ترجمة سورة النجم

الترجمة التلجوية
ترجمة معاني سورة النجم باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

అస్తమించే నక్షత్రం సాక్షిగా!
మీ సహచరుడు (ముహమ్మద్), మార్గభ్రష్టుడు కాలేదు మరియు తప్పు దారిలోనూ లేడు.
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.
అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
అది అతనికి మహా బలవంతుడు (జిబ్రీల్) నేర్పాడు.
అతను శక్తిసామర్ధ్యాలు గలవాడు, తన వాస్తవరూపంలో ప్రత్యక్షమయినప్పుడు;
అతను ఎత్తైన దిజ్ఞ్మండలంలో (దిక్చక్రంలో) కనిపించాడు.
తరువాత సమీపించాడు, మరింత క్రిందికి దిగి వచ్చాడు.
అప్పుడు అతను రెండు ధనస్సుల దూరంలోనో లేక అంతకంటే తక్కువ దూరంలోనో ఉన్నాడు.
అప్పుడు అతను (జిబ్రీల్), ఆయన (అల్లాహ్) దాసునిపై అవతరింప జేయవలసిన, దానిని (వహీని) అవతరింపజేశాడు.
అతను (ప్రవక్త) చూసిన దానిని, అతని హృదయం అబద్ధమని అనలేదు.
అయితే మీరు, అతను (కళ్ళారా) చూసిన దానిని గురించి (అతనితో) వాదులాడుతారా?
మరియు వాస్తవానికి అతను (ప్రవక్త) అతనిని (జిబ్రీల్ ను) మరొకసారి (ప్రత్యక్షంగా) అవతరించినప్పుడు చూశాడు.
(సప్తాకాశంలో) చివరి హద్దులో నున్న రేగు చెట్టు (సిదరతుల్ మున్తహా) దగ్గర.
అక్కడికి దగ్గరలోనే జన్నతుల్ మా'వా ఉంది.
అప్పుడు ఆ సిదరహ్ వృక్షాన్ని కప్పేది కప్పేసినప్పుడు!
అతని (ప్రవక్త) దృష్టి తప్పిపోనూ లేదు మరియు హద్దుదాటి కూడా పోలేదు.
వాస్తవంగా, అతను (ముహమ్మద్) తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను (ఆయాత్ లను) చూశాడు.
మీరు, అల్ లాత్ మరియు అల్ ఉజ్జాను గురించి ఆలోచించారా?
మరియు మూడవదీ చివరిది అయిన మనాత్ ను (గురించి కూడా)?
మీ కొరకైతే కుమారులు మరియు ఆయన కొరకు కుమార్తెలా?
ఇది అన్యాయమైన విభజన కాదా!
ఇవన్నీ మీరు మరియు మీ తండ్రి తాతలు పెట్టిన పేర్లు మాత్రమే, అల్లాహ్ వీటిని గురించి ఎట్టి ప్రమాణం అవతరింప జేయలేదు. వారు, కేవలం తమ ఊహాగానాలను మరియు తమ ఆత్మలు కోరే మనోవాంఛలను మాత్రమే అనుసరిస్తున్నారు. వాస్తవానికి వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు మార్గదర్శకత్వం కూడా వచ్చి ఉన్నది!
ఏమిటి? మానవునికి తాను కోరినదంతా లభిస్తుందా?
వాస్తవానికి, అంతిమ (పరలోకం) మరియు ప్రథమం (ఇహలోకం) అన్నీ అల్లాహ్ కే చెందినవి.
మరియు ఆకాశాలలో ఎందరో దేవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏ మాత్రం పనికిరాదు; అల్లాహ్ ఎవరి పట్లనైతే ప్రసన్నుడై, తన ఇష్టంతో వారికి అనుమతిస్తేనే తప్ప!
నిశ్చయంగా, ఎవరైతే పరలోక జీవితాన్ని విశ్వసించరో! వారే దేవదూతలను స్త్రీల పేర్లతో పిలుస్తారు;
ఈ విషయం గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం తమ ఊహలనే అనుసరిస్తున్నారు. కాని వాస్తవానికి, ఊహ సత్యానికి ఏ మాత్రం బదులు కాజాలదు.
కావున, మా హితబోధ (ఖుర్ఆన్) నుండి ముఖం త్రిప్పుకొని ఇహలోక జీవితం తప్ప మరేమీ కోరని వ్యక్తిని నీవు పట్టించుకోకు,
ఇదే వారి జ్ఞానపరిధి. నిశ్చయంగా, నీ ప్రభువుకు, ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడో తెలుసు. మరియు ఎవడు సన్మార్గంలో ఉన్నాడో కూడా, ఆయనకు బాగా తెలుసు.
మరియు ఆకాశాలలో నున్నది మరియు భూమిలో నున్నది, అంతా అల్లాహ్ కే చెందుతుంది. దుష్టులకు వారి కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికి మరియు సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి.
ఎవరైతే చిన్న చిన్న తప్పులు తప్ప, పెద్ద పాపాల నుండి మరియు అసహ్యకరమైన పనుల నుండి దూరంగా ఉంటారో వారి కొరకు, నిశ్చయంగా, నీ ప్రభువు క్షమాపణ పరిధి చాలా విశాలమైనది. మిమ్మల్ని మట్టి నుండి సృష్టించినప్పటి నుండి మరియు మీ తల్లుల గర్భాలలో పిండాలుగా ఉన్నప్పటి నుండి కూడా, ఆయనకు మీ గురించి బాగా తెలుసు. కావున మీరు మీ పవిత్రతను గురించి (గొప్పలు) చెప్పుకోకండి. ఎవడు భయభక్తులు గలవాడో ఆయనకు బాగా తెలుసు.
నీవు (ఇస్లాం నుండి) మరలి పోయే వాడిని చూశావా?
మరియు (అల్లాహ్ మార్గంలో) కొంత మాత్రమే ఇచ్చి, చేయి ఆపుకునేవాడిని?
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి?
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా?
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము;
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని;
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని;
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని;
అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని;
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని;
మరియు నిశ్చయంగా, ఆయనే నిన్ను నవ్విస్తున్నాడు మరియు ఏడ్పిస్తున్నాడని;
మరియు నిశ్చయంగా, ఆయనే మరణింపజేసేవాడు మరియు జీవితాన్ని ప్రసాదించేవాడని;
మరియు నిశ్చయంగా, మగ-ఆడ జంటలను సృష్టించినవాడు ఆయనేనని -
విసర్జింపబడిన వీర్యబిందువు నుండి.
మరియు నిశ్చయంగా, దానికి మరొక జీవితాన్ని (పునరుత్థానం) ప్రసాదించడం ఆయన (అల్లాహ్) కే చెందినదని;
మరియు నిశ్చయంగా, ఆయనే సంపన్నునిగా చేసేవాడు మరియు తృప్తినిచ్చు వాడని;
మరియు నిశ్చయంగా ఆయనే అగ్ని నక్షత్రానికి ప్రభువని;
మరియు నిశ్చయంగా, ఆయనే తొలి ఆద్ జాతిని నాశనం చేసినవాడని;
మరియు సమూద్ జాతిని; ఒక్కడూ కూడా లేకుండా రూపుమాపాడని.
మరియు అంతకు పూర్వం నూహ్ జాతి వారిని. నిశ్చయంగా, వారు పరమ దుర్మార్గులు మరియు తలబిరుసులు.
మరియు ఆయనే తలక్రిందులైన నగరాలను నాశనం చేశాడు.
తరువాత వాటిని క్రమ్ముకొనవలసింది (రాళ్ళ వర్షం) క్రమ్ముకున్నది.
అయితే (ఓ మానవుడా!) నీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను గురించి నీవు అనుమానంలో పడి ఉంటావు?
ఇది వరకు వచ్చిన హెచ్చరిక చేసే వారి వలే ఇతను (ముహమ్మద్) కూడా హెచ్చరిక చేసేవాడు మాత్రమే!
రానున్న ఘడియ (పునరుత్థాన దినం) సమీపంలోనే వుంది.
అల్లాహ్ తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు.
ఏమీ? మీరు ఈ సందేశాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారా?
మరియు మీరు నవ్వుతున్నారా?మరియు మీకు ఏడ్పు రావటం లేదా?
మరియు మీరు నిర్లక్ష్యంలో మునిగి ఉన్నారు.
కావున! అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి. మరియు (ఆయనను మాత్రమే) ఆరాధించండి!
Icon