ترجمة سورة العلق

الترجمة التلجوية
ترجمة معاني سورة العلق باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

చదువు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!
ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు.
చదువు! మరియు నీ ప్రభువు పరమదాత.
ఆయన కలం ద్వారా నేర్పాడు.
మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.
అలా కాదు! వాస్తవానికి, మానవుడు తలబిరుసుతనంతో ప్రవర్తిస్తాడు.
ఎందుకంటే, అతడు తనను తాను నిరపేక్షాపరుడిగా భావిస్తాడు.
నిశ్చయంగా నీ ప్రభువు వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది.
నీవు నిరోధించే వ్యక్తిని చూశావా?
నమాజ్ చేసే (అల్లాహ్) దాసుణ్ణి?
ఒకవేళ అతను (ముహమ్మద్!) సన్మార్గంపై ఉంటే నీ అభిప్రాయమేమిటి?
ఇంకా, దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే?
ఒకవేళ (ఆ నిరోధించే) వాడు సత్యాన్ని తిరస్కరించేవాడు మరియు సన్మార్గం నుండి విముఖుడయ్యేవాడైతే?
వాస్తవానికి, అల్లాహ్ అంతా చూస్తున్నాడని అతనికి తెలియదా?
అలా కాదు! ఒకవేళ అతడు మానుకోకపోతే, మేము అతడిని, నుదుటి జుట్టు వెంట్రుకలను పట్టి ఈడుస్తాము.
అది అబద్ధాలలో, అపరాధాలలో మునిగివున్న నుదురు!
అయితే, అతన్ని తన అనుచరులను పిలుచుకోమను!
మేము కూడా నరక దూతలను పిలుస్తాము!
అలా కాదు! నీవు అతని మాట వినకు మరియు ఆయనే (అల్లాహ్ కే) సాష్టాంగం (సజ్దా) చెయ్యి మరియు ఆయన (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందటానికి ప్రయత్నించు!
Icon