ترجمة سورة إبراهيم

الترجمة التلجوية
ترجمة معاني سورة إبراهيم باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము.
ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది.
ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు.
మరియు మేము ప్రతి ప్రవక్తను అతని జాతివారి భాషతోనే పంపాము; అతను వారికి స్పష్టంగా బోధించటానికి, మరియు అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
మరియు వాస్తవానికి మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) పంపి: "నీ జాతి వారిని అంధకారాల నుండి వెలుతురు వైపునకు తెచ్చి, వారికి అల్లాహ్ దినాలను జ్ఞాపకం చేయించు." అని అన్నాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలురకు, కృతజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.
మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: " అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిర్ఔన్ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు, మీ కుమారులను వధించి, మీ కుమార్తెలను (స్త్రీలను) బ్రతకనిచ్చేవారు. మరియు అందులో మీకు, మీ ప్రభువు తరపు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది.
మరియు మీ ప్రభువు ప్రకటించింది (జ్ఞాపకం చేసుకోండి): "మీరు కృతజ్ఞులైతే! నేను మిమ్మల్ని ఎంతో అధికంగా అనుగ్రహిస్తాను. కాని ఒకవేళ మీరు కృతఘ్నులైతే! నిశ్చయంగా, నా శిక్ష ఎంతో కఠినమైనది.
మరియు మూసా ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు మరియు భూమిలో నున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే! తెలుసుకోండి నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు."
ఏమీ? పూర్వం గతించిన, ప్రజల గాథలు మీకు చేరలేదా? నూహ్, ఆద్ మరియు సమూద్ జాతి వారి మరియు వారి తరువాత వచ్చిన వారి (గాథలు)? వారిని గురించి అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరుగరు! వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు, వారు తమ నోళ్ళలో తమ చేతులు పెట్టుకొని ఇలా అన్నారు: "నిశ్చయంగా మేము మీతో పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము. మరియు నిశ్చయంగా, మీరు దేని వైపునకైతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, దానిని గురించి మేము ఆందోళన కలిగించేటంత సందేహంలో పడి వున్నాము."
వారి ప్రవక్తలు (వారితో) ఇలా అన్నారు: "ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన, అల్లాహ్ ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆయన మీ పాపాలను క్షమించటానికి మరియు మీకు ఒక నిర్ణీత కాలం వరకు వ్యవధి నివ్వటానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు!" వారన్నారు: "మీరు కూడా మా వంటి మానవులే, మీరు మా తండ్రితాతలు ఆరాధిస్తూ వచ్చిన (దైవాల) ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? అయితే స్పష్టమైన ప్రమాణం ఏదైనా తీసుకురండి."
వారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము మీ వంటి మానవులం మాత్రమే! కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు - అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప - మీ కొరకు ప్రమాణం తీసుకు రావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలని.
"మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనంతో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు, కేవలం అల్లాహ్ మీదే దృఢ నమ్మకం ఉంచుకోవాలి!"
మరియు సత్యతిరస్కారులు తమ ప్రవక్తలతో అన్నారు: "మీరు మా మతంలోకి తిరిగి రాకపోతే మేము తప్పకుండా మిమ్మల్ని మా దేశం నుండి వెళ్ళగొడ్తాము." అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాడు: "మేము ఈ దుర్మార్గులను తప్పక నాశనం చేస్తాము.
మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి (లెక్క చెప్పటానికి) భయపడేవానికి మరియు నా హెచ్చరికకు (శిక్షకు) భయపడేవానికి (నా వాగ్దానం)."
మరియు వారు తీర్పు కోరారు మరియు నిర్దయుడూ, (సత్య) విరోధి అయిన ప్రతి వాడూ నాశనమయ్యాడు.
అతని ముందు నరకం అతనికై వేచి ఉంటుంది మరియు అక్కడ సలసల కాగే చిక్కని చీములాంటి నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది.
దానిని అతడు గుటకలు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు. కాని దానిని మ్రింగలేడు. అతనికి ప్రతి వైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించలేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచి ఉంటుంది.
తమ ప్రభువును తిరస్కరించిన వారి కర్మలను, తుఫాను దినమున పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు. వారు తమ కర్మలకు ఎలాంటి ప్రతిఫలం పొందలేరు. ఇదే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోవటం.
ఏమీ? నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను సత్యంతో సృష్టించాడని నీకు తెలియదా?" ఆయన కోరితే మిమ్మల్ని నశింపజేసి, మరొక క్రొత్త సృష్టిని తేలగడు!
మరియు అలా చేయటం అల్లాహ్ కు కష్టమైన పని కాదు.
మరియు వారందరూ అల్లాహ్ ముందు హాజరు పరచబడి నప్పుడు, (ఇహలోకంలో) బలహీనులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్న వారితో అంటారు: "వాస్తవానికి ప్రపంచంలో మేము మిమ్మల్ని అనుసరించాము, ఇపుడు మీరు మమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటానికి ఏమైనా చేయగలరా?" వారంటారు: "అల్లాహ్ మాకు సన్మార్గం చూపి ఉంటే మేము మీకు కూడా (సన్మార్గం) చూపి ఉండేవారం. ఇపుడు మనం దుఃఖపడినా లేదా సహనం వహించినా అంతా ఒక్కటే! మనకిప్పుడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు."
మరియు తీర్పు జరిగిన తరువాత షైతాను (వారితో) అంటాడు: "నిశ్చయంగా, అల్లాహ్ మీకు చేసిన వాగ్దానమే సత్యమైన వాగ్దానం. మరియు నేను మీకు వాగ్దానం చేసి దానిని భంగం చేశాను. మరియు నాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు; నేను కేవలం మిమ్మల్ని ఆహ్వానించాను, మీరు స్వీకరించారు. కావున మీరు నన్ను నిందించకండి మిమ్మల్ని మీరే నిందించుకోండి. నేను మీకు సహాయం చేయలేను మరియు మీరూ నాకు సహాయం చేయలేరు. ఇంతకు ముందు మీరు నన్ను (అల్లాహ్ కు) సాటిగా కల్పించిన దాన్ని నిశ్చయంగా నేను తిరస్కరిస్తున్నాను. నిశ్చయంగా, దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష ఉంటుంది.
మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అనబడుతుంది.
మంచి మాట (కలిమయె తయ్యిబ్) ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో! దాని వ్రేళ్ళు (భూమిలో) స్థిరంగా నాటుకొని ఉంటాయి. మరియు దాని శాఖలు ఆకాశాన్ని (అంటుకొంటున్నట్లు) ఉంటాయి.
తన ప్రభువు ఆజ్ఞతో, అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు.
మరియు చెడ్డమాటను, భూమి నుండి పెల్లగింపబడిన, స్థిరత్వం లేని, ఒక చెడ్డ జాతి చెట్టుతో పోల్చవచ్చు!
విశ్వసించి తమ మాటపై స్థిరంగా ఉన్నవారిని అల్లాహ్ ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ స్థిరపరుస్తాడు మరియు అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్ర,ష్టులుగా చేస్తాడు. మరియు అల్లాహ్ తాను కోరినది చేస్తాడు.
ఏమీ? నీవు చూడలేదా (ఎరుగవా)? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశ గృహంలోకి త్రోసినవారిని -
(అంటే) నరకం! వారంతా అందులో ప్రవేశిస్తారు. మరియు అది ఎంత దుర్భరమైన నివాసము.
మరియు (ప్రజలను) ఆయన మార్గం నుండి తప్పించటానికి వారు అల్లాహ్ కు సమానులను (అందాదులను) కల్పించారు. వారితో అను: "మీరు (తాత్కాలికంగా) సుఖసంతోషాలను అనుభవించండి. ఎందుకంటే! నిశ్చయంగా, మీ గమ్యస్థానం నరకాగ్నియే!"
నా దాసులలో విశ్వసించిన వారితో నమాజు స్థాపించమని మరియు మేము వారికిచ్చిన ఉపాధి నుండి రహస్యంగానో బహిరంగంగానో - బేరం జరుగటం గానీ, మిత్రుల సహాయం పొందటం గానీ సాధ్యం కాని దినం రాక పూర్వమే - ఖర్చు పెట్టమని చెప్పు.
అల్లాహ్ ! ఆయనే, భూమ్యాకాశాలను సృష్టించాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టింటాడు. మరియు తన ఆజ్ఞతో, ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు.
మరియు ఎడతెగకుండా, నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు.
మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు.
మరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతినిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు!
ఓ మా ప్రభూ! నిశ్చయంగా, అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు, నిశ్చయంగా, నా వాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే! నిశ్చయంగా, నీవు క్షమాశీలుడవు, అపార కరుణా ప్రదాతపు.
ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం (కఅబహ్) దగ్గర, పైరు పండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ! వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు.
ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము దాచేదంతా మరియు వ్యక్త పరచేదంతా నీకు తెలుసు. మరియు భూమిలో గానీ, ఆకాశంలో గానీ అల్లాహ్ నుండి దాగి ఉన్నది ఏదీ లేదు.
సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయీల్ మరియు ఇస్ హాఖ్ లను ప్రసాదించాడు. నిశ్చయంగా, నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు.
"ఓ నా ప్రభూ! నన్ను మరియు నా సంతతి వారిని నమాజ్ స్థాపించే వారిగా చేయి. ఓ మా ప్రభూ! నా ప్రార్థనలను స్వీకరించు.
ఓ మా ప్రభూ! నన్నూ నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు క్షమించు."
మరియు ఈ దుర్మార్గుల చేష్టల నుండి అల్లాహ్ నిర్లక్ష్యంగా ఉన్నాడని నీవు భావించకు. నిశ్చయంగా, ఆయన వారిని - వారి కళ్ళు, రెప్ప వేయకుండా ఉండిపోయే - ఆ రోజు వరకు వ్యవధి నిస్తున్నాడు.
(ఆ రోజు) వారు తలలు పైకెత్తి, పరిగెత్తుతూ ఉంటారు, పై చూపులు పైనే నిలిచి ఉంటాయి. మరియు వారు శూన్యహృదయులై ఉంటారు.
మరియు (ఓ ముహమ్మద్!) శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసిన వారు అంటారు: "ఓ మా ప్రభూ! నీ సందేశాన్ని స్వీకరించటానికి, ప్రవక్తలను అనుసరించటానికి, మాకు మరికొంత వ్యవధినివ్వు!" (వారికి ఇలాంటి సమాధాన మివ్వబడుతుంది): "ఏమీ? ఇంతకు ముందు 'మాకు వినాశం లేదు' అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరే కాదా?
"మరియు తమకు తాము అన్యాయం చేసుకున్న వారి స్థలాలలో మీరు నివసించారు. మరియు వారితో ఎలా వ్యవహరించామో మీకు బాగా తెలుసు. మరియు మేము మీకు ఎన్నో ఉపమానాలు కూడా ఇచ్చాము."
మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్ కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింప గలిగేది కాదు.
కనుక అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా, అల్లాహ్! సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.
ఈ భూమి మరొక భూమిగా మరియు ఆకాశాలు (వేరే ఆకాశాలుగా) మారే రోజు; ఆ అద్వితీయుడు, ప్రబలుడు అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరు చేయబడతారు.
మరియు ఆ రోజు అపరాధులను సంకెళ్ళలో, కూడబెట్టి, బంధించి ఉంచటాన్ని నీవు చూస్తావు.
వారి వస్త్రాలు తారు (నల్ల జిడ్డు ద్రవం)తో చేయబడి ఉంటాయి మరియు అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకొని ఉంటాయి -
అల్లాహ్ ప్రతి ప్రాణికి దాని కర్మల ప్రతిఫలం ఇవ్వటానికి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.
ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది.
Icon