ترجمة معاني سورة عبس
باللغة التلجوية من كتاب الترجمة التلجوية
.
من تأليف:
مولانا عبد الرحيم بن محمد
.
ﰡ
అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;
ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!
కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!
లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!
కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!
అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.
ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?
కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!
మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!
అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.
అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.
కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!
ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);
మహోన్నతమైనది, పవిత్రమైనది;
లేఖకుల (దేవదూతల) చేతులలో;
వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).
మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు!
ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?
అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;
ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;
మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.
అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.
ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!
నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.
ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!
తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;
మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;
మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;
మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;
మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!
ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;
మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;
మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;
ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.
ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;
అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.
మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.
అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;
అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.