ﰡ
(ఓ ప్రవక్తా!) వారు నిన్ను విజయధనం (అన్ ఫాల్) ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "విజయధనం అల్లాహ్ ది మరియు ఆయన సందేశహరునిది." కనుక మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీ పరస్పర సంబంధాలను సరిదిద్దుకోండి. మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి.
నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన సూచనలు (ఖుర్ఆన్) పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమే అవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.
వారే నమాజ్ ను స్థాపిస్తారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి (ఇతరులపై) ఖర్చు చేస్తారు.
అలాంటి వారు! వారే, నిజమైన విశ్వాసులు. వారి ప్రభువు వద్ద వారికి ఉన్నత స్థానాలు, క్షమాపణ మరియు గౌరవనీయమైన జీవనోపాధి ఉంటాయి.
(ఓ ప్రవక్తా!) ఎప్పుడైతే! నీ ప్రభువు నిన్ను సత్యస్థాపన కొరకు నీ గృహం నుండి (యుద్ధానికి) బయటకు తీసుకొని వచ్చాడో! అప్పుడు నిశ్చయంగా, విశ్వాసులలో ఒక పక్షం వారు దానికి ఇష్టపడలేదు;
సత్యం బహిర్గతమైన తరువాత కూడా, వారు దానిని గురించి నీతో వాదులాడుతున్నారు. అప్పుడు (వారి స్థితి) వారు చావును కళ్ళారా చూస్తూ ఉండగా! దాని వైపునకు లాగబడే వారి వలే ఉంది.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఆ రెండు పక్షాలలో, ఒక పక్షం మీ చేతికి తప్పక చిక్కుతుందని అల్లాహ్ మీతో వాగ్దానం చేసినప్పుడు; ఆయుధాలు లేని పక్షం మీకు దొరకాలని మీరు కోరుతూ ఉన్నారు. కాని అల్లాహ్ తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యాన్ని సత్యంగా నిరూపించాలనీ మరియు అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనీ కోరాడు.
అపరాధులు ఎంత అసహ్యించుకున్నా, సత్యాన్ని సత్యంగా నిరూపించాలని (నెగ్గించాలని) మరియు అసత్యాన్ని అసత్యంగా నిరూపించాలని (విఫలం చేయాలని) ఆయన (ఇచ్ఛ).
(జ్ఞాపకం చేసుకోండి!) మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించినపుడు ఆయన ఇలా జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను వేయి దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని పంపి మిమ్మల్ని బలపరుస్తాను."
మరియు మీకు శుభవార్తనిచ్చి, మీ హృదయాలకు శాంతి కలుగ జేయటానికే, ఈ విషయాన్ని అల్లాహ్ మీకు తెలిపాడు. మరియు వాస్తవానికి సహాయం (విజయం) కేవలం అల్లాహ్ నుంచే వస్తుంది. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
(జ్ఞాపకం చేసుకోండి!) ఆయన (అల్లాహ్), తన తరఫు నుండి మీకు మనశ్శాంతి కలుగజేయటానికి మీకు నిద్రమత్తును కలిగించాడు మరియు మీపై ఆకాశం నుండి నీటిని కురిపించాడు, దాని ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచటానికి మీ నుండి షైతాన్ మాలిన్యాన్ని దూరం చేయటానికి మరియు మీ హృదయాలను బలపరచటానికి మరియు మీ పాదాలను స్థిరపరచటానికీ!
నీ ప్రభువు దైవదూతలకు ఇచ్చిన దివ్యజ్ఞానాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను నిశ్చయంగా, మీతో ఉన్నాను. కావున మీరు విశ్వాసులకు ఈ విధంగా ధైర్యస్థైర్యాలను కలిగించండి: 'నేను సత్యతిరస్కారులైన వారి హృదయాలలో భయాన్ని కలిగిస్తాను, అప్పుడు మీరు వారి మెడలపై కొట్టండి మరియు వారి వ్రేళ్ళకొనలను నరికివేయండి.' "
ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. కాబట్టి ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకిస్తాడో! నిశ్చయంగా, అల్లాహ్ (అలాంటి వానికి) శిక్ష విధించటంలో ఎంతో కఠినుడు.
(ఓ సత్యతిరస్కారులారా!): "ఇదే (మీ శిక్ష), దీనిని మీరు చవిచూడండి! నిశ్చయంగా, సత్యతిరస్కారులకు నరకాగ్ని శిక్ష ఉంటుంది."
ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు సత్యతిరస్కారుల సైన్యాలను యుద్ధరంగంలో ఎదుర్కొన్నప్పుడు, వారికి మీ వీపులు చూపకండి (పారిపోకండి)!
మరియు ఆ దినమున వారికి వీపు చూపినవాడు - యుద్ధతంత్రం కోసమో, లేక (తమవారి) మరొక సమూహంలో చేరటానికో (వెనుదిరిగితే తప్ప) - తప్పక అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడవుతాడు మరియు అతని ఆశ్రయం నరకమే. అది ఎంత చెడ్డ గమ్యస్థానం!
మీరు వారిని చంపలేదు, కానీ అల్లాహ్ వారిని చంపాడు. (ప్రవక్తా!) నీవు (దుమ్ము) విసిరినపుడు, నీవు కాదు విసిరింది, కాని అల్లాహ్ విసిరాడు. మరియు విశ్వాసులను దీనితో పరీక్షించి, వారికి మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన ఇలా చేశాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఇదే (ఆయన ఇచ్ఛ!) మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల ఎత్తుగడలను బలహీనపరుస్తాడు.
(ఓ అవిశ్వాసులారా!) మీరు తీర్పు కోరితే, వాస్తవానికి మీకు తీర్పు లభించింది. ఇక మీద మీరు (దుర్మార్గాన్ని) మానుకుంటే అది మీకే మేలైనది. ఒకవేళ మీరు తిరిగి ఇలా చేస్తే మేము కూడా తిరిగి చేస్తాము. అప్పుడు మీ సైనికదళం ఎంత హెచ్చుగా ఉన్నా మీకెలాంటి లాభం చేకూర్చదు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసులతో ఉంటాడు.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. మరియు మీరు (అతని సందేశాలను) వింటూ కూడా, అతని (ప్రవక్త) నుండి మరలి పోకండి.
మరియు వాస్తవానికి వినకుండానే: "మేము విన్నాము!" అని అనే వారి వలే కాకండి.
తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే, నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన పశుజాతికి చెందినవారు.
మరియు అల్లాహ్ వారిలో కొంతైనా మంచితనాన్ని చూసి ఉంటే, వారిని వినేటట్లు చేసి ఉండేవాడు. (కాని వారిలో మంచితనం లేదు కాబట్టి), ఆయన వారిని వినేటట్లు చేసినా, వారు (తమ మూర్ఖత్వంలో) ముఖాలు త్రిప్పుకొని వెనుదిరిగి పోయేవారు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మీకు జీవనమిచ్చే దాని వైపునకు, మిమ్మల్ని పిలిచినప్పుడు దానికి జవాబు ఇవ్వండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మానవునికి మరియు అతని హృదయకాంక్షలకు మధ్య ఉన్నాడనీ మరియు నిశ్చయంగా, మీరంతా ఆయన వద్దనే సమీకరించబడతారని తెలుసుకోండి.
మరియు మీలోని దుర్మార్గులకు మాత్రమే గాక (అందరికీ) సంభవించబోయే ఆ విపత్తు గురించి భీతిపరులై ఉండండి. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడని తెలుసుకోండి.
మరియు ఆ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి: అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉన్నారు. భూమిపై మీరు బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని పారద్రోలుతారని (హింసిస్తారని) భయపడే వారు. అప్పుడు ఆయన మీకు ఆశ్రయమిచ్చి తన సహాయంతో మిమ్మల్ని బలపరచి, మీకు మంచి జీవనోపాధిని సమకూర్చాడు, బహుశా మీరు కృతజ్ఞులవుతారని.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి.
మరియు వాస్తవానికి మీ ఆస్తిపాస్తులు, మీ సంతానం పరీక్షా సాధనాలనీ మరియు నిశ్చయంగా, అల్లాహ్ వద్ద గొప్ప ప్రతిఫలం ఉన్నదనీ తెలుసుకోండి!
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.
మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు, నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు.
మరియు మా సూచనలు (ఆయాత్) వారికి వినిపించబడి నప్పుడు వారు: "వాస్తవానికి, మేము విన్నాము మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము (చెప్పగలము). ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే!" అని అంటారు.
మరియు వారు: "ఓ అల్లాహ్! ఇది (ఈ ఖుర్ఆన్) నిజంగా నీ తరపు నుండి వచ్చిన సత్యమే అయితే! మాపై ఆకాశం నుండి రాళ్ళ వర్షం కురిపించు! లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా!" అని పలికిన మాట (జ్ఞాపకం చేసుకోండి).
కాని (ఓ ముహమ్మద్!) నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు. మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా! అల్లాహ్ వారిని ఏ మాత్రం శిక్షించడు.
వారి వాదమేమిటీ? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా, వారు ప్రజలను మస్జిద్ అల్ హరామ్ నుండి ఆవుతున్నారు. దాని ధర్మకర్తలు కేవలం దేవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి, చాలా మంది ఇది తెలుసుకోలేరు.
మరియు (అల్లాహ్) గృహం (కఅబహ్) వద్ద వారి ప్రార్థనలు, కేవలం ఈలలు వేయటం (ముకాఅ) మరియు చప్పట్లు కొట్టడం (తస్దియహ్) తప్ప మరేమీ లేవు. కావున మీ సత్యతిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి.
నిశ్చయంగా, సత్యతిరస్కారులు, ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి, తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు; చివరకు అది వారి వ్యసనానికి (దుఃఖానికి) కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్యతిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు.
ఇదంతా అల్లాహ్, చెడును (దుష్టులను) మంచి (సత్పురుషుల) నుండి వేరు చేసి, దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి, ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారు, వారే నష్టపోయేవారు!
సత్యతిరస్కారులతో ఇలా అను: ఒకవేళ వారు మానుకుంటే గడిచిపోయింది క్షమించబడుతుంది. కాని వారు (పూర్వ వైఖరినే) మళ్ళీ అవలంబిస్తే! వాస్తవానికి, (దుష్టులైన) పూర్వీకుల విషయంలో జరిగిందే, మరల వారికి సంభవిస్తుంది!
మరియు అధర్మం (ఫిత్న) ఏ మాత్రం మిగలకుండా పోయే వరకు మరియు ఆరాధన (ధర్మం) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడనంత వరకు వారితో (సత్యతిరస్కారులతో) పోరాడుతూ ఉండండి. కాని వారు (పోరాడటం) మానుకుంటే! నిశ్చయంగా అల్లాహ్ వారి కర్మలను గమనిస్తున్నాడు.
మరియు ఒకవేళ వారు తిరిగిపోతే! నిశ్చయంగా, అల్లాహ్ మీ స్నేహితుడు (సంరక్షకుడు) అని తెలుసుకోండి. ఆయనే ఉత్తమ స్నేహితుడు (సంరక్షకుడు) మరియు ఉత్తమ సహాయకుడూను!
మరియు మీ విజయధనంలో నిశ్చయంగా, అయిదవ భాగం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు మరియు (అతని) దగ్గరి బంధువులకు మరియు అనాధులకు మరియు యాచించని పేదవారికి మరియు ప్రయాణీకులకు ఉందని తెలుసుకోండి, ఒకవేళ మీరు - అల్లాహ్ ను మరియు మేము సత్యాసత్యాల అంతరాన్ని విశదం చేసే దినమున, ఆ రెండు సైన్యాలు మార్కొనిన (బద్ర్ యుద్ధ) దినమున, మా దాసునిపై అవతరింపజేసిన దానిని - విశ్వసించేవారే అయితే! మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
(ఆ దినాన్ని గుర్తుకు తెచ్చుకోండి!) అప్పుడు మీరు లోయలో (మదీనాకు) సమీపంగా ఉన్న స్థలంలో ఉన్నారు మరియు వారు (ముష్రికులు) దూరంగా ఉన్న స్థలంలో ఉన్నారు. మరియు బిడారం మీకు క్రింది (ఒడ్డు) వైపునకు. ఒకవేళ మీరు (ఇరువురు) యుద్ధం చేయాలని నిర్ణయించుకొని ఉంటే! మీరు మీ నిర్ణయాన్ని పాటించకుండా ఉండేవారు. కాని అల్లాహ్ తాను నిర్ణయించిన కార్యాన్ని పూర్తి చేయటానికి, నశించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత నశించాలని మరియు జీవించేవాడు స్పష్టమైన నిదర్శనం పొందిన తరువాత జీవించాలని అలా చేశాడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు, నీ స్వప్నంలో వారిని కొద్దిమందిగా చూపింది (జ్ఞాపకం చేసుకో)! వారిని ఎక్కువ మందిగా నీకు చూపి ఉంటే, మీరు తప్పక ధైర్యాన్ని కోల్పోయి (యుద్ధ) విషయంలో వాదులాడే వారు. కాని వాస్తవానికి, అల్లాహ్ మిమ్మల్ని రక్షించాడు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి) అల్లాహ్ నెరవేర్చవలసిన పనిని నెరవేర్చటానికి - మీరు (బద్ర్ యుద్ధరంగంలో) మార్కొనినపుడు - వారి (అవిశ్వాసుల) సైన్యాన్ని మీ కన్నులకు కొద్దిగా చూపాడు మరియు మిమ్మల్ని కొద్దిమందిగా వారికి చూపాడు. మరియు అన్ని వ్యవహారాలూ (నిర్ణయానికి) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.
ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందవచ్చు!
మరియు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉండండి మరియు పరస్పర కలహాలకు గురి కాకండి, అట్లు చేస్తే మీరు బలహీనులవుతారు మరియు మీ బలసాహసాలు తగ్గిపోతాయి. మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.
మరియు తమ గృహాల నుండి, ప్రజలకు చూపటానికి దురాభిమానంతో బయలుదేరి ఇతరులను అల్లాహ్ మార్గం నుండి ఆపేవారి వలే కాకండి. మరియు వారు చేసే క్రియలన్నింటినీ అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.
మరియు (జ్ఞాపకం చేసుకోండి అవిశ్వాసులకు) వారి కర్మలు ఉత్తమమైనవిగా చూపించి షైతాన్ వారితో అన్నాడు: "ఈ రోజు ప్రజలలో ఎవ్వడునూ మిమ్మల్ని జయించలేడు, (ఎందుకంటే) నేను మీకు తోడుగా ఉన్నాను." కాని ఆ రెండు పక్షాలు పరస్పరం ఎదురు పడినపుడు, అతడు తన మడమలపై వెనకకు మరలి అన్నాడు: " వాస్తవంగా, నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు, మీరు చూడనిది నేను చూస్తున్నాను. నిశ్చయంగా, నేను అల్లాహ్ కు భయపడుతున్నాను. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు."
కపట విశ్వాసులు మరియు ఎవరి హృదయాలలో రోగముందో వారు: "వీరిని (ఈ విశ్వాసులను) వీరి ధర్మం మోసపుచ్చింది." అని అంటారు, కాని అల్లాహ్ యందు నమ్మకం గలవాని కొరకు, నిశ్చయంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు.
మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.
ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు."
ఫిర్ఔన్ జాతి వారి మరియు వారికి పూర్వం వారి మాదిరిగా, వీరు కూడా అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా వారిని శిక్షించాడు. నిశ్చయంగా అల్లాహ్ మహా బలవంతుడు, శిక్ష విధించటంలో చాలా కఠినుడు.
ఇది ఎందుకంటే! వాస్తవానికి, ఒక జాతి వారు, తమ నడవడికను తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారికి ప్రసాదించిన తన అనుగ్రహాన్ని ఉపసంహరించుకోడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
ఫిర్ఔన్ జాతివారు మరియు వారికి పూర్వం వారి మాదిరిగా! వీరు కూడా తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలను నిరాకరించారు. కాబట్టి వారి పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము. మరియు ఫిర్ఔను జాతి వారిని ముంచి వేశాము. మరియు వారందరూ దుర్మార్గులు.
నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో సత్యాన్ని తిరస్కరించే వారు నీచాతినీచమైన జీవులు, ఇక వారు విశ్వసించరు.
వారిలో ఎవరితోనైతే నీవు ఒడంబడిక చేసుకున్నావో! వారు ప్రతిసారీ తమ ఒడంబడికను భంగపరుస్తున్నారు. మరియు వారికి దైవభీతి లేదు.
ఒకవేళ నీవు యుద్ధరంగంలో వారిపై ప్రాబల్యం పొందితే - వారి వెనుక ఉన్నవారు చెల్లాచెదరై పోయేటట్లుగా - వారిని శిక్షించు. బహుశా వారు గుణపాఠం నేర్చుకోవచ్చు!
మరియు ఒకవేళ నీకు ఏ జాతి వారి వల్లనైనా నమ్మకద్రోహం జరుగుతుందనే భయం ఉంటే - మీరు ఇరుపక్షం వారు సరిసమానులని తెలుపటానికి - (వారి ఒప్పందాన్ని) వారి వైపుకు విసరివేయి. నిశ్చయంగా, అల్లాహ్ నమ్మకద్రోహులంటే ఇష్టపడడు.
మరియు సత్యతిరస్కారులు, తాము తప్పించుకున్నామని భావించ నవసరంలేదు. నిశ్చయంగా, వారు (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించుకోలేరు.
మరియు మీరు మీ శక్తి మేరకు బలసామగ్రిని, యుద్ధపు గుర్రాలను సిద్ధపరచుకొని, దాని ద్వారా అల్లాహ్ కు శత్రువులైన మీ శత్రువులను మరియు అల్లాహ్ కు తెలిసి, మీకు తెలియని ఇతరులను కూడా భయకంపితులుగా చేయండి. మరియు అల్లాహ్ మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ఫలితం మీకు పూర్తిగా చెల్లించ బడుతుంది. మరియు మీకెలాంటి అన్యాయం జరగదు.
కాని ఒకవేళ వారు శాంతి వైపుకు మొగ్గితే నీవు కూడా దానికి దిగు మరియు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.
కాని ఒకవేళ వారు నిన్ను మోసగించాలని సంకల్పిస్తే! నిశ్చయంగా, నీకు అల్లాహ్ యే చాలు. ఆయనే తన సహాయం ద్వారా మరియు విశ్వాసుల ద్వారా నిన్ను బలపరుస్తాడు.
మరియు ఆయనే వారి (విశ్వాసుల) హృదయాలను కలిపాడు. ఒకవేళ నీవు భూమిలో ఉన్న సమస్తాన్ని ఖర్చు చేసినా, వారి హృదయాలను కలుపజాలవు. కాని అల్లాహ్ యే వారి మధ్య ప్రేమను కలిగించాడు. నిశ్చయంగా, ఆయన సర్వ శక్తిసంపన్నుడు, మహా వివేచనాపరుడు.
ఓ ప్రవక్తా! నీకూ మరియు నిన్ను అనుసరించే విశ్వాసులకు అల్లాహ్ యే చాలు!
ఓ ప్రవక్తా! విశ్వాసులను యుద్ధానికి ప్రోత్సహించు. మీలో ఇరవై మంది స్థైర్యం గల వారుంటే, వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వంద మంది ఉంటే వేయి మంది సత్యతిరస్కారులను జయించగలరు. ఎందుకంటే వారు (సత్యాన్ని) గ్రహించలేని జాతికి చెందిన వారు.
ఇప్పుడు అల్లాహ్ మీ భారాన్ని తగ్గించాడు, ఎందుకంటే వాస్తవానికి, మీలో బలహీనత ఉన్నదని ఆయనకు తెలుసు. కాబట్టి మీలో వందమంది స్థైర్యం గలవారు ఉంటే వారు రెండు వందల మందిని జయించగలరు. మరియు మీరు వేయి మంది ఉంటే, అల్లాహ్ సెలవుతో రెండు వేల మందిని జయించగలరు. మరియు అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.
(శత్రువులతో తీవ్రంగా పోరాడి, వారిని) పూర్తిగా అణచనంత వరకు, తన వద్ద యుద్ధఖైదీలను ఉంచుకోవటం ధరణిలో, ఏ ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక సామగ్రి కోరుతున్నారు. కాని అల్లాహ్ (మీ కొరకు) పరలోక (సుఖాన్ని) కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
ఒకవేళ అల్లాహ్ (ఫర్మానా) ముందే వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్న దానికి (నిర్ణయానికి) మీకు ఘోరశిక్ష విధించబడి ఉండేది.
కావున మీకు ధర్మసమ్మతంగా లభించిన ఉత్తమమైన విజయధనాన్ని అనుభవించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఓ ప్రవక్తా! నీ ఆధీనంలో ఉన్న యుద్ధఖైదీలతో ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీ హృదయాలలో మంచితనం చూస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దాని కంటే ఎంతో ఉత్తమమైన దానిని మీకు ప్రసాదించి ఉంటాడు. మరియు మిమ్మల్ని క్షమించి ఉంటాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
కాని ఒకవేళ వారు నీకు నమ్మక ద్రోహం చేయాలని తలచుకుంటే, వారు ఇంతకు పూర్వం అల్లాహ్ కు నమ్మకద్రోహం చేశారు, కావున వారిపై నీకు శక్తినిచ్చాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.
నిశ్చయంగా, విశ్వసించి వలస పోయే వారూ మరియు తమ సంపద మరియు ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారూ, వారికి ఆశ్రయమిచ్చేవారూ మరియు సహాయం చేసేవారూ, అందరూ ఒకరికొకరు మిత్రులు. మరియు ఎవరైతే విశ్వసించి వలస పోలేదో వారు, వలస పోనంత వరకు వారి మైత్రిత్వంతో మీకు ఎలాంటి సంబంధం లేదు. కాని వారు ధర్మం విషయంలో మీతో సహాయం కోరితే, వారికి సహాయం చేయటం మీ కర్తవ్యం; కాని మీతో ఒడంబడిక ఉన్న జాతి వారికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు.
మరియు సత్యతిరస్కారులు ఒకరికొకరు స్నేహితులు. కావున (ఓ విశ్వాసులారా!) మీరు కూడా అలా చేయక (విశ్వాసుల మధ్య పరస్పర మైత్రిత్వాన్ని పెంచక) పోతే, భూమిలో ఉపద్రవం మరియు కల్లోలం చెలరేగుతాయి.
మరియు ఎవరైతే విశ్వసించి వలస పోయి అల్లాహ్ మార్గంలో పోరాడారో వారూ మరియు ఎవరైతే వారికి ఆశ్రయమిచ్చి సహాయపడ్డారో వారూ; ఇలాంటి వారే నిజమైన విశ్వాసులు. వారికి వారి (పాపాల) క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి ఉంటాయి.
మరియు ఎవరైతే తరువాత విశ్వసించి మరియు వలస పోయి మరియు మీతో బాటు (అల్లాహ్ మార్గంలో) పోరాడారో, వారు కూడా మీ వారే! కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం, రక్తసంబంధం గలవారు (వారసత్వ విషయంలో) ఒకరిపై నొకరు ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.