surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఓ ప్రవక్తా! అల్లాహ్ నీకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించుకుంటున్నావు? నీవు నీ భార్యల ప్రసన్నతను కోరుతున్నావా? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
వాస్తవానికి అల్లాహ్ మీ ప్రమాణాల పరిహార పద్ధతి మీకు నిర్దేశించాడు. మరియు అల్లాహ్ యే మీ యజమాని. మరియు ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ప్రవక్త తన భార్యలలో ఒకామెకు రహస్యంగా ఒక విషయం చెప్పగా ఆమె దానిని (ఆ రహస్యాన్ని) మరొకామెకు చెప్పింది. మరియు అల్లాహ్ అతనికి (ప్రవక్తకు) ఆ విషయాన్ని తెలియజేశాడు. (వాస్తవానికి) అతను (ప్రవక్త) ఆ విషయాన్ని (మొదటి) ఆమెకు కొంత తెలిపి, మరికొంత తెలుపలేదు. ఇక అతను (ప్రవక్త, మొదటి) ఆమెకు దానిని (రహస్యం బయట పడిన సంగతిని) తెలిపినప్పుడు, ఆమె (ఆశ్చర్యపోతూ) అతనితో ఇలా అడిగింది: "ఇది నీకు ఎవరు తెలిపారు?" అతను జవాబిచ్చాడు: "నాకు ఈ విషయం ఆ సర్వజ్ఞుడు, ఆ సర్వం తెలిసినవాడు తెలిపాడు."
(ఆ ఇద్దరు స్త్రీలతో ఇలా అనబడింది): "ఒకవేళ మీరిద్దరూ అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలితే (అది మీ మేలుకే) వాస్తవానికి మీ ఇద్దరి హృదయాలు (ఋజుమార్గం నుండి) తొలగిపోయాయి. ఒకవేళ మీరిద్దరు ప్రవక్తకు విరోధంగా పోతే! నిశ్చయంగా, అల్లాహ్ అతని సంరక్షకుడు మరియు జిబ్రీల్ మరియు సత్పురుషులైన విశ్వాసులు అతని (సహాయకులు). మరియు దేవదూతలందరు కూడా అతని సహాయకులని (తెలుసుకోండి)."
ఒకవేళ అతను (ముహమ్మద్!) మీ అందరికీ విడాకులిస్తే! అల్లాహ్, మీకు బదులుగా, మీకంటే మంచి భార్యలను, అతనికి (ప్రవక్తకు) ప్రసాదించగలడు! వారు మంచి ముస్లింలు, విశ్వాసులు, భక్తిపరులు, పశ్చాత్తాప పడేవారు, (అల్లాహ్ ను) ఆరాధించేవారు, వలస పోయే (ఉపవాసాలు చేసే) వారు అయిన, విధవలు లేదా కన్యలు అయి ఉంటారు!
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.
ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్ తన ప్రవక్తను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడి వైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. వారి ఇలా ప్రార్థిస్తారు: "ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్ధుడవు!"
ఓ ప్రవక్తా! నీవు సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతి చెడ్డ గమ్యస్థానం!
సత్యతిరస్కారుల విషయంలో అల్లాహ్ నూహ్ భార్య మరియు లూత్ భార్యల ఉదాహరణలను ఇచ్చాడు. ఆ ఇద్దరు స్త్రీలు మా సత్పురుషులైన మా ఇద్దరు దాసుల (వివాహ) బంధంలో ఉండిరి. కాని ఆ ఇద్దరు స్త్రీలు వారిద్దరిని మోసగించారు. కావున వారిద్దరు, ఆ ఇద్దరు స్త్రీల విషయంలో అల్లాహ్ ముందు (పరలోకంలో) ఏ విధంగాను సహాయపడలేరు. మరియు (తీర్పు దినమున) వారితో: "నరకాగ్నిలో ప్రవేశించే వారితో సహా, మీరిద్దరు స్త్రీలు కూడా ప్రవేశించండి!" అని చెప్పబడుతుంది.
మరియు అల్లాహ్, విశ్వసించినవారిలో ఫిర్ఔన్ భార్యను ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆమె ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు! మరియు నన్ను, ఫిర్ఔన్ మరియు అతన చేష్టల నుండి కాపాడు మరియు నన్ను ఈ దుర్మార్గ జాతివారి నుండి కాపాడు."
మరియు ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ ను (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడు కున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరఫు నుండి) జీవం (ఆత్మ) ఊదాము. మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది.