ترجمة سورة المزّمّل

الترجمة التلجوية
ترجمة معاني سورة المزّمّل باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఓ దుప్పటి కప్పుకున్నవాడా!
రాత్రంతా (నమాజ్ లో) నిలబడు, కొంత భాగాన్ని విడిచి;
దాని సగభాగంలో, లేదా దాని కంటే కొంత తక్కువ;
లేదా దాని కంటే కొంత ఎక్కువ; మరియు ఖుర్ఆన్ ను ఆగి ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు.
నిశ్చయంగా, మేము నీపై భారమైన సందేశాన్ని అవతరింప జేయబోతున్నాము.
నిశ్చయంగా, రాత్రివేళ లేవటం (మనస్సును) అదుపులో ఉంచుకోవటానికి ఎంతో ఉపయుక్తమైనది మరియు (అల్లాహ్) ప్రవచనాలను (అర్థం చేసుకోవటానికి) కూడా ఎంతో అనుగణమైనది.
వాస్తవానికి, పగటివేళ నీకు చాలా పనులుంటాయి.
మరియు నీవు నీ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉండు. మరియు అత్యంత శ్రద్థతో ఆయన వైపుకు మరలుతూ ఉండు.
ఆయనే తూర్పూ పడమరల స్వామి, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, కావున నీవు ఆయననే కార్యకర్తగా చేసుకో.
మరియు వారు పలికే మాటలకు సహనం వహించు మరియు మంచితనంతో వారి నుండి తొలగిపో.
మరియు అసత్యవాదులైన ఈ సంపన్నులను, నాకు వదలిపెట్టు. మరియు వారికి కొంత వ్యవధినివ్వు.
నిశ్చయంగా, మా వద్ద వారి కొరకు సంకెళ్ళు మరియు భగభగమండే నరకాగ్ని ఉన్నాయి.
మరియు గొంతులో ఇరుక్కుపోయే ఆహారం మరియు బాధాకరమైన శిక్ష (ఉన్నాయి).
ఆ రోజు భూమి మరియు పర్వతాలు కంపించి పోతాయి. మరియు పర్వతాలు ప్రవహించే ఇసుక దిబ్బలుగా మారిపోతాయి.
మేము ఫిర్ఔన్ వద్దకు సందేశహరుణ్ణి పంపినట్లు, నిశ్చయంగా మీ వద్దకు కూడా ఒక సందేశహరుణ్ణి, మీకు సాక్షిగా ఉండటానికి పంపాము.
కాని ఫిర్ఔన్ ఆ సందేశహరునికి అవిధేయత చూపాడు. కావున మేము అతనిని తీవ్రమైన శిక్షకు గురి చేశాము.
ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, బాలురను ముసలివారిగా చేసేటటు వంటి ఆ దినపు శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు?
అప్పుడు ఆకాశం బ్రద్దలై పోతుంది. ఆయన యొక్క వాగ్దానం తప్పక నెరవేరి తీరుతుంది.
నిశ్చయంగా, ఇదొక ఉపదేశం కావున ఇష్టమైన వాడు తన ప్రభువు వద్దకు పోయే మార్గాన్ని అవలంబించవచ్చు!
(ఓ ముహమ్మద్!) నీవు, వాస్తవానికి దాదాపు మూడింట రెండు వంతుల రాత్రి లేక సగం (రాత్రి) లేక మూడింట ఒక భాగం (నమాజ్ లో) నిలుస్తావనేది నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు నీతో పాటు ఉన్న వారిలో కొందరు కూడా! మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మీరు ఖచ్ఛితంగా పూర్తి రాత్రి ప్రార్థించలేరని ఆయనకు తెలుసు. కావున ఆయన మీ వైపునకు (కనికరంతో) మరలాడు. కావున ఖుర్ఆన్ ను, మీరు సులభంగా పఠించగలిగినంతే పఠించండి. మీలో కొందరు వ్యాధిగ్రస్తులు కావచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ భూమిలో ప్రయాణంలో ఉండవచ్చు. మరికొందరు అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ ఉండవచ్చు అని ఆయనకు బాగా తెలుసు. కావున మీకు దానిలో సులభమైనంత దానినే పఠించండి. మరియు నమాజ్ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి. మరియు అల్లాహ్ కు మంచి అప్పును, అప్పుగా ఇస్తూ ఉండండి. మరియు మీరు, మీ కొరకు ముందుగా చేసి పంపుకున్న మంచి కార్యాలన్నింటినీ అల్లాహ్ దగ్గర పొందుతారు. అదే చాలా ఉత్తమమైనది. మరియు దాని ప్రతిఫలం చాలా గొప్పది. మరియు మీరు అల్లాహ్ ను క్షమాభిక్ష అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Icon