ترجمة سورة الإنسان

الترجمة التلجوية
ترجمة معاني سورة الإنسان باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

అనంత కాలచక్రంలో, మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?
నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము.
నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు!
నిశ్చయంగా, మేము సత్యతిరస్కారుల కొరకు సంకెళ్ళను, మెడలో పట్టాలను మరియు భగభగ మండే నరకాగ్నిని (సఈరాను0 సిద్ధపరచి ఉంటాము.
నిశ్చయంగా, పుణ్యాత్ములు కాఫూర్ అనే ఒక చెలమ నుండి ఒక గిన్నెలో తెచ్చిన (పానీయాన్ని) త్రాగుతారు.
ధారాళంగా పొంగి ప్రవహింప జేయబడే ఊటల నుండి, అల్లాహ్ దాసులు త్రాగుతూ ఉంటారు.
వారు తమ మొక్కుబడులను పూర్తి చేసుకున్నవారై ఉంటారు. మరియు దాని హాని అన్ని వైపులా క్రమ్ముకొనే, ఆ దినమును గురించి భయపడుతూ ఉంటారు.
మరియు అది తమకు ప్రీతికరమైనప్పటికీ వారు నిరుపేదలకు మరియు అనాథలకు మరియు ఖైదీలకు, ఆహారం పెట్టేవారై ఉంటారు.
వార (వారితో ఇలా అంటారు): "వాస్తవానికి మేము అల్లాహ్ ప్రసన్నత కొరకే మీకు ఆహారం పెడుతున్నాము. మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలం గానీ, లేదా కృతజ్ఞతలు గానీ ఆశించటం లేదు.
నిశ్చయంగా, మేము మా ప్రభువు నుండి వచ్చే ఉగ్రమైన, దుర్భరమైన, ఆ దినానికి భయపడుతున్నాము!
కావున అల్లాహ్ వారిని ఆ దినపు కీడు నుండి కాపాడాడు. మరియు వారికి ఉల్లాసాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదించాడు.
మరియు వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్ని మరియు పట్టు వస్త్రాలను ఇచ్చాడు.
అందులో, వారు ఎత్తైన పీఠాల మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. అందులో వారు ఎండ (బాధ) గానీ, చలి తీవ్రతను గానీ చూడరు!
మరియు అందులో వారిపై నీడలు పడుతుంటాయి. దాని ఫలాల గుత్తులు వారికి అందుబాటులో ఉంటాయి.
మరియు వారి మధ్య వెండి పాత్రలు మరియు గాజుగ్లాసులు త్రిప్ప బడుతూ ఉంటాయి.
ఆ గాజు గ్లాసులు స్ఫటికం వలే తెల్లవైన వెండితో చేయబడి ఉంటాయి. అవి నియమబద్ధాం నింపబడి ఉంటాయి.
మరియు వారికి సొంటి కలిపిన మధుపాత్రలు త్రాగటానికి ఇవ్వబడతాయి.
అది స్వర్గంలోని సల్ సబీల్ అనే పేరు గల ఒక ఊట!
మరియు వారి మద్య శాశ్వతంగా, యవ్వనులుగా ఉంటే బాలురు తిరుగుతూ ఉంటారు. మరియు నీవు వారిని చూస్తే, వారిని వెదజల్లిన ముత్యాలుగా భావిస్తావు.
మరియు నీవు అక్కడ (స్వర్గంలో) చూస్తే, ఎక్కడ చూసినా ఆనందమే పొందుతావు. మరియు ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది.
వారి ఒంటి మీద సన్నని ఆకుపచ్చని శ్రేష్ఠమైన పట్టు వస్త్రాలు మరియు బంగారు జలతారు అల్లిన దుస్తులుంటాయి. మరియు వారికి వెండి కంకణాలు తొడిగించబడతాయి. మరియు వారి ప్రభువు వారికి నిర్మలమైన పానీయాన్ని త్రాగటానికి ప్రసాదిస్తాడు.
(వారితో ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, ఇది మీకు ఇవ్వబడే ప్రతిఫలం. ఎందుకంటే, మీ శ్రమ అంగీరించబడింది."
నిశ్చయంగా, మేమే, ఈ ఖుర్ఆన్ ను, నీ పై (ఓ ముహమ్మద్!) క్రమక్రమంగా అవతరింపజేశాము.
కావున నీవు నీ ప్రభువు యొక్క ఆజ్ఞపై స్థిరంగా ఉండు మరియు వీరిలోని ఏ పాపి యొక్క లేదా సత్యతిరస్కారుని యొక్క మాట గాని వినకు.
మరియు నీ ప్రభువు నామాన్ని ఉదయం మరియు సాయంత్రం స్మరిస్తూ ఉండు.
మరియు రాత్రివేళ ఆయన సన్నిధిలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉండు మరియు రాత్రివేళ సుదీర్ఘ కాలం, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.
నిశ్చయంగా, వీరు అనిశ్చితమైన ఈ ప్రాపంచిక జీవితం పట్ల మోహితులై వున్నారు. మరియు మున్ముందు రానున్న భారమైన దినాని విస్మరిస్తున్నారు.
మేమే వీరిని సృష్టించినవారము మరియు వీరి శరీరాన్ని దృఢ పరిచిన వారము. మరియు మేము కోరినప్పుడు వీరికి బదులుగా వీరి వంటి వారిని తేగలము.
నిశ్చయంగా, ఇదొక హితోపదేశం కావున ఇష్టపడినవాడు తన ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!
మరియు అల్లాహ్ కోరకపోతే, మీరు కోరేదీ (జరగదు)! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహావివేకవంతుడు.
ఆయన తాను కోరినవారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు ఆయన బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.
Icon