుగా ఉండటానికి మరియు సందేశహరుడు (ముహమ్మద్) మీకు సాక్షిగా ఉండటానికి" మేము, మిమ్మల్ని ఒక మధ్యస్థ (ఉత్తమ మరియు న్యాయశీలమైన) సమాజంగా చేశాము. మరియు ఎవరు సందేశహరుణ్ణి అనుసరిస్తారో మరియు ఎవరు తమ మడమల మీద వెనుదిరిగి పోతారో అనేది పరిశీలించడానికి నీవు పూర్వం అనుసరించే ఖిబ్లా (బైతుల్ మఖ్దిస్) ను ఖిబ్లాగా చేసి ఉన్నాము. మరియు ఇది వాస్తవానికి అల్లాహ్ మార్గదర్శకత్వం చూపిన వారికి తప్ప, ఇతరులకు భారమైనది. మరియు అల్లాహ్ మీ విశ్వాసాన్ని (బైతుల్ మఖ్దిస్ వైపునకు చేసిన నమాజులను) ఎన్నడూ వృథా చేయడు." నిశ్చయంగా, అల్లాహ్ ప్రజల పట్ల కనికరుడు, అపార కరుణాప్రదాత.
(ఓ ప్రవక్తా!) వాస్తవానికి మేము, నీవు పలుమార్లు నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తడం చూశాము. కావున మేము నిన్ను, నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జద్ అల్ హరామ్ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమాజు చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి. మరియు నిశ్చయంగా, గ్రంథం గలవారికి ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమని బాగా తెలుసు. మరియు అల్లాహ్ వారి కర్మల గురించి నిర్లక్ష్యంగా లేడు.
మరియు నీవు గ్రంథప్రజలకు ఎన్ని సూచనలు (ఆయాత్) చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించరు. మరియు వారిలో ఒక వర్గం వారు, మరొక వర్గం వారి ఖిబ్లాను అనుసరించరు. మరియు నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడా వారి మనోవాంఛలను అనుసరిస్తే! నిశ్చయంగా, నీవు దుర్గార్గులలో చేరిన వాడవుతావు.
మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.
(నిస్సందేహంగా!) ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున నీవు సందేహించేవారిలో ఏ మాత్రం చేరకు!
మరియు ప్రతి ఒక (సంఘం) ఒక దిశ వైపునకు ముఖం త్రిప్పుతుంది. కావున మీరు మంచిపనులు చేయటానికి త్వరపడండి. మీరెక్కడున్నా సరే, అల్లాహ్ మీ అందరినీ (తీర్పుదినం నాడు తన సన్నిధిలోకి) రప్పిస్తాడు. నిశ్చయంగా! అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
మరియు నీవు ఎక్కడికి బయలు దేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు.
మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పుకోండి. దీని వల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం దొరుకదు. కాని వారిలో దుర్మార్గులైన వారు (ఎలాంటి పరిస్థితులలోనూ ఊరుకోరు). అందుకని వారికి భయపడకండి. నాకే భయపడండి! మరియు ఈ విధంగా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, మరియు బహుశా, ఈ విధంగానైనా మీరు మార్గదర్శకత్వం పొందవచ్చు!
ఈ విధంగా మేము మీ వారిలో నుండియే మా సూచనలను మీ ఎదుట వినిపించటానికి మరియు మిమ్మల్ని సంస్కరించటానికి మరియు మీకు గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధించటానికి మరియు మీకు తెలియని విషయాలు నేర్పటానికి - ఒక ప్రవక్త (ముహమ్మద్) ను మీ వద్దకు పంపాము.
కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి.
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా, అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.
మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని 'మృతులు' అనకండి! వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.
మరియు నిశ్చయంగా మేము, మిమ్మల్ని భయప్రమాదాలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణ ఫల (ఆదాయాల) నష్టానికి గురిచేసి పరీక్షిస్తాము. మరియు (ఇలాంటి పరిస్థితులలో) మనఃస్థైర్యంతో ఉండేవారికి శుభవార్తనివ్వు.
ఎవరైతే విపత్కరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు: "నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము!" అని అంటారో!
అలాంటి వారికి వారి ప్రభువు నుండి అనుగ్రహాలు మరియు కరణ ఉంటాయి. మరియు వారే సన్మార్గం పొందినవారు.
నిశ్చయంగా, 'సఫా మరియు మర్వాలు అల్లాహ్ చూపిన చిహ్నాలు. కావున ఎవడు (కఅబహ్) గృహానికి 'హజ్జ్ లేక 'ఉమ్రా కొరకు పోతాడో, అతడు ఈ రెంటి మధ్య పచార్లు (స'యీ) చేస్తే, అతనికి ఎట్టి దోషం లేదు. మరియు ఎవడైనా స్వేచ్ఛాపూర్వకంగా మంచికార్యం చేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు.
నిశ్చయంగా, ఎవరైతే మేము అవతరింపజేసిన స్పష్టమైన బోధనలను, మార్గదర్శకత్వాలను - ప్రజల కొరకు దివ్యగ్రంథాలలో స్పష్టపరచిన పిదప కూడా - దాచుతారో! వారిని అల్లాహ్ తప్పక శపిస్తాడు (బహిష్కరిస్తాడు). మరియు శపించగలవారు కూడా వారిని శపిస్తారు.
కాని ఎవరైతే పశ్చాత్తాప పడతారో మరియు తమ నడవడికను సంస్కరించుకుంటారో మరియు సత్యాన్ని వెల్లడిస్తారో, అలాంటి వారి పశ్చాత్తాపాన్ని నేను అంగీకరిస్తాను. మరియు నేను మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడను, అపార కరుణా ప్రదాతను.
నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ తిరస్కారంలోనే మృతి చెందుతారో, అలాంటి వారిపై అల్లాహ్ యొక్క శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు దేవదూతల మరియు సర్వ మానవుల యొక్క శాపముంటంది.
అందులో (ఆ శాపగ్రస్త స్థితిలోనే నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ మరియు వారికి మళ్ళీ వ్యవధి ఇవ్వటం కానీ జరుగదు.
మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రదాత.
నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి.
అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను, అల్లాహ్ కు సాటి కల్పించుకుని, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. మరియు ఈ దుర్మార్గం చేస్తున్న వారు ప్రత్యక్షంగా చూడగలిగితే! ఆ శిక్షను చూసినప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్ కే చెందుతుంది మరియు నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు, (అని తెలుసుకునే వారు).
అప్పుడు (ఆ రోజు) వారు (ఆ సాటిగా కల్పించబడిన వారు) తమను అనుసరించిన వారితో తమకు ఎలాంటి సంబంధం లేదంటారు. మరియు వారంతా తమ శిక్షను చూసుకుంటారు. మరియు వారి మధ్య ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి.
మరియు ఆ అనుసరించిన వారు అంటారు: "మాకు ప్రపంచ జీవితంలోకి మళ్ళీ తిరిగిపోయే అవకాశం లభిస్తే - వీరు ఈ రోజు మమ్మల్ని త్యజించినట్లు - మేము కూడా వీరిని త్యజిస్తాము!" ఈ విధంగా(ప్రపంచంలో) వారు చేసిన కర్మలను అల్లాహ్ వారికి చూపించి నప్పుడు, అది వారికి ఎంతో బాధాకరంగా ఉంటుంది. కాని వారు నరకాగ్ని నుండి ఏ విధంగానూ బయటపడలేరు.
ఓ ప్రజలారా! భూమిలోనున్న ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన వాటినే తినండి. మరియు షైతాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు.
నిశ్చయంగా, అతడు (షైతాన్) మిమ్మల్ని దుష్కార్యాలు మరియు అశ్లీలమైన పనులు చేయటానికి మరియు అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు పలుకటానికి ప్రేరేపిస్తుంటాడు.
మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటిని (ఆదేశాలను) అనుసరించండి!" అని అన్నప్పుడు, వారు: "అలా కాదు, మేము మా తండ్రితాతలు అవలంబిస్తూ వచ్చిన పద్ధతినే అనుసరిస్తాము." అని సమాధానమిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలు ఎలాంటి జ్ఞానం లేని వారైనప్పటికీ మరియు సన్మార్గం పొందని వారు అయినప్పటికినీ, (వీరు, వారినే అనుసరిస్తారా)?
మరియు సత్యతిరస్కారుల ఉపమానం, వాటి (ఆ పశువుల) వలే ఉంది; అవి అతడి (కాపరి) అరుపులు వింటాయే (కానీ ఏమీ అర్థం చేసుకోలేవు), అరుపులు మరియు కేకలు వినడం తప్ప. వారు చెవిటివారు, మూగవారు మరియు గ్రుడ్డివారు, కాబట్టి వారు ఏమీ అర్థం చేసుకోలేరు!
ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్) నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధమైన (ధర్మసమ్మతమైన) వస్తువులనే తినండి మరియు అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి.
నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పందిమాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవరైనా గత్యంతరంలేక, దుర్నీతితో కాకుండా, హద్దు మీరకుండా (తిన్నట్లైతే) అట్టి వానిపై ఎలాంటి దోషం లేదు! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన సందేశాలను దాచి, దానికి బదులుగా అల్పలాభం పొందుతారో, అలాంటి వారు తమ కడుపులను కేవలం అగ్నితో నింపుకుంటున్నారు మరియు అల్లాహ్ పునరుత్థాన దినమున వారితో మాట్లాడడు మరియు వారిని శుద్ధపరచడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
ఇలాంటివారే సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని మరియు క్షమాపణకు బదులుగా శిక్షను ఎన్నుకున్నవారు. ఎంత సహనముంది వీరికి, నరకాగ్ని శిక్షను భరించటానికి!
ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ ఈ గ్రంథాన్ని సత్యంతో అవతరింపజేశాడు. మరియు నిశ్చయంగా, ఈ గ్రంథం (ఖుర్ఆన్) గురించి భిన్నాభిప్రాయాలు గల వారు ఘోర అంతఃకలహంలో ఉన్నారు!
వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే మీరు మీ ముఖాలను తూర్పు దిక్కునకో, లేక పడమర దిక్కునకో చేయటం కాదు; కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం; మరియు ధనంపై ప్రేమ కలిగి ఉండి కూడా, దానిని బంధువుల కొరకు అనాథుల కొరకు, యాచించని పేదల కొరకు, బాటసారుల కొరకు, యాచకుల కొరకు మరియు బానిసలను విడిపించడానికి వ్యయపరచడం, మరియు నమాజ్ ను స్థాపించడం, జకాత్ ఇవ్వడం మరియు వాగ్దానం చేసినప్పుడు తమ వాగ్దానాన్ని పూర్తి చేయడం. మరియు దురవస్థలో మరియు అపత్కాలాలలో మరియు యుద్ధ సమయాలలో స్థైర్యం కలిగి ఉండటం. ఇలాంటి వారే సత్యవంతులు మరియు ఇలాంటి వారే దైవభీతి గలవారు.
ఓ విశ్వాసులారా! హత్య విషయంలో మీ కొరకు న్యాయప్రతీకారం (ఖిసాస్) నిర్ణయించబడింది. ఆ హత్య చేసిన వాడు, స్వేచ్ఛగలవాడైతే ఆ స్వేచ్ఛాపరుణ్ణి, బానిస అయితే ఆ బానిసను, స్త్రీ అయితే ఆ స్త్రీని (వధించాలి). ఒకవేళ హతుని సోదరులు (కుటుంబీకులు) హంతకుణ్ణి కనికరించదలిస్తే, ధర్మయుక్తంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని, ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తర్వాత కూడా ఈ హద్దును అతిక్రమించే వానికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది. దీని వల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు.
మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు అతడు ఆస్తిపాస్తులు గలవాడైతే అతడు తన తల్లిదండ్రుల కొరకు మరియు సమీపబంధువుల కొరకు ధర్మసమ్మతమైన మరణశాసనం (వీలునామా) వ్రాయాలి. ఇది దైవభితి గలవారి విద్యుక్త ధర్మం.
ఇక దానిని (వీలునామాను) విన్నవారు, తరువాత ఒకవేళ దానిని మార్చితే, దాని పాపమంతా నిశ్చయంగా, ఆ మార్చిన వారి పైననే ఉంటుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
కాని వీలునామా చేసిన వ్యక్తి పక్షపాతమో, లేదా అన్యాయమో చేశాడనే భయం ఎవనికైనా ఉంటే అతడు ఈ వ్యవహారంతో సంబంధమున్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులోఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విదంగానైతే మీ పూర్వీకులకు విధిగా నిర్ణయించబ ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!
ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తి చేయాలి. కాని దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది.
రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగ టానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి!
మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉంటాలి." అని, చెప్పు.
ఉపవాసపు రాత్రులందు మీకు మీ భార్యలతో రతిక్రీడ (రఫస్) ధర్మసమ్మతం చేయబడింది. వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు. వాస్తవానికి మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలుసు. కావున ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు మరియు మిమ్మల్ని మన్నించాడు. ఇక నుండి మీరు మీ భార్యలతో సంభోగం (బాషిర్) చేయండి మరియు అల్లాహ్ మీ కొరకు వ్రాసిన దానిని కోరండి. మరియు ఉదయకాలపు తెల్లరేఖలు రాత్రి నల్లచారల నుండి స్పష్టపడే వరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత చీకటి పడే వరకూ మీ ఉపవాసాన్ని పూర్తి చెయ్యండి. కాని మస్జిదులలో ఏతెకాఫ్ పాటించేటప్పుడు, మీరు మీ స్త్రీలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు, కావున ఉల్లంఘించే (ఉద్దేశంతో) వీటిని సమీపించకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞను ప్రజలకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా వారు భయభక్తులు కలిగి ఉంటారని!
మరియు మీరు ఒకరి సొమ్మును మరొకరు అన్యాయంగా కబళించకండి మరియు బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో, ఇతరుల ఆస్తిలో కొంతభాగం తినే దురుద్ధేశంతో, న్యాయాధికారులకు లంచాలు ఇవ్వకండి.
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను మారే చంద్రుని (రూపాలను) గురించి అడుగుతున్నారు. నీవు వారితో ఇలా అను: "అవి ప్రజలకు కాలగణనను మరియు హజ్జ్ దినాలను తెలియజేస్తాయి." మీరు మీ ఇళ్ళలోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించడం ఋజువర్తన (బిర్ర్) కాదు, దైవభీతి కలిగి ఉండటమే ఋజువర్తన (బిర్ర్). కనుక మీరు ఇండ్లలో వాటి ద్వారాల నుండియే ప్రవేశించండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
మరియు మీతో, పోరాడే వారితో, మీరు అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులను అతిక్రమించకండి. నిశ్చయంగా, అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారిని ప్రేమించడు.
వారు, మీకు ఎక్కడ ఎదురైతే అక్కడనే వారిని చంపండి. మరియు వారు మిమ్మల్ని ఎచ్చటి నుండి తరిమి వేశారో, మీరు కూడా వారిని అచ్చటి నుండి తరిమి వేయండి. మరియు సత్యధర్మానికి అడ్డుగా నిలవటం (ఫిత్నా), చంపటం కంటే ఘోరమైనది. మస్జిద్ అల్ హరామ్ వద్ద వారు మీతో యుద్ధం చేయనంత వరకు మీరు వారితో అక్కడ యుద్ధం చేయకండి. ఒకవేళ వారే మీతో (ఆ పవిత్ర స్థలంలో) యుద్ధం చేస్తే వారిని వధించండి. ఇదే సత్యతిరస్కారులకు తగిన శిక్ష.
కానీ, వారు (యుద్ధం చేయటం) మానుకుంటే (మీరు కూడా మానుకోండి). ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
మరియు ఫిత్నా ముగిసిపోయే వరకు మరియు అల్లాహ్ ధర్మం మాత్రమే స్థాపించబడే వరకు మీరు వారితో యుద్ధం చేస్తూ ఉండండి. ఒకవేళ వారు మానుకుంటే, దుర్మార్గులతో తప్ప ఇతరులతో పోరాడకండి.
నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే మరియు నిషిద్ధ స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖిసాస్) తీసుకోవచ్చు. కాబట్టి మీపై ఎవరైనా దాడి చేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడి చేయండి. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.
మరియు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరియు మీ చేతులారా మిమ్మల్ని మీరు వినాశంలో పడవేసుకోకండి; మేలు చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ మేలు చేసే వారిని ప్రేమిస్తాడు.
మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు హజ్జ్ మరియు ఉమ్రా పూర్తి చేయండి. మీకు అక్కడ చేరటానికి (వాటిని పూర్తి చేయటానికి) ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరోముండనం చేసుకొని) దాని పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దానధర్మాలు చేయాలి (ఆరుగురు నిరుపేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా హజ్జె తమత్తు చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు బలి ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో, హజ్జ్ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్ అల్ హరామ్ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి.
హజ్జ్ నియమిత నెలలోనే జరుగుతుంది. ఈ నిర్ణీత మాసాలలో హజ్జ్ చేయటానికి సంకల్పించిన వ్యక్తి హజ్జ్ (ఇహ్రామ్)లో వున్న సమయంలో (భార్యతో) రతిక్రీడ (రఫస్)కు, దుష్టకార్యాలకు మరియు కలహాలకు దూరంగా ఉండాలి. మీరు చేసే మంచిపనులన్నీ అల్లాహ్ కు తెలుసు. (హజ్జ్ యాత్రకు) కావలసిన వస్తు సామాగ్రిని తీసుకు వెళ్ళండి. దైవభీతియే నిశ్చయంగా అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక ఓ బుద్ధమంతులారా! కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి.
(హజ్జ్ యాత్రలో) మీరు మీ ప్రభువు అనుగ్రహాలు అన్వేషిస్తే అందులో దోషం లేదు. అరఫాత్ నుండి బయలు దేరిన తరువాత మష్అరిల్ హరామ్ (ముజ్'దలిఫా) వద్ద (ఆగి) అల్లాహ్ ను స్మరించండి. మరియు ఆయన మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి, వాస్తవానికి మీరు పూర్వం మార్గభ్రష్టులుగా ఉండేవారు.
తరువాత ప్రజలంతా ఎక్కడి నుండి వెళ్తారో అక్కడి నుండి మీరూ వెళ్ళండి. అల్లాహ్ తో క్షమాభిక్ష వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత.
ఇక మీ (హజ్జ్) విధులను పూర్తి చేసిన తరువాత, మీరు మీ తండ్రితాతలను (పూర్వం) స్మరించే విధంగా, ఇంకా దాని కంటే అధికంగా అల్లాహ్ ను స్మరించండి. కాని వారిలో కొందరు: "ఓ మా ప్రభూ! మాకు ఈ లోకంలో (అన్నీ) ప్రసాదించు!" అని ప్రార్థిస్తారు. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం ఉండదు.
వారిలో మరికొందరు: "ఓ మా ప్రభూ! మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు!" అని ప్రార్థిస్తారు.
అలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా (ఉభయ లోకాలలో) తమ వాటాను పొందుతారు. మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
మరియు నియమిత రోజులలో అల్లాహ్ ను స్మరించండి. ఎవడైనా త్వరగా రెండు రోజులలోనే వెళ్ళిపోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు. మరెవడైనా నిదానించి (పదమూడవ తేదీ వరకు) నిలిచి పోయినా, అతనిపై ఎలాంటి దోషం లేదు, వాడికి, ఎవడైతే దైవభీతి కలిగి ఉంటాడో! మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా మీరంతా ఆయన సన్నిధిలో హాజరు చేయబడుతారనేది తెలుసుకోండి.
మరియు ప్రజలలో నుండి ఒక వ్యక్తి మాటలు ఇహలోక జీవితంలో నీకు సంతోషం కలుగజేయవచ్చు; మరియు తన సంకల్పశుద్ధిని తెలుపడానికి అతడు అల్లాహ్ ను సాక్షిగా నిలబెట్టవచ్చు! కాని, వాస్తవానికి అతడు ఘోరమైన జగడాలమారి కావచ్చు!
మరియు (ఓ ముహమ్మద్) అతడు (నీ వద్ద నుండి) తిరిగిపోయి లోకంలో కల్లోలం రేకెత్తించటానికి, పంటపొలాలను మరియు పశువులను నాశనం చేయటానికి పాటుపడ వచ్చు. మరియు అల్లాహ్ కల్లోల్లాన్ని ఏ మాత్రం ప్రేమించడు.
మరియు: "అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అతనితో అన్నప్పుడు, అహంభావం అతనిని మరింత పాపానికే ప్రేరేపిస్తుంది. కావున నరకమే అలాంటి వానికి తగిన స్థలం. మరియు అది ఎంత చెడ్డ విరామ స్థలం!
మరియు మానవులలోనే, అల్లాహ్ సంతోషం పొందటానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేసేవాడూ ఉన్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల యెడల చాల కనికరుడు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ విధేయతలో (ఇస్లాంలో) సంపూర్ణంగా ప్రవేశించండి. మరియు షైతాను అడుగు జాడలను అనుసరించకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు!
మీ వద్దకు స్పష్టమైన హితోపదేశాలు వచ్చిన పిదప కూడా, మీరు తప్పటడుగు వేస్తే! నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిముంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకోండి.
ఏమీ? అల్లాహ్ స్వయంగా దేవదూతలతో పాటు, మేఘాల ఛాయలలో ప్రత్యక్షం కావాలని వారు నిరీక్షిస్తున్నారా? కానీ, అప్పటికే ప్రతి విషయపు తీర్పు జరిగి ఉంటుంది. మరియు సమస్త విషయాలు (తీర్పు కొరకు) అల్లాహ్ దగ్గరికే మరలింపబడతాయి!
మేము ఎన్ని స్పష్టమైన సూచన (ఆయత్) లను వారికి చూపించామో ఇస్రాయీల్ సంతతి వారిని అడగండి! మరియు ఎవడు అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందిన తరువాత, వాటిని తారుమారు చేస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించటంలో ఎంతో కఠినుడు.
సత్యతిరస్కారులకు ఇహలోక జీవితం మనోహరమైనదిగా చేయబడింది. కావున వారు విశ్వాసులతో పరిహాసాలాడుతుంటారు. కానీ, పునరుత్థాన దినమున, దైవభీతి గలవారే వారి కంటే ఉన్నత స్థానంలో ఉంటారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.
పూర్వం, మానవులంతా ఒకే ఒక సమాజంగా ఉండేవారు. అప్పుడు అల్లాహ్ వారికి శుభవార్తలు ఇవ్వటానికి మరియు హెచ్చరికలు చేయటానికి ప్రవక్తలను పంపాడు. మరియు మానవులలో ఏర్పడిన భేదాలను పరిష్కరించటానికి, ఆయన గ్రంథాన్ని సత్యంతో వారి ద్వారా అవతరింపజేశాడు మరియు అది (దివ్యగ్రంథం) ఇవ్వబడిన వారు, స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడా, పరస్పర ద్వేషాల వల్ల భేదాభిప్రాయాలు పుట్టించుకున్నారు. కాని అల్లాహ్ తన ఆజ్ఞతో, విశ్వాసులకు వారు వివాదాలాడుతున్న విషయంలో సత్యమార్గాన్ని చూపాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
ఏమీ? మీరు (సులభంగా) స్వర్గంలో ప్రవేశించగలమని భావిస్తున్నారా? మీ పూర్వీకులు సహించినటువంటి (కష్టాలు) మీరూ సహించనిదే! వారిపై దురవస్థ, రోగబాధలు విరుచుకు పడ్డాయి మరియు వారు కుదిపివేయబడ్డారు, చివరకు అప్పటి సందేశహరుడు మరియు విశ్వాసులైన అతని సహచరులు: "అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది?" అని వాపోయారు. అదిగో నిశ్చయంగా అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది!
(ఓ ముహమ్మద్!) వారు (ప్రజలు) నిన్ను అడుగుతున్నారు: "మేము ఏమి ఖర్చు చేయాలి?" అని. వారితో అను: "మీరు మంచిది ఏది ఖర్చు చేసినా సరే, అది మీ తల్లిదండ్రుల, బంధువుల, అనాథుల, యాచించని పేదల (మసాకీన్) మరియు బాటసారుల కొరకు ఖర్చు చేయాలి. మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది."
మీకు అసహ్యకరమైనా! (ధర్మ) యుద్ధం చేయటం మీకు విధిగా నిర్ణయించబడింది. మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు! మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.
వారు నిషిద్ధ మాసాలలో యుద్ధం చేయటాన్ని గురించి నిన్ను అడుగుతున్నారు. వారితో ఇలా అను: "వాటిలో యుద్ధం చేయటం మహా అపరాధం. కాని (ప్రజలను) అల్లాహ్ మార్గాన్ని అవలంబించటం నుండి అవరోధాలు కలిగించటం మరియు ఆయన (అల్లాహ్)ను తిరస్కరించటం మరియు (ప్రజలను) మస్జిద్ అల్ హరామ్ ను దర్శించకుండా ఆటంకపరచడం మరియు అక్కడి వారిని దాని నుండి వెడలగొట్టడం అల్లాహ్ దృష్టిలో అంతకంటే మహా అపరాధం. పీడన (ఫిత్నా), రక్తపాతం కంటే ఘోరమైనది. వారికి సాధ్యమే అయితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మళ్ళించ గలిగే వరకూ వారు మీతో యుద్ధం చేయడం మానరు. మరియు మీలో ఎవరైనా మతభ్రష్టులై సత్యతిరస్కారులుగా మరణిస్తే, అలాంటి వారి మంచిపనులన్నీ ఇహపర లోకాలలో రెండింటిలోనూ వృథా అవుతాయి. మరియు అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు."
నిశ్చయంగా, విశ్వసించిన వారు మరియు (అల్లాహ్ మార్గంలో తమ జన్మభూమిని విడిచి) వలస పోయేవారు మరియు అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసేవారు; ఇలాంటి వారే! అల్లాహ్ కారుణ్యం ఆశించటానికి అర్హులు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
(ఓ ప్రవక్తా!) వారు, మధ్యపానాన్ని మరియు జూదాన్ని గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీవు ఈ విధంగా సమాధానమివ్వు: "ఈ రెంటింటిలోనూ ఎంతో హాని (పాపం) ఉంది. వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి, కాని వాటి హాని (పాపం) వాటి లాభాల కంటే ఎంతో అధికమైనది." మరియు వారిలా అడుగుతున్నారు: "మేము (అల్లాహ్ మార్గంలో) ఏమి ఖర్చు పెట్టాలి?" నీవు ఇలా సమాధానమివ్వు: "మీ (నిత్యావసరాలకు పోగా) మిగిలేది." మీరు ఆలోచించటానికి, అల్లాహ్ ఈ విధంగా తన సూచన (ఆయత్)లను మీకు విశదీకరిస్తున్నాడు -
ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ - మరియు అనాథలను గురించి వారు నిన్ను అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానమివ్వు: "వారి సంక్షేమానికి తోడ్పడటమే మేలైనది." మరియు మీరు వారితో కలిసి మెలిసి ఉంటే (తప్పులేదు), వారు మీ సోదరులే! మరియు చెరచే వాడెవడో, సవరించే వాడెవడో అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కోరితే మిమ్మల్ని కష్టపెట్టి ఉండేవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
మరియు ముష్రిక్ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి, ముష్రిక్ స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది. మరియు ముష్రిక్ పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలతో వారి వివాహం చేయించకండి. మరియు ముష్రిక్ పురుషుడు మీకు ఎంత నచ్చినా, అతడి కంటే విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలైనవాడు. ఇలాంటి వారు (ముష్రికీన్) మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తున్నారు. కాని అల్లాహ్! తన అనుమతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్ష పొందటానికి పిలుస్తున్నాడు. మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు - బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని - స్పష్టంగా తెలుపుతున్నాడు.
మరియు వారు నిన్ను స్త్రీల ఋతుకాలం గురించి అడుగుతున్నారు. నీవు వారికి ఇలా తెలుపు: "అదొక అపరిశుద్ధ (హానికరమైన) స్థితి. కనుక ఋతుకాలంలో స్త్రీలతో (సంభోగానికి) దూరంగా ఉండండి. వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధులు అయిన తరువాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాప పడేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుద్ధులుగా ఉండేవారిని ప్రేమిస్తాడు.
మీ భార్యలు మీకు పంటపొలాల వంటి వారు, కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. మరియు మీ స్వయం కొరకు (సత్కార్యాలు) చేసి పంపండి (మీకు మంచి సంతానం కొరకు ప్రార్థించండి). మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు నిశ్చయంగా ఆయనను కలసుకోవలసి ఉందని తెలుసుకోండి. మరియు విశ్వాసులకు శుభవార్తలను వినిపించు.
మరియు మీరు అల్లాహ్ (పేరుతో) చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి మరియు ప్రజలలలో శాంతి స్థాపించటం నుండి ఆటంకపరిచేవిగా కానివ్వకండి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
మీరు అనాలోచితంగా చేసే ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.
ఎవరైతే తమ భార్యలతో (సంభోగించము, అని) ప్రమాణం చేస్తారో, వారికి నాలుగు నెలల వ్యవధి ఉంది. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.
కాని వారు విడాకులకే నిర్ణయించుకుంటే! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేనాడు, సర్వజ్ఞుడు.
మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి. ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు.
ఒకవేళ అతడు (మూడవసారి) విడాకులిస్తే, ఆ తర్వాత ఆ స్త్రీ అతనికి ధర్మసమ్మతం కాదు, ఆమె వివాహం వేరే పురుషునితో జరిగితే తప్ప! ఒకవేళ అతడు (రెండవ భర్త) ఆమెకు విడాకులిస్తే! అప్పుడు ఉభయులూ (మొదటి భర్త, ఈ స్త్రీ) తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు మరియు ఇవి అల్లాహ్ నియమించిన హద్దులు. వీటిని ఆయన గ్రహించే వారికి స్పష్టపరుస్తున్నాడు.
మరియు మీరు స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారి కొరకు నిర్ణయించబడిన గడువు (ఇద్దత్) సమీపిస్తే వారిని సహృదయంతో మీ వద్ద ఉంచుకోండి, లేదా సహృదయంతో విడిచి పెట్టండి. కేవలం వారికి బాధ కలిగించే మరియు పీడించే ఉద్దేశ్యంతో వారిని ఉంచుకోకండి మరియు ఆ విధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకన్నట్లు. మరియు అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకోకండి. మరియు అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని మరియు మీపై అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు వివేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన (అల్లాహ్) మీకు ఈ విధంగా బోధిస్తున్నాడు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసని తెలుసుకోండి.
మరియు మీరు మీ స్త్రీలకు (మొదటి సారి లేక రెండవసారి) విడాకులిస్తే, వారు తమ నిరీక్షణా వ్యవధిని (ఇద్దత్ ను) పూర్తి చేసిన తరువాత, తమ (మొదటి) భర్తలను ధర్మసమ్మతంగా పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకండి. మీలో ఎవరికి అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసముందో, వారికి ఈ బోధన చేయబడుతోంది. ఇది మీకు నిష్కళంకమైనది మరియు నిర్మలమైనది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు ఏమీ తెలియదు.
(విడాకుల తరువాత) పూర్తి రెండు సంవత్సరాల పాల గడువు పూర్తి చేయవలెనని (తల్లిదండ్రులు) కోరినట్లయితే, తల్లులు తమ పిల్లలకు పాలివ్వాలి. బిడ్డ తండ్రిపై, వారికి తగు రీతిగా భోజనం మరియు వస్త్రాలిచ్చి పోషించవలసిన బాధ్యత ఉంటుంది. శక్తికి మించిన భారం ఏ వ్యక్తిపై కూడా మోపబడదు. తల్లి తన బిడ్డ వలన కష్టాలకు గురి కాకూడదు. మరియు తండ్రి కూడా తన బిడ్డ వలన (కష్టాలకు గురి కాకూడదు). మరియు (పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్నట్లు తండ్రి చనిపోతే) అతని వారసులపై కూడా ఉంటుంది. మరియు (తల్లిదండ్రులు) ఇరువురు సంప్రదించుకొని పరస్పర అంగీకారంతో (రెండు సంవత్సరాలు పూర్తికాక ముందే) బిడ్డ చేత పాలు విడిపిస్తే, వారిరువురికి ఎలాంటి దోషం లేదు. మరియు మీరు మీ బిడ్డలకు వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చేయదలిస్తే, మీపై ఎలాంటి దోషం లేదు. కాని మీరు ఆమెకు (తల్లికి) ఇవ్వ వలసింది ధర్మసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు చేసేదంతా నిశ్చయంగా, అల్లాహ్ చూస్తున్నాడని తెలుసుకోండి.
మరియు మీలో ఎవరైనా మరణించి, భార్యలను వదలిపోయినట్లైతే (అలాంటి విధవలు) నాలుగు నెలల పది రోజులు (రెండవ పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. వారి గడువు పూర్తి అయిన తరువాత వారు తమకు ఉచితమైనది, ధర్మసమ్మతంగా చేసుకుంటే మీపై దోషం లేదు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.
మరియు మీరు (వితంతువు లేక మూడు విడాకులు పొందిన స్త్రీలతో) వివాహం చేసుకోవాలనే సంకల్పాన్ని (వారి నిరీక్షణా కాలంలో) పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా మీపై దోషం లేదు. మీరు వారితో (వివాహమాడటం గురించి) ఆలోచిస్తున్నారని అల్లాహ్ కు తెలుసు, కానీ వారితో రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోకండి. అయితే మీరేదైనా మాట్లాడదలచుకుంటే, ధర్మసమ్మతమైన రీతిలో మాట్లాడుకోండి. మరియు నిరీక్షణా వ్యవధి పూర్తయ్యేంత వరకు వివాహం చేసుకోకండి. నిశ్చయంగా మీ మనస్సులలో ఉన్నదంతా అల్లాహ్ కు తెలుసని తెలుసుకొని, ఆయనకు భయపడండి. మరియు నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు (శాంత స్వభావుడు) అని తెలుసుకోండి.
మీరు మీ స్త్రీలను ముట్టుకోక ముందే, లేక వారి మహ్ర్ నిర్ణయం కాక పూర్వమే, వారికి విడాకులిస్తే, అది పాపం కాదు. మరియు వారికి కొంత పారితోషికంగా తప్పకుండా ఇవ్వండి. మరియు ధనవంతుడు తన శక్తి మేరకు, పేదవాడు తన స్థితిని బట్టి ధర్మసమ్మతమైన విధంగా పారితోషికం ఇవ్వాలి. ఇది సజ్జనులైన వారి విద్యుక్తధర్మం.
మరియు మీరు తాకక పూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే మరియు వాస్తవానికి అప్పటికే వారి కన్యాల్కం (మహ్ర్) నిర్ణయించబడి ఉంటే, సగం మహ్ర్ చెల్లించండి, కానీ స్త్రీ క్షమించి విడిచి పెడ్తే, లేదా వివాహ సంబంధ అధికారం ఎవరి చేతిలో ఉందో అతడు (భర్త) గానీ క్షమించి విడిచిపెట్టగోరితే తప్ప! మరియు క్షమించటమే దైవభీతికి సన్నిహితమైనది. మరియు మీరు పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరచిపోవద్దు. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
మీరు మీ నమాజ్ లను కాపాడుకోండి మరియు ముఖ్యంగా మధ్య నమాజ్ ను మరియు అల్లాహ్ సన్నిధానంలో వినయవిధేయతలతో నిలబడండి.
మీరు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నడుస్తూ గానీ, స్వారీ చేస్తూ గానీ, నమాజ్ చేయవచ్చు. కాని మీకు శాంతిభద్రతలు లభించినప్పుడు, ఆయన మీకు నేర్పినట్లు అల్లాహ్ ను స్మరించండి. ఎందుకంటే ఈ పద్ధతి ఇంతకు పూర్వం మీకు తెలియదు.
మరియు మీలో మరణించిన వారు భార్యలను వదలిపోతే, వారు తమ భార్యలకు ఒక సంవత్సరపు భరణపు ఖర్చులు ఇవ్వాలనీ, వారిని ఇంటి నుండి వెడలగొట్ట వద్దనీ వీలునామా వ్రాయాలి. కానీ వారు తమంతట తామే వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా మీపై పాపం లేదు మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
మరియు విడాకులివ్వబడిన స్త్రీలకు ధర్మప్రకారంగా భరణపు ఖర్చులు ఇవ్వాలి. ఇది దైవభీతి గలవారి విధి.
ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను (ఆయత్ లను) మీకు స్పష్టంగా తెలుపుతున్నాడు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని.
ఏమీ? మృత్యుభయంతో, వేల సంఖ్యలో ప్రజలు తమ ఇండ్లను వదలి పోయింది నీకు తెలియదా? అప్పుడు అల్లాహ్ వారితో: "మరణించండి!" అని అన్నాడు కాని తరువాత వారిని బ్రతికించాడు. నిశ్చయంగా, అల్లాహ్ మానవుల పట్ల అత్యంత అనుగ్రహం గలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు.
మరియు మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు, అని తెలుసుకోండి.
అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు? ఎందుకంటే ఆయన దానిని ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. అల్లాహ్ మాత్రమే (సంపదలను) తగ్గించేవాడూ మరియు హెచ్చించేవాడూనూ మరియు మీరంతా ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది.
ఏమీ? మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీలు సంతతి నాయకులు, తమ ఒక ప్రవక్తతో: "నీవు మా కొరకు ఒక రాజును నియమించు, మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం (జిహాద్) చేస్తాము." అని పలికిన సంగతి నీకు తెలియదా? దానికి అతను: "ఒకవేళ యుద్ధం చేయమని ఆదేశిస్తే, మీరు యుద్ధం చేయటానికి నిరాకరించరు కదా? అని అన్నాడు. దానికి వారు: "మేము మరియు మా సంతానం, మా ఇండ్ల నుండి గెంటివేయ బడ్డాము కదా! అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో ఎందుకు యుద్ధం చేయము?" అని జవాబిచ్చారు. కాని యుద్ధం చేయండని ఆజ్ఞాపించగానే, వారిలో కొందరు తప్ప, అందరూ వెన్ను చూపారు. మరియు అల్లాహ్ కు ఈ దుర్మార్గులను గురించి బాగా తెలుసు.
మరియు వారి ప్రవక్త (సామ్యూల్) వారితో: "నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు 'తాలూత్ ను (సౌల్ ను) రాజుగా నియమించాడు." అని అన్నాడు. దానికి వారు అన్నారు: "మాపై రాజ్యం చేసే హక్కు అతనికి ఎలా సంక్రమిస్తుంది? వాస్తవానికి, రాజ్యం చేసే హక్కు, అతని కంటే ఎక్కువ, మాకే ఉంది. మరియు అతను అత్యధిక ధనసంపత్తులున్న వాడునూ కాడు." (దానికి వారి ప్రవక్త) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ మీలో అతనిని ఎన్నుకొని అతనికి బుద్ధిబలాన్నీ, శారీరక బలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. మరియు అల్లాహ్ తాను కోరిన వారికి తన రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు."
మరియు వారితో వారి ప్రవక్త (సామ్యూల్) ఇలా అన్నాడు: "నిశ్చయంగా, అతని ఆధిపత్యానికి లక్షణం ఏమిటంటే, అతని ప్రభుత్వకాలంలో ఆ పెట్టె (తాబూత్) మీకు తిరిగి లభిస్తుంది. అందులో మీకు మీ ప్రభువు తరఫు నుండి, మనశ్శాంతి లభిస్తుంది. మరియు అందులో మూసా సంతతి మరియు హారూన్ సంతతి వారు వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు, దేవదూతల ద్వారా మీకు లభిస్తాయి. మీరు విశ్వసించిన వారే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన ఉంది."
ఆ పిదప 'తాలూత్ (సౌల్) తన సైన్యంతో బయలు దేరుతూ అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ ఒక నది ద్వారా మిమ్మల్ని పరీక్షించబోతున్నాడు. దాని నుండి నీరు త్రాగిన వాడు నా వాడు కాడు. మరియు నది నీటిని రుచి చూడని వాడు నిశ్చయంగా నా వాడు, కాని చేతితో గుక్కెడు త్రాగితే పర్వాలేదు." అయితే వారిలో కొందరు తప్ప అందరూ దాని నుండి (కడుపు నిండా నీరు) త్రాగారు. అతను మరియు అతని వెంట విశ్వాసులు ఆ నదిని దాటిన తరువాత వారన్నారు: "జాలూత్ తో మరియు అతని సైన్యంతో పోరాడే శక్తి ఈరోజు మాలో లేదు." (కానీ ఒక రోజున) అల్లాహ్ ను కలవడం తప్పదని భావించిన వారన్నారు: "అల్లాహ్ అనుమతితో, ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని జయించటం ఎన్నో సార్లు జరిగింది. మరియు అల్లాహ్ స్థైర్యం గలవారితోనే ఉంటాడు."
జాలూత్ (గోలియత్) మరియు అతని సైన్యాన్ని ఎదుర్కొనటానికి బయలు దేరి, వారు: "ఓ మా ప్రభూ! మాకు (ధైర్య) స్థైర్యాలను ప్రసాదించు, మా పాదాలను స్థిరంగా నిలపు. మరియు సత్యతిరస్కారులకు విరుద్ధంగా (పోరాడటానికి) మాకు సహాయపడు." అని ప్రార్థించారు.
ఆ తరువాత వారు, అల్లాహ్ అనుమతితో వారిని (సత్యతిరస్కారులను) ఓడించారు. మరియు దావూద్, జాలూత్ ను సంహరించాడు మరియు అల్లాహ్ అతనికి (దావూద్ కు) రాజ్యాధికారం మరియు జ్ఞానం ప్రసాదించి, తాను కోరిన విషయాలను అతనికి బోధించాడు. ఈ విధంగా అల్లాహ్ ప్రజలను, ఒకరి నుండి మరొకరిని కాపాడకుంటే, భూమిలో కల్లోలం వ్యాపించి ఉండేది. కానీ అల్లాహ్ సమస్త లోకాల మీద ఎంతో అనుగ్రహం గలవాడు."
ఇవన్నీ అల్లాహ్ సందేశాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, నీవు (మా) సందేశహరులలో ఒకడవు.
ఆ సందేశహరులు! మేము వారిలో కొందరికి మరికొందరిపై ఆధిక్యత నిచ్చాము. వారిలో కొందరితో అల్లాహ్ (నేరుగా) మాట్లాడాడు. మరికొందరిని (గౌరవనీయమైన) ఉన్నత స్థానాలకు ఎత్తాడు. మరియు మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు)కు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించి, అతనిని పరిశుద్ధాత్మ (జిబ్రీల్) సహాయంతో బలపరిచాము. మరియు - అల్లాహ్ తలుచుకుంటే - ఈ ప్రవక్తల తరువాత వచ్చిన ప్రజలు, వారికి స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ, వారు పరస్పర విభేదాలకు లోనయ్యారు. కావున వారిలో కొందరు విశ్వాసులయ్యారు మరికొందరు సత్యతిరస్కారులు అయ్యారు. మరియు అల్లాహ్ తలుచుకుంటే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు, కాని అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.
ఓ విశ్వాసులారా! ఏ బేరం గానీ, స్నేహం గానీ, సిఫారసు గానీ పనికిరాని దినం రాకముందే, మేము మీకు ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు పెట్టండి. మరియు సత్యతిరస్కారులు, వారే! దుర్మార్గులు.
అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్ఠించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.
ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
అల్లాహ్ విశ్వసించిన వారి సంరక్షకుడు, ఆయన వారిని చీకటి నుండి తీసి వెలుగులోకి తెస్తాడు. మరియు సత్యాన్ని తిరస్కరించినవారి రక్షకులు కల్పితదైవాలు (తాగూత్); అవి వారిని వెలుగు నుండి తీసి చీకటిలోనికి తీసుకొని పోతాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
ఏమీ? అల్లాహ్ (తన అనుగ్రహంతో) సామ్రాజ్యం ఇచ్చిన తరువాత, ఇబ్రాహీమ్ తో అతని ప్రభువు (అల్లాహ్) ను గురించి వాదించిన వ్యక్తి (నమ్రూద్) విషయం నీకు తెలియదా? ఇబ్రాహీమ్: "జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో! ఆయనే నా ప్రభువు." అని అన్నప్పుడు, అతడు: "చావుబ్రతుకులు రెండూ నా ఆధీనంలోనే ఉన్నాయి." అని అన్నాడు. అప్పుడు ఇబ్రాహీమ్: "సరే! అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు; అయితే నీవు (సూర్యుణ్ణి) పడమర నుండి ఉదయింపజెయ్యి." అని అన్నాడు. దానితో ఆ సత్యతిరస్కారి చికాకు పడ్డాడు. మరియు అల్లాహ్ దుర్మార్గం అవలంబించిన ప్రజలకు సన్మార్గం చూపడు.
లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: "వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: "ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: "ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: "కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: "ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): "ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): "నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు.
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం: ఆ విత్తనం వలే ఉంటుంది, దేని నుండి అయితే ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు ఉంటాయో! మరియు అల్లాహ్ తాను కోరిన వారికి హెచ్చుగా నొసంగుతాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.
ఎవరైతే, అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి, ఆ తరువాత తాము చేసిన ఉపకారాన్ని చెప్పుకుంటూ మరియు వారిని బాధిస్తూ ఉండరో, అలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు వద్ద ఉంది. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
మనస్సును గాయపరిచే దానం కంటే, మృదుభాషణ మరియు క్షమాగుణం ఎంతో మేలైనవి. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సహనశీలుడు.
ఓ విశ్వాసులారా! (కేవలం) పరులకు చూపటానికి, తన ధనం ఖర్చు చేస్తూ అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించని వాని మాదిరిగా! మీరూ చేసిన మేలును చెప్పుకొని (ఉపకారం పొందిన వారిని) కష్టపెట్టి, మీ దానధర్మాలను వ్యర్థ పరచుకోకండి. ఇలాంటి వాని పోలిక మట్టి కప్పుకున్న ఒక నున్నని బండపై భారీ వర్షం కురిసి (మట్టి కొట్టుకుపోగా) అది ఉత్తగా మిగిలి పోయినట్లుగా ఉంటుంది. ఇలాంటి వారు తాము సంపాదించిన దాని నుండి ఏమీ చేయలేరు. మరియు అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.
మరియు అల్లాహ్ ప్రీతి పొందే ఉద్దేశంతో మరియు ఆత్మ స్థిరత్వంతో ధనాన్ని ఖర్చు చేసేవారి పోలిక: మెట్టభూమిపై నున్న ఒక తోట వలె ఉంటుంది. దానిపై భారీ వర్షం కురిసినపుడు అది రెండింతల ఫలము నిస్తుంది. భారీ వర్షం కాక చినుకులు (కురిసినా దానికి చాలు). మరియు అల్లాహ్, మీరు చేసేదంతా చూస్తున్నాడు.
ఏమీ? మీలో ఎవరికైనా ఖర్జురపు మరియు ద్రాక్ష వనాలుండి, వాటి క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ, సర్వవిధాల ఫలాలు లభిస్తూ వుండి, అతనికి ముసలితనం వచ్చి, బలహీనులైన పిల్లలున్న సంకట సమయంలో, ఆ తోట మంటలు గల సుడిగాలి వీచి కాలిపోటం, ఎవరికైనా సమ్మతమేనా? మీరు ఆలోచించటానికి, ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను (ఆయత్ లను) మీకు విశదీకరిస్తున్నాడు.
ఓ విశ్వాసులారా! మీరు సంపాదించిన దాని నుండి మరియు మేము మీ కొరకు భూమి నుండి ఉత్పత్తి చేసిన వాటి నుండి, మేలైన వాటినే (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టండి. ఏ వస్తువులనైతే మీరు కండ్లు మూసుకునే గానీ తీసుకోరో, అలాంటి చెడ్డ వస్తువులను (ఇతరులపై) ఖర్చు చేయటానికి ఉద్దేశించకండి. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, ప్రశంసనీయుడని తెలుసుకోండి.
షైతాన్ దారిద్ర్య ప్రమాదం చూపి (భయపెట్టి), మిమ్మల్ని నీచకార్యాలు చేయటానికి ప్రేరేపిస్తుంటాడు. కాని అల్లాహ్ తన వైపు నుండి మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు.
ఆయన తాను కోరిన వారికి వివేకాన్ని ప్రసాదిస్తాడు. మరియు వివేకం పొందిన వాడు, వాస్తవంగా సర్వసంపదలను పొందిన వాడే! కాని బుద్ధిమంతులు తప్ప వేరేవారు దీనిని గ్రహించలేరు.
మరియు మీరు (ఇతరులపై) ఏమి ఖర్చుచేసినా, లేక ఏ మొక్కుబడి చేసుకున్నా, నిశ్చయంగా అల్లాహ్ కు అంతా తెలుస్తుంది. మరియు దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.
మీరు బహిరంగంగా దానాలు చేయటం మంచిదే! కాని, గుప్తంగా నిరుపేదలకు ఇస్తే! అది మీకు అంతకంటే మేలైనది. మరియు ఆయన మీ ఎన్నో పాపాలను (దీనివల్ల) రద్దు చేస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
(ఓ ప్రవక్తా!) వారిని సన్మార్గాన్ని అవలంబించేటట్లు చేయటం నీ బాధ్యత కాదు. కాని, అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు మీరు మంచిమార్గంలో ఖర్చుచేసేది మా (మేలు) కొరకే. మీరు ఖర్చు చేసేది అల్లాహ్ ప్రీతిని పొందటానికే అయి ఉండాలి. మీరు మంచి మార్గంలో ఏమి ఖర్చు చేసినా, దాని ఫలితం మీకు పూర్తిగా లభిస్తుంది మరియు మీకు ఎలాంటి అన్యాయం జరుగదు.
అల్లాహ్ మార్గంలో నిమగ్నులైన కారణంగా (తమ జీవనోపాధి కొరకు) భూమిలో తిరిగే అవకాశం లేక లేమికి గురి అయ్యే పేదవారు (ధనసహాయానికి అర్హులు). ఎరుగని మనిషి వారి అడగక పోవటాన్ని చూసి, వారు ధనవంతులని భావించవచ్చు! (కాని) వారి ముఖ చిహ్నాలు చూసి నీవు వారిని గుర్తించగలవు. వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు. మరియు మీరు మంచి కొరకు ఏమి ఖర్చుచేసినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.
ఎవరైతే తమ సంపదను (అల్లాహ్ మార్గంలో) రేయింబవళ్ళు బహిరంగంగానూ మరియు రహస్యంగానూ ఖర్చు చేస్తారో, వారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
ఎవరైతే వడ్డీ తింటారో! వారి స్థితి (పునరుత్థాన దినమున) షైతాన్ తాకడం వల్ల భ్రమపరచబడిన వ్యక్తి స్థితి వలె ఉంటుంది. ఇది ఎందుకంటే! వారు: "వ్యాపారం కూడా వడ్డీ లాంటిదే!" అని చెప్పడం. కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మ సమ్మతం (హలాల్) చేశాడు మరియు వడ్డీని నిషిద్ధం (హరామ్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందిన వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతడు పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతడి వ్యవహారమంతా అల్లాహ్ కే చెందుతుంది. (ఈ ఆదేశం తరువాత ఈ దుర్వ్యవహారానికి) పాల్పడేవారు నరకవాసులవుతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.
అల్లాహ్ వడ్డీ (ఆదాయాన్ని) నశింపజేస్తాడు మరియు దానధర్మాలు (చేసేవారికి) వృద్ధినొసంగుతాడు. మరియు సత్యతిరస్కారుడు (కృతఘ్నుడు), పాపిష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు.
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసే వారికీ మరియు నమాజ్ స్థాపించే వారికీ, జకాత్ ఇచ్చేవారికీ తమ ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు మీరు (నిజంగా) విశ్వాసులే అయితే, మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి.
కాని, ఒకవేళ మీరు అలా చేయకపోతే! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉందని తెలుసుకోండి. కాని మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీ వదులుకుంటే), మీ అసలు సొమ్ము మీకు లభిస్తుంది. మీరు (ఇతరులకు) అన్యాయం చేయకండి మరియు మీకూ అన్యాయం జరుగదు.
మరియు (మీ బాకీదారుడు ఆర్థిక) ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి, కుదిరే వరకూ గడువునివ్వండి. ఒకవేళ మీరు దానమని వదిలిపెడితే అది మీకు ఎంతో మేలైనది, ఇది మీకు తెలిస్తే (ఎంత బాగుండేది)!
మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.
ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీతకాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, దానిని వ్రాసిపెట్టుకోండి. మరియు మీలో పత్రం వ్రాసేవాడు, న్యాయంగా వ్రాయాలి. మరియు వ్రాసేవాడు నిరాకరించకుండా, అల్లాహ్ నేర్పినట్లు వ్రాయాలి. ఋణగ్రహీత అల్లాహ్ కు భయపడి, నిర్ణీత షరతులను తగ్గించకుండా, చెప్పి వ్రాయించాలి. ఋణగ్రహీత అల్పజ్ఞాని లేక సామర్థ్యం లేనివాడు లేక బలహీనుడు మరియు తాను చెప్పి వ్రాయించలేని వాడైతే, అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మరియు మీలో ఇద్దరు మగవారిని సాక్ష్యమివ్వటానికి సాక్షులుగా ఉంచుకోండి. ఇద్దరు పురుషులు దొరకని పక్షమున ఒక పురుషుడు మరియు మీకు సమ్మతమైన ఇద్దరు స్త్రీలను సాక్షులుగా తీసుకోండి. (ఎందుకంటే) వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేయించవచ్చు. మరియు పిలువబడినప్పుడు సాక్షులు, సాక్ష్యమివ్వటానికి నిరాకరించకూడదు. మరియు వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో పాటు వ్రాసిపెట్టటానికి అశ్రద్ధ చూపకూడదు. అల్లాహ్ దృష్టిలో ఇది న్యాయసమ్మతమైనది మరియు స్థిరమైన సాక్ష్యంగా తోడ్పడుతుంది మరియు ఏ విధమైన సందేహాలకు అవకాశం లేకుండా చేస్తుంది. కాని, మీరు అప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకునే (సాధారణ) లావాదేవీలు చేస్తున్నపుడు వ్రాయకున్నా దోషం లేదు. కాని, వ్యాపార వ్యవహారాలు నిర్ణయించేటప్పుడు సాక్షులను పెట్టుకోండి. కాని వ్రాసేవానికి గానీ, సాక్షులకు గానీ ఏ విధమైన హాని జరుగకూడదు. ఒకవేళ అలా జరిగితే! నిశ్చయంగా, అది మీకు పాపం. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఇది అల్లాహ్ మీకు నేర్పుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతిదాని జ్ఞానం ఉంది.
మరియు మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, (పత్రం) వ్రాసేవాడు దొరకని పక్షంలో సొమ్మును కుదువ పెట్టుకోవచ్చు. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే నమ్మకంగా ఇచ్చిన దానిని (అప్పును) తిరిగి అతడు వాపసు చేయాలి. మరియు తన ప్రభువైన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరియు మీరు సాక్ష్యాన్ని (ఎన్నడూ) దాచకండి. మరియు (సాక్ష్యాన్ని) దాచేవాని హృదయం పాపభరితమైనది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే! మీరు మీ మనస్సులలో ఉన్నది, వెలుబుచ్చినా లేక దాచినా అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు. మరియు ఆయన తాను కోరిన వానిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వానిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.
"అల్లాహ్, ఏ ప్రాణి పైననూ దాని శక్తికి మించిన భారం వేయడు. తాను సంపాదించిన దానికి (పుణ్య) ఫలితం దానికి లభిస్తుంది మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష అది అనుభవిస్తుంది. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టకు! ఓ మా ప్రభూ! పూర్వం వారిపై మోపినట్టి భారం మాపై మోపకు. ఓ మా ప్రభూ! మేము సహంచలేని భారం మాపై వేయకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు. నీవే మా సంరక్షకుడవు, కావున సత్యతిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయము (సహాయము) నొసంగు."