ترجمة سورة القمر

الترجمة التلجوية
ترجمة معاني سورة القمر باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు.
అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు.
మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.
మరియు వాస్తవానికి, వారి వద్దకు సమాచారాలు వచ్చాయి. అందు వారికి మందలింపులు ఉండేవి.
కావలసినంత వివేకమూ ఉండేది. కాని ఆ హెచ్చరికలు వారికి ప్రయోజనకరం కాలేదు.
కావున (ఓ ముహమ్మద్!) నీవు వారి నుండి మరలిపో! పిలిచేవాడు భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున;
వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, వారు చెల్లాచెదురైన మిడతల వలే, తమ గోరీల నుండి లేచి బయటికి వస్తారు;
వేగంగా పిలిచేవాని వైపునకు! సత్యతిరస్కారులు: "ఇది చాలా కఠినమైన రోజు." అని అంటారు.
వారికి పూర్వం నూహ్ జాతి వారు (తమ ప్రవక్తను) అసత్యవాదుడని తిరస్కరించి ఉన్నారు, అప్పుడు వారు మా దాసుణ్ణి: "అసత్యవాది!" అని అన్నారు. మరియు :"ఇతడు పిచ్చివాడు" అని అన్నారు. మరియు అతను కసిరికొట్టబడ్డాడు.
అప్పుడతను తన ప్రభువును ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా నేను ఓడిపోయాను కావున నాకు సహాయం చేయి!"
అప్పుడు మేము ఆకాశపు ద్వారాలు తెరిచి కుంభవర్షాన్ని కురిపించాము.
మరియు భూమి నుండి ఊటలను పొంగింపజేశాము అపుడు నిర్ణీత కార్యానికి గాను నీళ్ళన్నీ కలిసి పోయాయి.
మరియు మేము అతనిని (నూహ్ ను) పలకలు మరియు మేకులు గల దాని (ఓడపై) ఎక్కించాము.
అది మా కన్నుల ముందు తేలియాడుతూ పోయింది. (తన జాతి వారి చేత) తిరస్కరించబడిన వానికి ప్రతిఫలంగా!
మరియు వాస్తవానికి మేము దానిని (ఆ ఓడను) ఒక సూచనగా చేసి వదలి పెట్టాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
ఆద్ జాతి సత్యాన్ని తిరస్కరించింది. చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
నిశ్చయంగా, మేము పూర్తిగా దురదృష్టకరమైన (అరిష్టదాయకమైన) ఒక రోజున, తీవ్రమైన ఎడతెగని తుఫాను గాలిని పంపాము.
అది ప్రజలను వేర్లతో పెళ్ళగింపబడిన ఖర్జూరపు చెట్ల వలే పెళ్ళగించి వేసింది.
ఇక చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటం కోసం సులభం చేశాము, అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
సమూద్ జాతి హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.
అప్పుడు వారు ఇలా అన్నారు: "ఏమీ? మాలోని ఒక వ్యక్తిని, ఒంటరివాడిని, మేము అనుసరించాలా? అలా అయితే నిశ్చయంగా, మేము మార్గభ్రష్టులం మరియు పిచ్చివారం అయినట్లే కదా?"
"ఏమీ? మా అందరిలో, కేవలం అతని మీదనే (దివ్య) సందేశం పంపబడిందా? అలా కాదు! అసలు అతను అసత్యవాది, డంబాలు పలికేవాడు!"
అసత్యవాది, డంబాలు పలికేవాడు! ఎవడో రేపే (త్వరలోనే) వారికి తెలిసిపోతుంది!
నిశ్చయంగా, మేము ఆడ ఒంటెను, వారిని పరీక్షించటం కోసం పంపుతున్నాము, కావున (ఓ సాలిహ్!) వారి విషయంలో వేచి ఉండు మరియు సహనం వహించు!
మరియు వారి మధ్య నీరు (న్యాయంగా) పంచబడాలని వారికి బోధించు. ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే రోజునే త్రాగాలని నియమించబడింది.
ఆ పిదప వారు తమ సహచరుణ్ణి పిలిచారు. వాడు దాన్ని పట్టుకొని (దాని వెనుక కాలి మోకాలి నరాలు కోసి) చంపాడు.
అప్పుడు చూశారా! నా శిక్ష మరియు నా హెచ్చరికలు ఎలా ఉండెనో?
నిశ్చయంగా, మేము వారి మీదకు ఒక భయంకరమైన శబ్దాన్ని (సయ్ హాను) పంపాము, దాంతో వారు త్రొక్క బడిన పశువుల దొడ్డి కంచె వలే నుగ్గునుగ్గు అయి పోయారు.
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
లూత్ జాతి కూడా హెచ్చరికలను అసత్యాలని తిరస్కరించింది.
నిశ్చయంగా, మేము లూత్ ఇంటివారు తప్ప! ఇతరుల మీదికి రాళ్ళు విసిరే తుఫాన్ గాలిని పంపాము. (లూత్ ఇంటి) వారిని మేము వేకువ ఝామున రక్షించాము;
మా తరఫు నుండి అనుగ్రహంగా. ఈ విధంగా మేము కృతజ్ఞులకు ప్రతిఫలం ఇస్తాము.
మరియు వాస్తవానికి (లూత్ తన జాతి) వారిని మా రాబోయే శిక్షను గురించి హెచ్చరించాడు. కాని వారు మా హెచ్చరికలను సందేహించి (మొండి) వాదనలకు దిగారు!
మరియు వాస్తవానికి వారు అతని అతిథులను అతని నుండి బలవంతంగా లాక్కోవాలని అనుకున్నారు. కావున మేము వారి కళ్ళను పోగొట్టాము. (వారితో ఇలా అన్నాము): "ఇప్పుడు నా శిక్షను మరియు నా హెచ్చరికను చవి చూడండి."
మరియు వాస్తవానికి, ఉదయపు వేళ శాశ్వతమైన శిక్ష వారి మీద పడింది:
"ఇప్పుడు మీరు నా శిక్షను మరియు నా హెచ్చరికలను చవి చూడండి."
మరియు వాస్తవానికి, మేము ఈ ఖుర్ఆన్ ను హితబోధ గ్రహించటానికి సులభం చేశాము. అయితే హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
మరియు వాస్తవానికి ఫిర్ఔన్ జాతి వారికి కూడా హెచ్చరికలు వచ్చాయి.
వారు మా సూచనలను అన్నిటినీ అబద్ధాలని తిరస్కరించారు, కావున మేము వారిని పట్టుకున్నాము, సర్వశక్తిమంతుడు సర్వసమర్ధుడు పట్టుకునే విధంగా!
(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా?
లేక వారు: "మాది ఒక శక్తిగల వర్గం, (కావున) మేము ప్రాబల్యం పొందగలం" అని అంటున్నారా?
కాని త్వరలోనే ఈ శక్తిగల వర్గం పరాజయం పొందగలదు. మరియు వారు వెన్నుచూపి పారిపోతారు.
అంతేకాదు! అంతిమ ఘడియయే, వారి వాగ్దాన సమయం మరియు ఆ ఘడియ ఎంతో దారుణమైనది మరియు ఎంతో తీవ్రమైనదీను (చేదైనదీను).
నిశ్చయంగా, పాపాత్ములు మార్గభ్రష్టత్వంలో ఉన్నారు మరియు వారు (పరలోకంలో) నరకాగ్నిలో కాలుతారు.
ఆ రోజు వారు తమ ముఖాల మీద నరకాగ్ని లోకి ఈడ్చబడతారు; (వారితో):"నరకాగ్ని స్పర్శను చవి చూడండి!" అని అనబడుతుంది.
నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.
మరియు మా ఆజ్ఞ కేవలం ఒక్కటే చాలు, కనురెప్పపాటుది, (అది అయిపోతుంది).
మరియు వాస్తవానికి, మేము మీ వంటి వారిని, ఎందరినో నాశనం చేశాము. అయితే, హితబోధ స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?
మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది.
మరియు ప్రతి చిన్న మరియు ప్రతి పెద్ద విషయం అన్నీ వ్రాయబడి ఉన్నాయి.
నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో సెలయేళ్ళ దగ్గర ఉంటారు.
సత్యపీఠం మీద, విశ్వసామ్రాట్టు, సర్వసమర్ధుని సన్నిధిలో.
Icon