ترجمة سورة الحاقة

الترجمة التلجوية
ترجمة معاني سورة الحاقة باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఆ అనివార్య సంఘటన (పునరుత్థానం)!
ఏమిటా అనివార్య సంఘటన?
మరియు ఆ అనివార్య సంఘటన, అంటే ఏమిటో నీకేమి తెలుసు?
సమూద్ మరియు ఆద్ జాతి వారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ ఉపద్రవాన్ని అసత్యమని తిరస్కరించారు.
కావున సమూద్ జాతి వారైతే ఒక భయంకరమైన గర్జన ద్వారా నాశనం చేయబడ్డారు.
మరియు ఆద్ జాతి వారేమో అతి తీవ్రమైన తుఫాను గాలి ద్వారా నాశనం చేయబడ్డారు.
ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు!
అయితే ఇప్పుడు వారిలో ఎవరైనా మిగిలి ఉన్నట్లు నీవు చూస్తున్నావా?
ఫిర్ఔన్ మరియు అతనికి పూర్వం గతించిన వారూ మరియు తలక్రిందులు చేయబడిన నగరాల వారూ, అందరూ గొప్ప నేరాలకు పాల్పడినవారే.
మరియు వారు తమ ప్రభువు పంపిన ప్రవక్తలకు అవిధేయత కనబరచారు, కావున ఆయన వారిని కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.
నిశ్చయంగా, ఎప్పుడైతే (నూహ్ తుఫాన్) నీరు హద్దు లేకుండా ఉప్పొంగి పోయిందో! అప్పుడు మేము, మిమ్మల్ని పయనించే (నావలో) ఎక్కించాము.
దానిని, మీకొక హితబోధగానూ మరియు జ్ఞాపకముంచుకోగల చెవి, దానిని జ్ఞాపకం ఉంచుకోవటానికి అనువైనదిగా చేశాము.
ఇక ఎప్పుడైతే ఒక పెద్ద ధ్వనితో బాకా ఊదబడుతుందో!
మరియు భూమి మరియు పర్వతాలు పైకి ఎత్తబడి ఒక పెద్ద దెబ్బతో తుత్తునియలుగా చేయబడతాయో!
అప్పుడు, ఆ రోజున సంభవించవలసిన ఆ అనివార్య సంఘటన సంభవిస్తుంది.
మరియు ఆ రోజున ఆకాశం బ్రద్దలై పోతుంది మరియు దాని వ్యవస్థ సడలి పోతుంది.
మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు.
ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు.
ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: "ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి!
నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని!"
కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు.
అత్యున్నతమైన స్వర్గవనంలో.
దాని పండ్లగుత్తులు, సమీపంలో వ్రేలాడుతూ ఉంటాయి.
(వారితో ఇలా అనబడుతుంది): "గడిచి పోయిన దినాలలో మీరు చేసి పంపిన కర్మలకు ప్రతిఫలంగా, ఇప్పుడు మీరు హాయిగా తినండి మరియు త్రాగండి!"
ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: "అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది!
మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది!
అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది!
నా సంపద నాకేమీ పనికి రాలేదు;
నా అధికారమంతా అంతమై పోయింది!"
(అప్పుడు ఇలా ఆజ్ఞ ఇవ్వబడుతుంది): "అతన్ని పట్టుకోండి మరియు అతని మెడలో సంకెళ్ళు వేయండి;
తరువాత అతనిని భగభగమండే నరకాగ్నిలో వేయండి.
ఆ తరువాత అతనిని డెబ్భై మూరల పొడవు గల గొలుసుతో బంధించండి!"
వాస్తవానికి అతడు సర్వోత్తముడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.
మరియు నిరుపేదలకు ఆహారం పెట్టమని ప్రోత్సహించేవాడు కాదు.
కావున, ఈనాడు అతనికి ఇక్కడ ఏ స్నేహితుడూ లేడు;
మరియు అసహ్యకరమైన గాయాల కడుగు తప్ప, మరొక ఆహారమూ లేదు!
దానిని పాపులు తప్ప మరెవ్వరూ తినరు!
కావున, నేను మీరు చూడగలిగే వాటి శపథం చేస్తున్నాను;
మరియు మీరు చూడలేనట్టని వాటి (శపథం) కూడా!
నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుని (పై అవతరింప జేయబడిన) వాక్కు.
మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ.
మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ.
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది.
ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే!
మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం.
తరువాత అతని (మెడ) రక్తనాళాన్ని కోసేవారం.
అప్పుడు మీలో నుండి ఏ ఒక్కడు కూడా అతనిని (మా శిక్ష నుండి) కాపాడ లేక పోయేవాడు.
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) దైవభీతి గల వారికొక హితోపదేశం.
మరియు నిశ్చయంగా మీలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని అనేవారు ఉన్నారని మాకు బాగా తెలుసు.
మరియు నిశ్చయంగా, ఇది (ఈ తిరస్కారం) సత్యతిరస్కారులకు దుఃఖ కారణమవుతుంది.
మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నమ్మదగిన సత్యం.
కావున నీవు సర్వోత్తముడైన నీ ప్రభువు పవిత్ర నామాన్ని స్తుతించు.
Icon