surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఏ విషయాన్ని గురించి వారు (ఒకరినొకరు) ప్రశ్నించుకుంటున్నారు?
ఆ మహా వార్తను గురించేనా?
దేనిని గురించైతే వారు భేదాభిప్రాయాలను కలిగి ఉన్నారో?
అది కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
ఎంత మాత్రము కాదు! వారు త్వరలోనే దానిని తెలుసుకోగలరు.
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా?
మరియు పర్వతాలను మేకులుగా?
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము.
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము.
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము.
మరియు పగటిని జీవనోపాధి సమయంగా చేశాము.
మరియు మేము మీపైన పటిష్టమైన ఏడు (ఆకాశాలను) నిర్మించాము.
మరియు (అందులో) ప్రకాశించే దీపాన్ని (సూర్యుణ్ణి) ఉంచాము.
మరియు మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము.
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి!
మరియు దట్టమైన తోటలను.
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం.
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు.
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి;
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి.
నిశ్చయంగా, నరకం ఒక మాటు;
ధిక్కారుల గమ్యస్థానం;
అందులో వారు యుగాల తరబడి ఉంటారు.
అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు.
సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం) తప్ప!
(వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా!
వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు.
పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు.
మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము.
కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము.
నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;
ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ!
మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు;
మరియు నిండి పొర్లే (మధు) పాత్ర
అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు.
(ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.
భూమ్యాకాశాలు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువైన అనంత కరుణామయుని (బహుమానం), ఆయన ముందు మాట్లాడే సాహసం ఎవ్వరికీ లేదు.
ఏ రోజునయితే ఆత్మ (జిబ్రీల్) మరియు దేవదూతలు వరుసలలో నిలిచి ఉంటారో! అప్పుడు ఆ అనంత కరుణామయుడు అనుమతించిన వాడు తప్ప, మరెవ్వరూ మాట్లాడలేరు; ఒకవేళ ఎవడైనా మాట్లాడినా అతడు సరైన మాటే మాట్లాడుతాడు.
అదే అంతిమ సత్యదినం. కావున ఇష్టమున్నవాడు, తన ప్రభువు వైపునకు చేరే మార్గాన్ని అవలంబించాలి!
నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.