ترجمة سورة الإنفطار

الترجمة التلجوية
ترجمة معاني سورة الإنفطار باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఆకాశం చీల్చబడినప్పుడు!
మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!
మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.
ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?
ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.
తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.
అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!
మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.
వారు, గౌరవనీయులైన లేఖకులు;
మీరు చేసేదంతా తెలుసుకునేవారు!
నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.
తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.
మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.
మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?
ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.
Icon