ترجمة سورة الملك

الترجمة التلجوية
ترجمة معاني سورة الملك باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఎవరి చేతిలోనయితే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.
ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: "ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?"
ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై అలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది.
మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము.
మరియు తన ప్రభువును (అల్లాహ్ ను) తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం.
వారు అందులోకి విసిరి వేయ బడినప్పుడు వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది.
అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడి నప్పుడు! దాని కాపలాదారులు వారితో: "ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు?" అని ప్రశ్నిస్తారు.
వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: 'అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!'"
ఇంకా వారు ఇలా అంటారు: "ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలో పడి వుండే వారితో చేరే వారము కాము కదా!"
అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక!
నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు.
ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!
భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి, మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలి పోవలసి ఉంది.
ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్రకంపనాలకు గురి అవుతుందో?
లేక ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు.
మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)?
ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు!
ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలే అడ్డుగా నిలిచి, మీకు సహాయపడ గల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి వున్నారు.
ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపి వేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు.
ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా?
వారితో ఇలా అను: "ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ!"
(ఇంకా) ఇలా అను: "ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు."
మరియు వారు ఇలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?"
వారితో ఇలా అను: "నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసే వాడిని మాత్రమే!"
తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే!"
(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు?"
వారితో ఇంకా ఇలా అను: "ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు!"
వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకి పోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు?"
Icon